వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలపై దాడి

24 Aug, 2016 23:49 IST|Sakshi
వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలపై దాడి

పులివెందుల :
సింహాద్రిపురం మండలం సుంకేసుల గ్రామంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై తెలుగుదేశం నాయకులు కర్రలు, రాడ్లతో దాడి చేశారు. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సుంకేసుల గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు సోమశేఖరరెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆనంద్‌కుమార్‌రెడ్డిలకు గతంలో దిబ్బ విషయమై గొడవలు ఉండేవి. ఇందుకు సంబంధించి పెద్ద మనుషుల సమక్షంలో గతంలో పంచాయితీ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో కక్షలను మనసులో పెట్టుకొన్న  టీడీపీ నాయకులు ఆనంద్‌ కుమార్‌రెడ్డి, చంద్రకళాధర్‌రెడ్డి, రణధీర్‌రెడ్డి, కోటిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, పరమేశ్వరరెడ్డిలు బుధవారం రాత్రి వైఎస్సార్‌సీపీ నాయకుడు సోమశేఖరరెడ్డి అన్న మహేశ్వరరెడ్డి ఇంట్లోకి ప్రవేశించి మహేశ్వరరెడ్డితోపాటు వారి బంధువులైన శంకరనారాయణరెడ్డి, రమేష్‌రెడ్డి, సరోజ, సుస్మితలపై కర్రలు, రాడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో శంకరనారాయణరెడ్డి తలకు తీవ్ర గాయాలు కాగా.. మిగతా నలుగురికి కూడా గాయాలయ్యాయి. వీరిని పులివెందుల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బాధితులను పరామర్శించిన వైఎస్‌ భాస్కర్‌రెడ్డి :
సుంకేసుల గ్రామంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి జరిగిన విషయాన్ని తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ పులివెందుల నియోజకవర్గ ఇన్‌ఛార్జి వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలు స్థానిక ప్రభుత్వాసుపత్రికి చేరుకొని బాధితులను పరామర్శించి అండగా ఉంటామని ధైర్యం ఇచ్చారు. ఘటన జరిగిన తీరును వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్‌ భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీ నాయకుల ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయని.. అనవసరంగా వైఎస్సార్‌సీపీ నాయకులపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూ గ్రామంలో కక్షల వాతావరణాన్ని నెలకొల్పుతున్నారన్నారు. వారికి ప్రజలే బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయని పేర్కొన్నారు.
 
 

మరిన్ని వార్తలు