మున్సిపల్‌ కార్యాలయం రణరంగం

30 Dec, 2016 17:32 IST|Sakshi
దాడి చేసుకుంటున్న ఇరువర్గాలు
-  షాపు టెండర్‌ వేసే విషయంలో ఇరు వర్గాల ఘర్షణ 
– ఆర్వో కార్యాలయం ధ్వంసం
– 18కు టెండర్‌ వాయిదా
 
ఎమ్మిగనూరు: స్థానిక మున్సిపల్‌ కార్యాలయం రణరంగమైంది. ఓ షాపు టెండర్‌ కోసం ఇరు వర్గాలు ఘర్షణ పడ్డాయి. అడ్డుగా వచ్చిన వారిని తరిమి తరిమికొట్టారు. టెండర్‌లు నిర్వహించే ఆర్వో కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. పూర్తి వివరాలు.. ఎమ్మిగనూరు మున్సిపాలిటీ పరిధిలోని షాపు నెం. డి–7కు శుక్రవారం టెండర్లు నిర్వహించారు. ఎస్టీ సామాజిక వర్గానికి రిజర్వుడ్‌ చేసిన ఈ షాపునకు గతంలో రూ. 2లక్షలు గుడ్‌విల్‌ కింద టెండర్లు పిలువగా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో రూ.లక్ష గుడ్‌విల్‌గా రూ. 4వేలు అద్దెగా నిర్ణయించి టెండర్లు పిలిచారు. అధికార పార్టీలోని అదే సామాజిక వర్గానికి చెందిన ఓ నాయకుడు తమ వాళ్లతో టెండర్‌ వేసేందుకు వచ్చాడు. అదే సమయంలో మరో వ్యక్తి చెన్నా బసవ (చిన్నా), మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ కూడా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారిని వెంట పెట్టుకొని టెండర్లు దాఖలు చేసేందుకు వచ్చారు. అధికార పార్టీలో మేమున్నాం.. స్థానికంగా ఎరుకల కులంలో ఉన్న వారు కాదని అగ్రవర్ణాల బినామీగా ఎలా టెండర్‌ వేస్తావు అని అడ్డుకున్నారు. మాటామాటా పెరగడంతో చిన్నాను చితకబాదారు.
 
       చిన్నాకు మద్దతుగా వచ్చిన మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ అక్కడి నుంచి జారుకున్నారు. తరువాత చిన్నాకు మద్దతుగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎరుకల ఈరన్న, నాగన్నలు రంగప్రవేశం చేశారు. దీంతో మున్సిపల్‌ కార్యాలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరువర్గాల ఘర్షణలో మున్సిపల్‌ ఆర్వో కార్యాలయం అద్దాలు ధ్వంసమయ్యాయి. చివరకు కమిషనర్‌ సంపత్‌కుమార్, ఆర్వో నాసర్‌లు షాపు టెండర్‌ వేలాన్ని 2017 జనవరి 18కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో ఇరు వర్గాలు వెనుదిరిగారు. ప్రశాంతంగా ఉన్న సామాజిక వర్గంలో గుడ్‌విల్‌ కోసం అధికార పార్టీ నేతలు, ఇటు మున్సిపల్‌ మాజీ చైర్మన్‌లు గొడవ పెట్టి వేడుక చూశారని ఎరుకల కులస్తులు ఆవేదన చెందారు. మున్సిపల్‌ అధికారులు జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
>
మరిన్ని వార్తలు