పదవి కోసమే టీడీపీలో కుమ్ములాటలు

28 Apr, 2016 22:38 IST|Sakshi
పదవి కోసమే టీడీపీలో కుమ్ములాటలు

= గిద్దలూరు మార్కెట్ యార్డు చైర్మన్ పదవి కోసం ఎత్తుకు పైఎత్తులు
= టీడీపీలో కుమ్ములాటలు.. ముఖ్య నేతలకు పరస్పర ఫిర్యాదులు
= కొన్ని పేర్లతో జాబితా ఇచ్చిన టీడీపీ ఇన్‌చార్జి అన్నా రాంబాబు
= అదేం కుదరదని అధికారులతో చెప్పిన పాత నాయకులు
= మార్కెట్ యూర్డు కమిటీ ఎంపిక మళ్లీ వాయిదా?


జిల్లాలో టీడీపీ నేతలకు నామినేటెడ్ పదవులపై కన్నుపడింది. వరుసగా పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న నేతలు ఎలాగైనా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందాన ఇప్పుడు పదవుల కోసం ముఖ్య నాయకుల చుట్టూ తిరుగుతూ ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. పార్టీలో పాత.. కొత్త నేతలుగా విడిపోయి కుమ్ములాటలకు దిగుతున్నారు. గిద్దలూరు నియోజకవర్గంలో ఈ పోటీ మరింత తీవ్రంగా ఉంది. అక్కడి మార్కెట్ యూర్డ్ చైర్మన్‌గిరి కోసం తెలుగు తమ్ముళ్లు రెండు గ్రూపులుగా విడిపోయి ఓ గ్రూపు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి అన్నా రాంబాబుపై తిరుగుబాటు జెండా ఎగురవేసింది.

గిద్దలూరు :  గిద్దలూరు మార్కెట్ యార్డు చైర్మన్ పదవి కోసం టీడీపీలో కుమ్ములాటలు ప్రారంభమయ్యాయి. ఇటీవల వెలిగొండ ప్రాజెక్టు వద్దకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఆ పార్టీ గిద్దలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి రాంబాబు మార్కెట్ యార్డు కమిటీకి కొన్ని పేర్లను ప్రతిపాదిస్తూ లేఖ అందజేశారు. అందులో డెరైక్టర్లుగా ఉన్న వారిలో ఎక్కువ మంది రాంబాబు అనుచరులే. ఆ జాబితాలో ఇటీవల పార్టీలోకి వచ్చిన వారు కొందరైతే.. రాంబాబు అడుగుల్లో అడుగులు వేసేవారు మరికొందరు. దీంతో ఆ జాబితాను పాత టీడీపీ నాయకులు అడ్డుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కావస్తున్నా నేటికీ మార్కెట్ యార్డుకు కమిటీని నియమించడంలో ఆ పార్టీ ముఖ్య నేతలు విఫలమయ్యూరు. నియోజకవర్గంలోనే కంభం మార్కెట్ యార్డుకు కమిటీని నియమించిన ప్రభుత్వం.. గిద్దలూరు విషయంలో మాత్రం వెనుకంజ వేస్తోంది.

పాత, కొత్త నేతల మధ్య వార్
మార్కెట్ యార్డు చైర్మన్ పదవి కాపుల మధ్య చిచ్చు రేపేలా తయారైంది. రెండు నెలల క్రితం వరకు యాదవులకు చైర్మన్ పదవిని కట్టబెడతారని ప్రచారం జరగడంతో ముగ్గురు నాయకులు ఇన్‌చార్జి చుట్టూ తిరిగారు. వారి మధ్య సయోధ్య కుదరకపోవడంతో ఆ పదవి ముగ్గురిలో ఎవరికీ దక్కకుండా పోయింది. ఈ నేపథ్యంలో కాపు వర్గానికి చైర్మన్ పదవి ఇచ్చేందుకు ఇన్‌చార్జి ఒక నిర్ణయూనికి వచ్చారు. కాలక్రమంలో వారిలోనూ పోటీ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో 7 నెలల పాటు చైర్మన్‌గా పనిచేసిన ఆర్‌డీ రామకృష్ణ, రాచర్ల మండలం ఆకవీడుకు చెందిన కుప్పా రంగనాయకులు, టీడీపీ జిల్లా మాజీ కార్యవర్గ సభ్యుడు సిరిగిరి లింగయ్యలు పోటీ పడ్డారు. వీరిలో ఇద్దరు నాయకులు రాంబాబుతో పాటు టీడీపీలో చేరిన వారు కావడంతో వారి మధ్య సమోధ్య కుదుర్చి కుప్పాకు చైర్మన్ పదవి ఇచ్చేందుకు నిర్ణయించారు. 20 ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్న లింగయ్యను మాత్రం ఆర్థిక స్థోమత లేదంటూ పక్కకు నెట్టేశారు. లింగయ్యతో పాటు వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన నల్లబోతుల వెంకటేశ్వర్లు పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. తమను కాదని సొంత అనుచరులకు పదవి ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నా రాంబాబుపై పాత టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొత్తోళ్లకే అందలం
పదేళ్లు పార్టీ కష్టకాలంలో ఉంటే తాము పార్టీని వెన్నంటి ఉన్నామని, ఎన్నికల ముందు పార్టీలో చేరిన వారికి పదవులు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తూ టీడీపీలో ముందు నుంచీ ఉన్న నేతలు కొందరు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పార్టీని వెన్నంటి ఉన్న వారికే నామినేటెడ్ పదవులు ఇస్తామని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ చెబుతున్నారని గుర్తు చేశారు. గిద్దలూరులో తమను కాదని కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి పదవులెలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డుకు వ్యవసాయం గురించి తెలియని వారిని ఎలా నియమిస్తున్నారని నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి మార్కెట్‌యార్డు కమిటీ ప్రకటన జాప్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కార్లు ఉన్న వారికే పదవి ఇస్తామంటున్నారు: సిరిగిరి లింగయ్య, టీడీపీ సీనియర్ నాయకుడు
మార్కెట్ యార్డు చైర్మన్ పదవిని ముందు రెండు, వెనకాల రెండు కార్లు ఉన్న వారికే ఇస్తామని గిద్దలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి అన్నా వెంకట రాంబాబు చెబుతున్నాడు. కార్లలో తిరిగే వారు రైతులకు ఎలా సేవలందిస్తారు? అలాంటి వారికి రైతుల కష్ట సుఖాలు ఎలా తెలుస్తాయి? నేను 20 ఏళ్లుగా పార్టీలో ఉన్నాను. ఇన్‌చార్జి తన సొంత వర్గానికి పదవులు కట్టబెట్టి పార్టీ కోసం కృషి చేసిన మాకు మొండి చేయి చూపాలని చూస్తున్నాడు. ఇప్పటికైనా పార్టీ అభివృద్ధికి కష్టపడే వారిని గుర్తించి నామినేటెడ్ పదవులు కట్టబెట్టాలి.

మరిన్ని వార్తలు