అధికార పెత్తనం!

2 May, 2017 23:55 IST|Sakshi

- టీడీపీ నాయకులకు తలొగ్గిన రెవెన్యూ అధికారులు
పుట్టపర్తి అర్బన్‌ :
టీడీపీ నాయకుల అధికార పెత్తనానికి తలొగ్గిన రెవెన్యూ అధికారులు నిరుపేదలకు పంపిణీ చేసిన ఇంటి పట్టాలను రద్దు చేసి నివేశన స్థలాలను స్వాధీనం చేసుకుంటామని నోటీసులు పంపిణీ చేసిన సంఘటన పుట్టపర్తి మండలం గువ్వలగుట్టపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు..మండలంలోని పెడపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌ 203–3లో సుమారు 33 మంది నిరుపేదలకు రెండు సెంట్లు చొప్పున నివేశ స్థలాలను 2006లో పంపిణీ చేశారు. గ్రామానికి దూరంగా ఉండడం, మౌలిక వసతులు లేక పోవడంతో ఇంటి నిర్మాణాలు చేపట్టలేదు. మౌలిక వసతులు కల్పించాలని ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులకు పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదు.

రెండు నెలల క్రితం స్థానిక సర్పంచ్‌ భారతమ్మ నీటి వసతి కల్పించడంతో 30 మంది లబ్ధిదారులు నిర్మాణాలకు పూనుకున్నారు. అయితే గ్రామానికి చెందిన కొంత మంది టీడీపీ నాయకుల కళ్లు ఆ స్థలంపై పడ్డాయి. అనుకున్న వెంటనే వారు రెవెన్యూ అధికారులను సంప్రదించి పథకం రచించారు. రెవెన్యూ అధికారులు, పోలీసులు కలిసి గ్రామ సమీపంలోని ఇళ్ల నిర్మాణాల వద్దకు వెళ్లి నిర్మాణ పనులను ఆపు చేయించారు. అయినా కొందరు నిర్మాణాలను కొనసాగించడంతో ఇన్‌చార్జ్‌ తహసీల్దార్‌ ప్రకాష్‌రావ్‌ ద్వారా నోటీసులు ఇప్పించారు. మూడు రోజుల లోపు సంజాయిషీ ఇవ్వక పోతే పట్టాను రద్దు చేసి నివేశన స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని  అందులో పేర్కొన్నారు. వెంటనే వారు వైఎస్సార్‌ సీపీ నాయకులు ఎ.వి.రమణారెడ్డి, చిత్తరంజన్‌రెడ్డి ద్వారా వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దుద్దకుంట శ్రీధర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

సమస్యను కోర్టు దృష్టికి తీసుకెళ్లి పోరాటం సాగించనున్నట్లు ఆయన  భరోసా ఇచ్చినట్లు పట్టాదారులు తెలిపారు. అసలే కరువు కాటకాలతో వలసలు పోతున్న సమయంలో వేలాది రూపాయలు వెచ్చించి ఇంటి నిర్మాణాలు చేపడితే అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని పట్టాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు కావడంతోనే ఇలా కక్ష సాధిస్తున్నారని వారు వాపోయారు. కాగా మంగళవారం వైఎస్సార్‌సీపీ నాయకులు, ఏడీసీసీ డైరెక్టర్‌ ఎ.వి.రమణారెడ్డి ఆధ్వర్యంలో పట్టాదారులు తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి సంజాయిషీ ఇచ్చారు. ప్రస్తుతం ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నామని పట్టాలు రద్దు చేసే కార్యక్రమాన్ని విరమించుకోవాలని వారు కోరారు.

మరిన్ని వార్తలు