దేశం కుట్ర !

27 Jul, 2016 09:08 IST|Sakshi
దేశం కుట్ర !
  • అసైన్డ్, ప్రభుత్వ భూములను కొట్టేసే యత్నం
  • తెలుగు తమ్ముళ్ల పేరున రాయాలని ఒత్తిడి
  • పోర్టు భూసమీకరణ నోటిఫికేషన్ జారీలో జాప్యం
  • జిల్లా కలెక్టర్ నిలదీస్తారనే భయాందోళనలో అధికారులు
  •  
    ప్రభుత్వ, అసైన్డ్‌భూమిని అప్పనంగా కొట్టేసేందుకు టీడీపీ నేతలు అధికార యంత్రాంగంపై ఒత్తిడి చేస్తున్నారు. పోర్టు, అనుబంధ పరిశ్రమల స్థాపన కోసం సమీకరించే భూములకు తమ పార్టీ కార్యకర్తలను అనుభవదారులుగా నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తద్వారా సమీకరణకు సంబంధించిన ప్యాకేజీని పంచుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఈ కారణంగానే భూ సమీకరణ నోటిఫికేషన్ జారీ ఆలస్యం అవుతోందనే అనుమానాలు లేకపోలేదు.

     
     మచిలీపట్నం : పోర్టు, అనుబంధ పరిశ్రమల స్థాపన కోసం ప్రభుత్వం విడుదల చేసే భూ సమీకరణ నోటిఫికేషన్ తెలుగు తమ్ముళ్లకు వరంగా మారింది. ఎంఏడీఏ పరిధిలో ఉన్న మంగినపూడి, తపసిపూడి, గోపువానిపాలెం, కరగ్రహారం, చిలకలపూడి, పోతేపల్లి గ్రామాల నుంచి 4,636 ఎకరాలను భూ సమీకరణ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు జేసీ గంధం చంద్రుడు ఆదివారం ప్రకటించారు.
     
     సోమవారమే నోటిఫికేషన్ జారీ కావాల్సి ఉంది. అయితే తెరవెనుక మంత్రాంగం నడుస్తుండడంతో నోటిఫికేషన్ జారీలో జాప్యం జరుగుతోంది. ఈ ఆరు గ్రామాల్లో అసైన్డ్‌భూమి 413 ఎకరాలు, ప్రభుత్వ భూమి 1941 ఎకరాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ, అసైన్డ్‌భూమిని టీడీపీ కార్యకర్తలు సాగు చేస్తున్నట్లు వారి పేర్లు నమోదు చేయాలని అధికారపార్టీ నాయకులు ఒత్తిడి తెస్తున్నారు. దీంతో రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.
     
     వాపోతున్న రెవెన్యూ సిబ్బంది....
     గత ఏడాది భూ సేకరణ నోటిఫికేషన్ జారీ చేసే సమయంలో పట్టాభూమికి నోటిఫికేషన్ జారీ చేయగా, అసైన్డ్, ప్రభుత్వ భూమికి సంబంధించిన వివరాలను సేకరించారు. అప్పటి రికార్డులకు, ప్రస్తుతం విడుదల చేసే భూసమీకరణ నోటిఫికేషన్ వివరాలకు పొంతన లేకుంటే కలెక్టర్ నుంచి తమకు ఇబ్బంది తప్పదని రెవెన్యూ సిబ్బంది వాపోతున్నారు. భూసమీకరణ నోటిఫికేషన్ తయారీ పనిలో సోమవారం రెవెన్యూ సిబ్బంది ఎనిమిది మంది పనిచేయగా మంగళవారం ఈ సంఖ్యను 12 మందికి పెంచారు.
     
     నాలుగు గ్రామాల వివరాలు పూర్తి
     మచిలీపట్నం మండలం పోర్టు నిర్మాణం జరిగే ప్రాంతంలో ఉన్న చిలకలపూడి, గోపువానిపాలెం, కరగ్రహారం, మంగినపూడి, తపసిపూడి, పోతేపల్లి రెవెన్యూ గ్రామాల్లో 4,636 ఎకరాలకు  భూసమీకరణ నోటిఫికేషన్‌ను జారీ చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ ఆరు గ్రామాల్లో నాలుగు గ్రామాలకు సంబంధించిన వివరాలను మంగళవారం సాయంత్రానికి పూర్తి చేశారు. మిగిలిన రెండు గ్రామాలకు సంబంధించిన వివరాలను కంప్యూటరీకరించే పనిలో ఆర్డీవో కార్యాలయ సిబ్బంది నిమగ్నమయ్యారు. ఈ వివరాలు పూర్తి కాగానే సంబంధిత ఫైలును విజయవాడ తీసుకురావాలని కలెక్టర్ ఆర్డీవో పి సాయిబాబుకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
     
     అధికార పార్టీ నాయకుల నుంచి తమ కార్యకర్తల పేర్లను ప్రభుత్వ, అసైన్డ్ భూములకు అనుభవదారులుగా ఉన్నట్లు రికార్డులో రాయాలనే ఒత్తిడితో రెండు రోజుల పాటు ఈ నివేదిక తయారు చేయడానికి ఆలస్యం జరిగిందనే వాదన వినిపిస్తోంది. టీడీపీ కార్యకర్తలకు భూమి లేకున్నా ప్రస్తుతం తయారుచేసే భూ సమీకరణ జాబితాలో వారి పేర్లు నమోదు చేయిస్తే దీనికి సంబంధించిన ప్యాకేజీ అందుకుంటారని నాయకులు ఒత్తిడి చేయడంతో అధికారులు కంగుతింటున్నారు.
     

మరిన్ని వార్తలు