తిరుపతి నుంచే టీడీపీ పతనం

14 Sep, 2016 23:03 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

– నగరపాలక సంస్థ ఎన్నికలే నాంది కావాలి
– వైఎస్సార్‌సీపీ జిల్లా పరిశీలకులు, ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి
– కార్పొరేషన్‌ ఎన్నికలపై పార్టీ కార్యాచరణ సమావేశం

సాక్షి ప్రతినిధి, తిరుపతి : ప్రజామోదం లేని పాలన సాగిస్తున్న టీడీపీ పతనం తిరుపతి నుంచే ప్రారంభం కావాలనీ, ఇందుకు నగర పాలకసంస్థ ఎన్నికలే నాంది కావాలని కమలాపురం ఎమ్మెల్యే, జిల్లా వైఎస్సార్‌సీపీ పరిశీలకులు రవీంద్రనాథ్‌రెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతి ఎయిర్‌బైపాస్‌రోడ్డులోని పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఉదయం వైఎస్సార్‌సీపీ శాసనసభ్యులు, నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ అనుబంధ సంఘాల ముఖ్య నేతల సమావేశం జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే నారాయణస్వామి అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి  జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభానుతో కలిసి హాజరైన రవీంధ్రనాథ్‌రెడ్డి పార్టీ నేతలనుద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందనీ, రైతులు, డ్వాక్రా మహిళలు, ఉద్యోగులను హామీలతో మాయ చేసిన సీఎం చంద్రబాబుపై వ్యతిరేకత పెరుగుతోందన్నారు. అన్నింటా  ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న చంద్రబాబుకు తిరుపతి కార్పోరేషన్‌ ఎన్నికలు చెంపపెట్టు కావాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.  బూత్‌ కమిటీలను బలోపేతం చేయాలని, మంచి మెజార్టీతో కార్పోరేషన్‌ను కైవసం చేసుకోవాల్సి ఉందన్నారు. తిరుపతిలో ప్రజా స్పందన వైఎస్సార్‌సీపీకే ఉందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అన్ని బూత్‌లకు కమిటీలను వేసి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసినట్లు తెలిపారు. సాంకేతికతను వాడుకుంటూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సూచించారు. డివిజన్ల వారీగా పార్టీ ఇన్‌చార్జ్‌లను నియమిస్తే ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. సమావేశంలో కార్పొరేషన్‌ ఎన్నికల పరిశీలకులు సామినేని ఉదయభాను, ఎంపీ వరప్రసాద్, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, డాక్టర్‌ సునీల్,పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్తలు ఆదిమూలం, చంద్రమౌళి, జంగాలపల్లి శ్రీనివాసులు, రాకేశ్‌రెడ్డి, సీవీ కుమార్, రెడ్డెమ్మ, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గాయత్రీదేవి, ఎస్సీసెల్‌ నేత దామినేటి కేశవులు, ఎంవీఎస్‌ మణి, పోకల అశోక్‌కుమార్, హనుమంత్‌నాయక్, బీరేంద్రవర్మ, యుగంధర్‌రెడ్డి, సయ్యద్‌ అహ్మద్‌ఖాద్రి తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు