సహకార ఎన్నికల్లో పచ్చపాతం

8 Sep, 2016 23:22 IST|Sakshi

•    మంత్రి బొజ్జల ఎస్‌ఎంఎస్‌తో ఎన్నిక వాయిదా
•    కోరం ఉన్నా అధ్యక్ష ఎన్నికకు స్టే
•    వైఎస్సార్‌సీపీ డైరెక్టర్ల ఆందోళన

పుట్టపర్తి టౌన్‌ : టీడీపీ నాయకులు అధికార దుర్వినియోగం ముందు ప్రజాస్వామ్యం ఓడిపోయింది. నిబంధనల మేరకు ఎన్నికలు నిర్వహించాల్సిన అధికారి కూడా వారికే వత్తాసు పలకడంతో గురువారం జరగాల్సిన పుట్టపర్తి ప్రాథమిక సహకార సంఘం ఎన్నిక వాయిదా పడింది.  నోటిఫికేషన్‌ మేరకు గురువారం ఎనుములపల్లి గణేష్‌ సర్కిల్‌ వద్ద ప్రాథమిక సహకార సంఘం కార్యాలయంలో ఉదయం 8 గంటలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. 13 మంది డైరెక్టర్లున్న సంఘంలో వైఎస్సార్‌సీపీకి చెందిన ఆరుగురు డైరెక్టర్లు రుషీకేశరెడ్డి, మాదినేని చెన్నక్రిష్ణ, సుబ్రహ్మణ్యం, పోమ్మేనాయక్, లింగమ్మ, చెన్నక్రిష్ణ ఉదయం 8.40 గంటలకు ఎన్నికల అధికారి లక్ష్మీనారాయణరెడ్డికి అధ్యక్ష స్థానానికి రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.

టీడీపీకి చెందిన బండారు జయప్ప వారికి మద్దతు పలకడంతో ఓటమి తప్పదని గ్రహించిన పచ్చ నాయకులతోపాటు ఎన్నికల అ«ధికారి వెంటనే మంత్రి పల్లె రఘునాథరెడ్డి దష్టికి తీసుకుపోయారు. ఆయన ద్వారా సహకార మంత్రి బొజ్జల గోపాలకష్ణారెడ్డిపై ఒత్తిడి తీసుకువచ్చి ఎటువంటి కారణం లేకపోయినా ఎన్నికపై స్టే విధించేలా కుట్రకు పూనుకున్నారు. కోపోద్రిక్తులైన వైఎస్సార్‌సీపీ డైరెక్టర్లతోపాటు, టీడీపీ డైరెక్టర్‌ జయప్ప మంత్రి నుంచి వచ్చిన స్టే కాపీ చూపాలని, ఏ కారణాలతో ఎన్నిక వాయిదా వేస్తున్నారో తెలపాలని ఆందోళనకు దిగారు.  9.15 నిముషాలకు సహకార మంత్రి వ్యక్తిగత సహాయకుడు ఫోన్‌ మెసేజ్‌ ద్వారా పంపిన స్టే కాపీని టీడీపీకి చెందిన డైరెక్టర్‌ గూడురు ఓబిలేసు తీసుకువచ్చి ఎన్నికల అధికారి ఇవ్వడంతో ఆయన వాటిని పంచిపెట్టారు. మంత్రి బొజ్జల నోట్‌ప్యాడ్‌పై ఎటువంటి కారణాలు చూపకుండా  ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు, తదుపరి చర్యలు జిల్లా కలెక్టరు తీసుకోవాలని సూచించినట్లు ఉండడంతో వాగ్వాదం నెలకొంది. వెంటనే అక్కడికి చేరుకున్న సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి ఇరువర్గాలను బయటికి పంపించి వేశారు.

మరిన్ని వార్తలు