రైల్వే కాంట్రాక్టర్‌పై టీడీపీ నేత జులుం

1 Aug, 2016 23:59 IST|Sakshi

∙కాంట్రాక్ట్‌ నుంచి తప్పుకోవాలని బెదిరింపులు
∙దుప్పటి పంచాయితీ చేసిన పోలీసులు
గుంతకల్లు:గుంతకల్లు రైల్వే డివిజన్‌లోని ధర్మవరం రైల్వే రన్నింగ్‌ రూం నిర్వహణ కోసం గత నెల 27న టెండర్ల ప్రక్రియ ముగిసింది. రూ.1.24 కోట్ల విలువైన ఈ కాంట్రాక్టును రైల్వే శాఖ నిర్ణయించిన ధర కంటే 8 శాతం తక్కువకు కోట్‌ చేసి ఎస్కే ఎంటర్‌ ప్రైజెస్‌ కంపెనీ దక్కించుకుంది. ఇదే కాంట్రాక్టుకు పోటీపడిన ధర్మవరం ఎమ్మెల్యే సూర్యనారాయణ అనుచరుడు నరేంద్ర 35 శాతం ఎక్కువ ధరకు టెండర్‌ కోట్‌ చేశాడు. సహజంగా 8 శాతం తక్కువకు కోట్‌ చేసిన ఎస్కే ఎంటర్‌ప్రైజెస్‌కు ధర్మవరం కాంట్రాక్ట్‌ దక్కింది. ఈ మేరకు ఆ కంపెనీ అధినేత ఎస్కే అహ్మద్‌ సోమవారం డీఆర్‌ఎం కార్యాలయానికి వచ్చారు. అధికారులను కలిసి రన్నింగ్‌ రూం నిర్వహణ పనులు ఎప్పటి నుంచి ప్రారంభించాలనే విషయంపై చర్చిస్తున్నారు. అయితే అనుచరులతో అక్కడికి చేరుకున్న నరేంద్ర రైల్వే కార్యాలయంలోనే ఎస్కే అహ్మద్‌పై విరుచుకుపడ్డాడు. కాంట్రాక్ట్‌ నుంచి తప్పుకోవాలని, అధికారం తమ చేతుల్లో ఉందనే విషయం మరవద్దని బెదిరించాడు. టీడీపీ నేత హల్‌చల్‌ చేస్తున్న సమయంలో సీనులోకి పోలీసులు ఎంటర్‌ అయ్యారు. ఇరుపక్షాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నరేంద్ర చౌదరి బెదిరింపులపై ఎస్కే అహ్మద్‌ వన్‌టౌన్‌ ఎస్‌ఐ నగేష్‌ దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు దేశం నేత దౌర్జన్యంపై కేసు నమోదు చేయకపోగా సర్దుకుపోవాలంటూ సలహా ఇచ్చారు. మొత్తానికి దుప్పటి పంచాయితీతో ఇరువర్గాలకు సర్దిచెప్పి  పంపారు. ఈ ఘటన కు సంబంధించి పంచాయతీ వ్యవహారాన్ని ధర్మవరంలోనే తేల్చుకుంటామంటూ నరేంద్ర వెళ్లిపోగా, రాజకీయలకు భయపడే ప్రసక్తే లేదని ఎస్కే అహ్మద్‌ కూడా వెనుతిరిగాడు. ఇదే విషయమై టీడీపీ నేత నరేంద్ర పోలీసులకు వివరిస్తూ తాను బెదిరింపులకు పాల్పడలేదన్నారు.
 కాంట్రాక్ట్‌ పనిని తనకు ఇస్తానన్న ఎస్కే అహ్మద్‌ రూ.2 లక్షలు గుడ్‌విల్‌ డిమాండ్‌ చేశాడన్నారు. ఇప్పటికే అతడికి రూ.లక్ష నగదు ముట్టజెప్పానని, డబ్బు తీసుకుని కూడా తనపై కేసు పెట్టేందుకు సిద్ధమయ్యాడంటూ ఎస్కే అహ్మద్‌పై ఆరోపించాడు. అయితే అలాంటిదేంలేదని కాంట్రాక్టర్‌ ఎస్కే అహ్మద్‌ కొట్టిపారేశారు.
 

మరిన్ని వార్తలు