టీడీపీ నేతల అరాచకం

19 Aug, 2017 02:41 IST|Sakshi

► పచ్చని పత్తి పంటను పీకేసిన అధికార పార్టీ నాయకుడు
► కన్నీటి పర్యంతమవుతున్న బాధిత వృద్ధ కౌలు రైతు
► మండిపడుతున్న కోమటినేనివారిపాలెం గ్రామస్తులు


టీడీపీ నేతల భూ దురాక్రమణకు అడ్డూ అదుపూ లేకుండాపోతోంది. భూమిని ఆక్రమించుకునేందుకు పచ్చదనంపై సైతం ప్రతాపం చూపుతున్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వైఎస్సార్‌ సీపీకి చెందిన సన్నకారు రైతు సాగు చేస్తున్న దేవాదాయ శాఖకు చెందిన భూమిపై అధికార పార్టీ నేత కన్నుపడింది. ఆ భూమిని బలవంతంగా పొందేందుకు వృద్ధ రైతు సాగు చేస్తున్న 3.62 ఎకరాల పత్తి పంటను పీకివేశారు. మండలంలోని కోమటినేనివారిపాలెం గ్రామంలో ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకుని పంట పొలాన్ని పరిశీలించిన కౌలు రైతు కోమటినేని శ్రీహరిరావు కన్నీటి పర్యంతమయ్యాడు.

కోమటినేనివారిపాలెం (చిలకలూరిపేట రూరల్‌) : మండలంలోని గోవిందపురం గ్రామంలోని శ్రీ భీమేశ్వరస్వామి శ్రీజనార్ధన స్వామి ఆలయానికి కోమటినేనివారిపాలెంలోని సర్వే నెంబర్‌ 737, 748, 777 లలో 22 ఎకరాల సాగు భూమి ఉంది. దాన్‌ నికోమటినేనివారిపాలెంలో భూమిలేని 9 మంది నిరుపేద రైతులు 1975 నుంచి కౌలు పద్ధతిలో సాగు చేసుకుంటున్నారు. దేవాదాయ శాఖకు కౌలు సైతం చెల్లిస్తున్నారు. ఈ భూమిపై కన్నేసిన గోవిందపురం ఎంపీటీసీ సభ్యుడు గుత్తా వెంకటేశ్వర్లు తదితరులు దాన్ని స్వాధీనం చేసుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. వేసవి కాలంలో కౌలు ధరను ఎకరానికి ఏడాదికి ఉన్న రూ.6,000ను రెట్టింపు చేస్తున్నట్లు దేవాదాయ శాఖ అధికారులతో చెప్పించారు. అయినా, రైతులు చెల్లిస్తామని అంగీకరించారు.

విత్తనాలు నాటాక కౌలు వేలం..
జూన్‌ నెలలో కోమటినేనివారిపాలెంకి చెందిన కోమటినేని శ్రీహరిరావు 3.62 ఎకరాల సాగు భూమి దుక్కి దున్ని పత్తి విత్తనాలు నాటేందుకు సిద్ధం చేసుకున్నాడు. వర్షాలు పడటంతో జూలై 12న పత్తి విత్తనాలు నాటాడు. అయితే, దేవాదాయ శాఖ భూములను వేసవిలో గ్రామంలో దండోరా వేయించి బహిరంగ వేలం నిర్వహిస్తారు. ఇందుకు భిన్నంగా భూమి కోమటినేనివారిపాలెంలో ఉంటే అధికారులు గోవిందపురంలోని భీమేశ్వరస్వామి ఆలయంలో జూలై 22న వేలం నిర్వహించారు. దీనిపై ‘దేవాలయ భూముల వేలంలో వింత నాటకం’ శీర్షికన జూలై 23న ‘సాక్షి’లో కథనం వచ్చింది. టీడీపీకి చెందిన వ్యక్తులు కౌలు వేలం పాడినట్లు రికార్డుల్లో అధికారులు నమోదు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న శ్రీహరిరావు విత్తనాలు మొలకలు రావటంతో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించటంతో స్టే మంజూరైంది.

మానవత్వం లేని టీడీపీ నేతలు...
కౌలు రైతు శ్రీహరిరావు భార్య పార్వతి క్యాన్సర్‌తో బాధ పడుతుండటంతో చికిత్స నిమిత్తం గురువారం హైదరాబాద్‌ వెళ్ళారు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీటీసీ గుత్తా వెంకటేశ్వర్లు మరో 60 మంది టీడీపీ కార్యకర్తలు వచ్చి అర్ధరాత్రి 2.50 ఎకరాల పొలంలోని పత్తి మొక్కలను పీకేశారు. అలాగే, శుక్రవారం తెల్లవారుజామున సైతం మరో ఎకరంన్నర పొలంలోని పత్తి మొక్కలను తొలగించారు. విషయం తెలుసుకున్న శ్రీహరి పీకిన మొక్కలను చూసి కన్నీటిపర్యంతమయ్యాడు. టీడీపీ నేతల తీరుపై స్థానికులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రూరల్‌ పోలీసులకు బాధితుడు సమాచారం అందించాడు. దీంతో రూరల్‌ ఎస్‌ఐ ఉదయ్‌బాబు నేతృత్వంలోని సిబ్బంది వచ్చి పంట పొలాన్ని పరిశీలించారు.

పచ్చని పంట నాశనం..
టీడీపీకి చెందిన గోవిందపురం ఎంపీటీసీ సభ్యుడు గుత్తా వెంకటేశ్వర్లు మరికొందరు వ్యక్తులు వచ్చి మా 3.62 ఎకరాల్లో ఉన్న పత్తి మొక్కలను పీకివేశారు. ఈ భూమిపై కన్నేసి కొంతకాలంగా నన్ను తీవ్రంగా వేధిస్తున్నారు. దశాబ్ధాల కాలం నుంచి సాగు చేస్తున్నాను. ఇప్పటికైనా అధికారులు స్పందించి వారిపై కేసు నమోదు చేసి శిక్షించాలి.     – కోమటినేని శ్రీహరిరావు, బాధిత కౌలు రైతు 

మరిన్ని వార్తలు