అవినీటి బాగోతం

25 Jun, 2016 14:12 IST|Sakshi
అవినీటి బాగోతం

కదిరిలో నీటిపన్ను స్వాహా..  
అధికారిక కొళాయిలు 6,150  
అక్రమ కొళాయి కనెక్షన్లు 6 వేలు
రూ.1.80 కోట్ల డిపాజిట్ హాంఫట్
 

ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడన్న చందంగా తయారైంది.. కదిరి మున్సిపాలిటీ పరిస్థితి. మున్సిపాలిటీలో కొళాయి కనెక్షన్లు ఇచ్చే విభాగంలో పనిచేసే ఓ ఉద్యోగి కొంత కాలంగా చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అక్రమంగా కొళాయి కనెక్షన్లు ఇస్తూ వాటి డిపాజిటు.. నెలసరి బిల్లులు సైతం దండుకుంటున్నారు. ఇప్పటి దాకా పట్టణంలో  ఆరు వేల అక్రమ కనెక్షన్లు ఉన్నట్లు తెలిసింది.
 
 
కదిరి:  రేషన్‌కార్డు ఉన్న వారికి కేవలం రూ.200కే కొళాయి కనెక్షన్ ఇచ్చేలా దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్.రాజశేఖరరెడ్డి అప్పట్లో జీఓ జారీ చేశారు. ఇప్పటికీ ఆ విధానమే కొనసాగుతోంది. రేషన్‌కార్డు లేని ప్రభుత్వ ఉద్యోగులు తమ ఇంటికి కొళాయి కనెక్షన్ తీసుకోవాలంటే డిపాజిట్ రూ.6 వేలు, రోడ్ కటింగ్ కోసం మరి కొంత అదనపు రుసుం చెల్లించాల్సి ఉంటుంది. నిబంధనల మేరకు సక్రమంగా కొళాయి కనెక్షన్ తీసుకున్న వారు కదిరి మున్సిపల్ పరిధిలో ఇప్పటి వరకు 6,150 మంది మాత్రమే ఉన్నారు. వీరు ప్రతినెలా రూ.100 చొప్పున నీటి పన్ను చెల్లించాలి. వీరిలో కొందరు రెగ్యులర్‌గా చెల్లిస్తుంటే రాజకీయ పలుకుబడి ఉన్న వారు మాత్రం నీటిపన్ను అసలే చెల్లించలేదు.  
 
 సగం ధర చెల్లిస్తే చాలు.. :

సక్రమ కొళాయి కనెక్షన్ కావాలంటే రూ.6 వేలు డిపాజిట్ చెల్లించాలి. అయితే సంబంధిత శాఖలో పనిచేసే ఓ ఉద్యోగికి సగం ధర అంటే రూ.3 వేలు ముట్టజె బితే కొళాయి కనెక్షన్ ఇచ్చేస్తారు. ఇలా అక్రమ కొళాయి కనెక్షన్‌లు ఆరు వేల దాకా ఉన్నట్లు తెలిసింది. ఈ అక్రమ కొళాయిల డిపాజిట్ డబ్బు రూ.1.80 కోట్లు సదరు ఉద్యోగి జేబులోకి వెళ్లిందట. అంతే కాందండోయ్..వీరు కూడా ప్రతినెలా రూ.100 చొప్పున నీటి పన్ను కూడా చెల్లిస్తున్నారట. డిపాజిట్‌కు గాని, ప్రతినెలా చెల్లించే నీటిపన్నుకు గాని వీరి దగ్గర రసీదులు లేవు. వీరు ప్రతినెలా రూ.6 లక్షలు పన్ను రూపంలో ఆయన జేబు నింపుతున్నారన్నమాట.

అంటే ఏడాదికి రూ.72 లక్షలు మున్సిపల్ ఆదాయానికి గండిపడుతోంది. కొన్ని ఇళ్లకు నిత్యం నీటి సరఫరా : సక్రమంగా కొళాయి కనెక్షన్ తీసుకున్న ఇళ్లకేమో వారానికి రెండు రోజులు మాత్రమే మంచినీరు సరఫరా చే స్తున్నారు. అయితే అక్ర మంగా కొళాయి కనెక్షన్ తీసుకున్న కొన్ని ఇళ్లకు మాత్రం పట్టణంలో ఏ వీధికి మంచినీరు సరఫరా చేసినా ఆ ఇళ్లకు నీరు సరఫరా అవుతుంది. తాము ప్రతినెలా రూ.200 నీటి పన్ను చెల్లిస్తున్నామని, తమకు డెరైక్ట్ లైన్ ద్వారా మంచినీరు సరఫరా అవుతుందని వారు బహిరంగంగా చెబుతున్నారు. అందుకే ఆ ఇళ్లలో స్నానం చేయడానికి, దుస్తులు ఉతకడానికి చివరికి మరుగుదొడ్డిలో సైతం మంచినీటినే వాడుతున్నారు.  
 
 
 విచారణ నిర్వహిస్తాం
 నీటి పన్ను వంద శాతం వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అక్రమ కొళాయి కనెక్షన్ల విషయం నా దృష్టికి రాలేదు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి నిజమని తేలితే ఇందుకు బాధ్యులైన వారిపై తగు చర్యలు తీసుకుంటాం.
 -నాగేశ్వర్‌రావు, మున్సిపల్ కమిషన ర్, కదిరి

>
మరిన్ని వార్తలు