మాచర్లలో టీడీపీ లుకలుకలు..

19 Oct, 2016 17:18 IST|Sakshi
రాయపాటి సోదరులతో డొక్కా (ఫైల్‌)
మాచర్ల టౌన్‌: మాచర్ల టీడీపీలో వర్గపోరు రసకందాయంలో పడింది. పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించే నాయకులు అంతగా లేకపోవడం, వర్గ పోరు, నేతలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం తెలిసిందే. ఈ క్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిని మారుస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సమన్వయకర్త వ్యవహారం తెరపైకి రావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. తన అనుయాయుడైన డొక్కా మాణిక్య వరప్రసాద్‌ను నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించేందుకు నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు ప్రయత్నాలు చేస్తున్నట్టు టీడీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. 
 
ఎంపీ సిఫార్సులకు ఎమ్మెల్యే మోకాలడ్డు..
నరసరావుపేట పార్లమెంట్‌ పరిధిలో భాగంగా ఉన్న మాచర్లలో ఎంపీ రాయపాటి సాంబశివరావుకు అధికారుల నుంచి ఆశించిన సహకారం అందడం లేదని తెలుస్తోంది. ఆయన అధికారులకు సిఫార్సులు చేస్తున్నా ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే వాటికి అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కొందరు టీడీపీ నేతలు నియోజకవర్గంలో తమ మాట నెగ్గడం లేదని ఎంపీ ముందు తమ గోడును వినిపించారు. దీనికి స్పందించిన ఎంపీ రాయపాటి ‘నా పనులే జరగడం లేదు. నేనెవరికి చెప్పుకోవాలి’ అని వ్యాఖ్యానించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. 
 
నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల మున్సిపల్‌ ఎన్నికలు జరిగి రెండున్నర ఏళ్లు గడిచినా తగినంత మెజార్టీ ఉండీ  కోఆప్షన్‌ ఎన్నిక నిర్వహించుకోలేకపోయారు. గత వారం పార్టీలోని ఇరువర్గాలు బాహాబాహీకి దిగారు. ఈ ఘటనపై కొందరు నాయకులు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, ఎంపీ రాయపాటిలకు ఫిర్యాదు చేశారు. ఇంతటితో ఆగకుండా సీఎంకు ఫిర్యాదు చేసేందుకు ఓ వర్గం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి ప్రత్తిపాటి పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కొమ్మారెడ్డి చలమారెడ్డి, మార్కెట్‌యార్డు చైర్మన్‌ యాగంటి మల్లికార్జునరావులతో చిలకలూరిపేటలో చర్చలు జరిపారు. మాచర్ల పార్టీ వ్యవహారం సీఎం దృష్టిలో వుందని, సమన్వయంగా పనిచేసుకోకపోతే నష్టపోవాల్సివస్తుందని హితవు పలికినట్టు తెలుస్తోంది.
>
మరిన్ని వార్తలు