మంత్రులు, ఎమ్మెల్యేలతో బెదిరిస్తారా?

24 Oct, 2016 23:34 IST|Sakshi

శ్రీకాకుళం టౌన్ : జిల్లాలో యథేచ్ఛగా ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. రాత్రికి రాత్రే కోట్లకు పడగలెత్తాలని చూస్తున్నారు. ఇక్కడ వాడుకోవాల్సిన ఇసుకను విశాఖకు తరలించి రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డకుందామంటే ఎమ్మెల్యేలు, మంత్రులతో ఫోన్లు చేయించి అధికారులను బెదిరించే స్థాయికి ఎదిగిపోయారంటూ జిల్లా కలెక్టరు డాక్టర్ పి.లక్ష్మీనరసింహం ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఇసుక రీచ్‌లున్న పంచాయతీ సర్పంచులు, జన్మభూమి కమిటీ సభ్యులనుద్దేశించి ఆయన మాట్లాడారు.
 
 మాతల వద్ద పంటపొలాల్లో ఇసుక మేటలు ఉన్నాయని ఎమ్మెల్యే కలమట వెంకటరమణతోపాటు స్థానికులు అభ్యర్థన మేరకు జిరాయితీ భూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతిస్తే ఏకంగా నదిలోనే యంత్రాలతో తవ్వకాలు చేపడతారా?. ఇక్కడ ఇసుకను విశాఖపట్నం తరలించి రూ.కోట్లు ఆర్జించాలని ప్రయత్నించారని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలను పట్టుకున్న అధికారులకు ఎమ్మెల్యేలు, మంత్రులతో ఫోన్లు చేయించి, బెధిరించడం ఎంతవరకు సమంజసమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
 ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు పోలీసులు, రెవెన్యూ, రవాణా శాఖ అధికారులు ప్రయత్నించడం తప్పా? అని అన్నారు. ఇంకా మార్పు రాకపోతే యంత్రాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. తక్షణమే అక్రమ రవాణాను నిలిపి వేయాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టరు పి.రజనీకాంతరావు, మైన్స్ ఏడీలు రమణరావు, ప్రసాదరావు, ఆర్డీఓలు గున్నయ్య, దయానిధి, జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి, డీఎస్పీ వివేకానంద తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు