తాడిపత్రి టీడీపీలో చీలికలు

7 Apr, 2017 23:37 IST|Sakshi

– రెండు గ్రూపులుగా విడిపోయిన నేతలు
– సీనియర్‌ నేత జగదీశ్వరరెడ్డి, ఎమ్మెల్యే వర్గీయులు వేర్వేరుగా పయనం

అనంతపురం : తాడిపత్రి తెలుగుదేశం పార్టీలో చీలికలు మొదలయ్యాయి. రాష్ట్ర గ్రామీణ గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి తొలిసారి జిల్లాకు వస్తున్న కాలవ శ్రీనివాసులుకు స్వాగతం పలికేందుకు శుక్రవారం తాడిపత్రి నుంచి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, సీనియర్‌ టీడీపీ నాయకులు జగదీశ్వరరెడ్డి వేర్వేరుగా వాహనాలలో గుత్తి బాటసుంకులమ్మ వద్దకు తరలివెళ్లడం నేతల మధ్య విభేదాలను బట్టబయలు చేసింది. జగదీశ్వరరెడ్డితోపాటు ఆయన సోదరుడు మునిసిపల్‌ కౌన్సిలర్‌ జయచంద్రారెడ్డి, కార్యకర్తలతో కలిసి దాదాపు 30 వాహనాలలో గుత్తికి తరలివెళ్లారు.

ఇది వరకు జయచంద్రారెడ్డికి, ఎమ్మెల్యే జేసీకి మధ్యæ కౌన్సిల్‌ సమావేశంలో వాగ్వాదం జరిగింది. అనంతరం మూడు నెలల పాటు కౌన్సిల్‌ సమావేశాలకు రాకుండా జయచంద్రారెడ్డిని సస్పెండ్‌ చేయించారు. ఆ తరువాత జగదీశ్వరరెడ్డి పట్టణ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ధర్నా చేశారు. ఇరువర్గాల వారూ ఫిర్యాదులు చేసుకున్న విషయం విదితమే. అలాగే మార్కెట్‌యార్డు చైర్మన్‌ రాకుండా అడ్డుకోవడంతో పాటు గ్రానైట్‌ ఫ్యాక్టరీ అసోసియేషన్‌ అధ్యక్ష పదవి తొలగింపు విషయంలో రెండు వర్గాల మధ్య మనస్పర్దలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం మంత్రి కాలవకు స్వాగతం పలికేందుకు జగదీశ్వరరెడ్డి ఇంటి నుంచి వేరుగా కార్యకర్తలతో కలసి వాహనాలలో తరలివెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వార్తలు