కడుపు నింపుతూ.. కన్నీళ్లు తుడుస్తూ..

27 Jun, 2016 12:27 IST|Sakshi
కడుపు నింపుతూ.. కన్నీళ్లు తుడుస్తూ..

ఎవరైనా బంధువులు ఇంటికి వస్తే వారు తిరిగి ఎప్పుడు వెళ్లిపోతారా అని ఎదురుచూసే కాలమిది. ఇలాంటి పరిస్థితుల్లో కర్నూలు పెద్దాసుపత్రికి వచ్చే వందలాది మంది రోగుల సహాయకులకు ప్రతిరోజూ భోజనం పెట్టడం సాధారణ విషయం కాదు. దాతలెంత సహకారం అందిస్తున్నా ఇక్కడ పని చేసే సద్గురు దత్త కృపాలయం వారు  పేదలకు సేవ చేయడంలోనే భగవంతుడిని చూసుకుంటున్నారు. అది ఆకలితో అలమటించి వచ్చే వారిలోనేనైనా, ఆత్మీయులు చనిపోతే బాధలో ఉండేవారిలోనైనా ఒక్కటే. అందుకే ఈ రెండు కార్యాల్లో తమ వంతుగా సేవ చేస్తున్నారు. మానవసేవే మాధవ సేవగా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు.
- కర్నూలు(హాస్పిటల్)

 
 * పెద్దాసుపత్రిలో రోజూ వెయ్యి మందికి అన్నదానం
* రోగులను, మృతదేహాలను తరలించేందుకు వాహనాలు
* బృందావనంగా వైకుంఠ క్షేత్రం
* సద్గురుదత్త కృపాలయం సేవలు విస్తృతం

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు అధికంగా వచ్చేది పేదవారే. వీరిలో చాలా మంది రోజూ మూడుపూటలా కడుపునిండా తినలేని దుస్థితిలో ఉంటారు. బయట హోటళ్లలో భోజనం చేయాలంటే ఒక్కొక్కరికి ఒక పూటకు రూ.60కు పైగానే ఖర్చు అవుతుంది. ఇలా ఖర్చుచేయలేని వారు ఆ పూటకు పస్తులుంటారు.

ఉదయం టిఫిన్ చేసి మళ్లీ రాత్రి కాస్త తిని పడుకుంటారు. మరికొందరు స్టవ్‌తో పాటు నిత్యాసర వస్తువులు తెచ్చుకుని ఆసుపత్రి పరిసరాల్లో వండుకుని తింటారు. అది కూడా అన్నం, రసం లేదా పచ్చడితో సరిపుచ్చుకుంటారు. ఇలాంటి వారికి కనీసం ఒక పూటైనా భోజనం పెట్టాలన్న ఉద్దేశంతో 2012 జనవరి 29వ తేదీన ఆసుపత్రిలో నిత్యాన్నసేవ ప్రారంభించారు. ఇందుకోసం ఆసుపత్రిలోని గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం పక్కన అధికారులు ఒక భవనాన్ని కేటాయించారు.

దాన్ని ఆధునీకరించి నిత్యాన్నసేవను ప్రారంభించారు. మొదట్లో 500 మందితో ప్రారంభమైన ఈ సేవ నాలుగు నెలలకే 1000కి చేరుకుంది. ప్రస్తుతం ప్రతిరోజూ 1200 మంది దాకా ఇక్కడ భోజనం చేస్తున్నారు. రోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు ఇక్కడ భోజనం పెడతారు. అన్నం, పప్పు/సాంబార్, మజ్జిగ అందిస్తారు. ప్రతి శనివారం, పండుగ రోజుల్లో ఏదైనా తీపి వంటకాన్ని వడ్డిస్తారు.

ఇందులో సేవ చేయడానికి నగరంలోని పలువురు రిటైర్డ్ ఉద్యోగులు 25 నుంచి 30 మంది ప్రతి రోజూ వస్తారు. మొత్తం కార్యక్రమం పూర్తయ్యే వరకు ఉండి వెళతారు. సద్గురు దత్త కృపాలయం ట్రస్ట్‌కు ప్రస్తుతం అధ్యక్షుడిగా ఎన్. శ్రీనివాసగుప్త, ప్రధాన కార్యదర్శిగా సుబ్రహ్మణ్యం, కార్యదర్శిగా జె. రత్నాలశెట్టి, ఉపాధ్యక్షుడిగా శ్రీనివాసరావు, మల్లారెడ్డి, కోశాధికారిగా పి. బాలసుధాకర్ వ్యవహరిస్తున్నారు.
 
సేవ చేయడంతో ఆత్మసంతృప్తి  
నేను  నాలుగేళ్ల నుంచి నిత్యాన్నసేవలో పాల్గొంటున్నాను.  నిత్యాన్నసేవలో పాల్గొనడంతో నాకు ఎంతో ఆత్మసంతృప్తినిస్తుంది.  ఆకలితో ఉన్న వాడికి కడుపునింపితే కలిగే మానసికానందం వెలకట్టలేనిది.
- పి. బాలసుధాకర్, కోశాధికారి
 
ఎంత సంపాదించినా జానెడు పొట్టకోసమే  
మనిషి ఎంత కష్టపడ్డా జానెడు పొట్టకోసమే. అది మనిషి మనిషికీ కష్టపడే విధానం, తెలివితేటల్తో సంపాదించడంలో తేడా ఉంటుంది. ఉన్న వారు లేనివారికి పెట్టడం మానవధర్మం. అది లేకపోతే ఈ జన్మకు పరమార్థం లేదు.  నేను నిత్యాన్నసేవతో పాటు వైకుంఠ క్షేత్రంలో సేవలందిస్తాను.
- జయంతి క్రిష్ణమూర్తి, వ్యాపారి
 
అన్నదానం ఎంతో బాగుంది
మాది వెల్దుర్తి మండలం బుక్కాపురం గ్రామం. నా భార్య రజిత కాన్పు కోసం నాలుగు రోజుల క్రితం వచ్చాను. అప్పటి నుంచి ఇక్కడే భోజనం చేస్తున్నాను. ఇంట్లో భోజనం చేసిన విధంగా ఇక్కడ పెట్టడం ఎంతో సంతోషంగా ఉంది.  ఇలాంటి సమయంలో ఒకపూట భోజనం మాకు ఎంతో ఉపయోగకరం.                             - బి. రవి, వెల్దుర్తి
 
శ్మశాసనమే భావనే ఉండదు
ఆరేళ్ల క్రితం మా బంధువు ఒకరు చనిపోతే శ్మశానానికి వెళ్లాను. అక్కడ ప్రతి పనికీ  డబ్బు అడుగుతుంటే బాధ అనిపించింది. ఇప్పుడు అదే శ్మశానాన్ని సద్గురుదత్త కృపాలయం వారు బృందావనంగా మార్చారు. ఇప్పుడు అంతా ఉచిత సేవలే. ఈ సంస్థలో ఎక్కడా వ్యక్తులు కనిపించరు. కేవలం ట్రస్ట్ సేవలే కనిపిస్తాయి.  - రమేష్‌బాబు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
 
 సద్గురుదత్త కృపాలయం సేవల ఫోన్ నెంబర్లు
 వైకుంఠరథం : సతీష్‌కుమార్, సెల్ నెం.9849017744
 నిత్యాన్నసేవ : రమేష్‌బాబు, సెల్ నెం. 9160551283
 సి. రాముడు,  సెల్ నెం. 9440996919

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు