ఆ‘దేశం’ మేరకే!

21 Oct, 2016 16:37 IST|Sakshi
ఆ‘దేశం’ మేరకే!
* విత్తన, ఎరువుల షాపుల్లో తనిఖీలపై వివక్ష
అధికార పార్టీ నేతల షాపుల్లో శాంపిల్స్‌ సేకరించని వైనం
మాచర్లలో అడ్డుకున్న టీడీపీ నేత
ఇప్పటి వరకు 560కు పైగా శాంపిల్స్‌ సేకరణ
 
సాక్షి, అమరావతి బ్యూరో: నకిలీ విత్తనాలు, బయో ఉత్పత్తులను అరికట్టేందుకు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు చేస్తున్న తనిఖీల్లో ‘పచ్చ’పాతం చూపుతున్నారు. అధికార పార్టీ నేతల షాపుల్లో ఎటువంటి తనిఖీలు నిర్వహించడం లేదు. జిల్లాలో రెండు రోజులుగా 560 షాపులకు పైగా తనిఖీలు చేసి శాంపిల్స్‌ సేకరించారు. వీటిలో ఒక్క షాపు కూడా అధికార పార్టీ నేతలు, సానుభూతిపరులవి లేకపోవడం ఇందుకు బలాన్నిస్తోంది. నకిలీ విత్తనాలు, బయో ఉత్పత్తులను నివారించేందుకు అధికారులు, సిబ్బంది 70 బృందాలుగా ఏర్పడి జిల్లాలో రెండు రోజులుగా ఎరువులు, పురుగు మందులు, విత్తన షాపుల్లో తనిఖీలు చేస్తున్నారు. దుకాణాల్లో ఉన్న సరుకును పరిశీలించి శాంపిల్స్‌ తీస్తున్నారు. ఈ ఆకస్మిక తనిఖీలను  జిల్లాలో ఇన్‌చార్జి జేసీ ముంగా వెంకటేశ్వరరావు, వ్యవసాయ శాఖ  సంయుక్త సంచాలకులు కృపాదాసు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో 560కి పైగా శాంపిల్స్‌ను సేకరించినట్లు సమాచారం. నకిలి విత్తనాలు, బయో ఉత్పత్తులపై ప్రత్యేకంగా విచారణ బృందాలు ఏర్పాటు చేసి, అందుకు బాధ్యులైన కంపెనీలు, డిస్టిబ్యూటర్‌లు, డీలర్లతో పాటు వ్యవసాయ శాఖ అధికారులపై చర్యలు తీసుకొనేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మొత్తం ఈ వ్యవహారం వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, వ్యవసాయ శాఖ డైరెక్టర్‌లు ధనుంజయరెడ్డి కనుసన్నల్లో సాగుతోంది. ఇప్పటికే వారు నకిలీల వ్యవహారంలో ఉన్న ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరికలు జారీ చేశారు.
 
నమూనాల సేకరణలో...
ప్రకాశం జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేకు చెందిన  బయో ఉత్పత్తుల షాపులు వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రాతినిథ్యం  వహిస్తున్న చిలకలూరిపేటలో ఉన్నాయి. అయితే ఆ షాపులకు సంబంధించిన శాంపిల్స్‌ను తీయకుండా కింది స్థాయి అధికారులపై ఒత్తిడి తెచ్చి మెనేజ్‌ చేసినట్లు దుకాణాదారుల్లోనే చర్చ సాగుతోంది. జిల్లాలో ఓ అధికార పార్టీ ఎమ్మెల్యేకు చెందిన బయో ఉత్పత్తులకు సంబంధించి శాంపిల్స్‌ తీయలేదని సమాచారం. మాచర్ల నియోజక వర్గంలో అధికార పార్టీకి చెందిన ఓ నేత తమకు అనుకూలంగా ఉన్న యజమానుల షాపుల్లో శాంపిల్స్‌ తీయకుండా స్థానిక అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి అడ్డుకున్నట్లు తెలిసింది. షాపుల ఆకస్మిక తనిఖీల్లో సైతం వివక్ష చూపుతున్నారని, అధికార పార్టీ నేత షాపులకు సంబంధించి శాంపిల్స్‌ తీయక పోవడం ఏమిటనీ కొంత మంది వ్యాపారులు పెదవి విరుస్తున్నారు.
 
నమూనాలు నిరంతం సేకరిస్తాం.. 
జిల్లా వ్యాప్తంగా అన్ని షాపులను తనిఖీ చేస్తున్నాం. ఇప్పటికే 500కు పైగా షాపులకు తనిఖీ చేసి షాంపిల్స్‌ సేకరించాం. పారదర్శకంగా అన్ని షాపులను తనిఖీ చేసి శాంపిల్స్‌ తీస్తున్నాం. మరో నాలుగైదు రోజులపాటు దాడులు చేస్తాం.
– కృపాదాసు, జేడీఏ, వ్యవసాయశాఖ
 
తనిఖీల పేరుతో వేధించొద్దు..
చట్ట పరిధిలోనే వ్యాపారం చేస్తున్నాం. అధికారులకు అన్ని విధాల సహకరిస్తున్నాం. తనిఖీల పేరుతో డీలర్లలను వేధించడం తగదు. రైతులు నష్టపోకుండా నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలను విక్రయించేలా అసోసియేషన్‌ తరఫున కృషిచేస్తున్నాం. 
– వీవీ నాగిరెడ్డి, ఎరువులు, పురుగు మందుల డీలర్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు 
మరిన్ని వార్తలు