రిజర్వ్‌డ్‌ స్థలాలపై రాబందులు

26 Oct, 2016 01:57 IST|Sakshi
రిజర్వ్‌డ్‌ స్థలాలపై రాబందులు
  • కార్పొరేషన్లో పార్క్‌ స్థలాలకు అధికార పార్టీ నేతల స్పాట్‌
  • ఇప్పటికే 30 శాతం కబ్జాకు గురైన వైనం
  •  
    నెల్లూరు సిటీ: నెల్లూరు నగర ప్రజలు అహ్లాదానికి దూరమవుతున్నారు. పార్క్‌లను నిర్మించి ప్రజలకు ఆహ్లాదాన్ని అందించాల్సిన పాలకవర్గం, అధికారులు రిజర్వ్‌డ్‌ స్థలాల కబ్జాలకు అధికారిక అనుమతులివ్వడం గమనార్హం. గత పాలకవర్గంలో ఓ మాజీ ఎమ్మెల్యే తన అనుచరులతో కార్పొరేషన్‌ పరిధిలో రూ.కోట్ల విలువజేసే పార్క్‌ స్థలాలను ఆక్రమించారనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం అధికార పార్టీ నేతలు తామేమీ తక్కువ కాదంటూ కార్పొరేషన్‌ స్థలాలకు స్పాట్‌ పెడుతున్నారు. 
    పార్క్‌ స్థలాలకు పత్రాలేవీ..?
    నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 182 పార్క్‌ స్థలాలు ఉన్నాయి. అయితే కార్పొరేషన్‌ కార్యాలయంలో సంబంధిత పార్క్‌ స్థలాలకు పత్రాల్లేవని అధికారులు వెల్లడిస్తున్నారు. కొన్ని పార్క్‌ స్థలాలకు సంబంధించిన పత్రాలు మాత్రమే ఉన్నాయని సమాచారం. దీంతో అధికార పార్టీ నేతలతో అధికారులు కుమ్మక్కై పార్క్‌ స్థలాలను కబ్జా చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే దాదాపు 30 శాతం పార్క్‌ స్థలాలు అన్యాక్రాంతమయ్యాయి. ఉన్న స్థలాలను సైతం కాపాడుకునే ప్రయత్నాలను అధికారులు చేయకపోవడం గమనార్హం. 
    సుప్రీంకోర్టు ఉత్తర్వులు బేఖాతర్‌
    నగరపాలక సంస్థ పరిధిలో లేఅవుట్లు వేసిన వారు 10 శాతాన్ని కార్పొరేషన్‌కు ఇవ్వాల్సి ఉంది. ఈ స్థలాల్లో పార్క్‌లు, కమ్యునిటీ హాళ్లను నిర్మించాల్సి ఉంది. సుప్రీం కోర్టు 2002లో 72,114 జీఓ ప్రకారం పార్క్‌ స్థలాల్లో పార్క్‌లు, కమ్యూనిటీహాళ్లకు మాత్రమే వినియోగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇతర వాటికి వినియోగిస్తే కోర్టు ధిక్కారం కింద కేసు నమోదు చేసే అవకాశం ఉంది. అయితే పాలకవర్గం, అధికారులు సుప్రీం కోర్టు ఉత్తర్వులను పట్టించుకోవడంలేదు. 
    ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకోని అధికారులు
    తమ డివిజన్లో పార్క్‌ స్థలం కబ్జాకు గురవుతోందని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అటువైపు చూడటంలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాగుంటలేవుట్లో రూ.30 కోట్ల విలువజేసే స్థల కబ్జాకు ఏడాదిన్నర క్రితం ఓ నాయకుడు యత్నించారు. నకిలీ పత్రాలను సృష్టించి కబ్జాకు యత్నించడంతో స్థానికుల ఫిర్యాదుతో అప్పటి కమిషనర్‌ ఐఏఎస్‌ చక్రధర్‌బాబు అడ్డుకట్టవేశారు. 
    •  ఇటీవల 16వ డివిజన్‌ ఆదిత్యనగర్‌లో ఓ అధికార పార్టీ నేత 96 అంకణాల స్థలాన్ని కాజేసేందుకు యత్నించారు. స్థానికుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది.  
    • ఎఫ్‌సీఐ కాలనీలో సైతం ఓ వ్యక్తి పార్క్‌ స్థలంలో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. స్థానికుల నుంచి వ్యతిరేకత రావడంతో అధికారులు ఆక్రమణను తొలగించారు.
    • 13వ డివిజన్‌ బాలాజీనగర్‌లో కూడా ఓ వ్యక్తి పార్క్‌ స్థలాన్ని దర్జాగా కబ్జా చేసి ఇళ్లు నిర్మించారు.
    కబ్జాకు తెరలేపిన అధికార పార్టీ..!
    ఈ నెల 28వ తేదీన జరిగే కౌన్సిల్‌ అజెండాలో పార్క్‌ స్థలాల కబ్జాకు తెరలేపారు. ఇప్పటి వరకు అనధికారికంగా కబ్జా చేసే నేతలు అధికార కబ్జాకు రంగం సిద్దం చేశారు. లక్ష్మీపురంలో దొడ్ల సుబ్బారెడ్డి లేఅవుట్లో రూ.15 కోట్ల విలువజేసే స్థలాన్ని దక్కించుకునేందుకు అధికార పార్టీ నేతలు యత్నిస్తున్నారు. దీంతో ఈ అంశాన్ని కౌన్సిల్‌ అజెండాలో పెట్టారు. వేదాయపాళెంలోని రిత్విక్‌ లేవుట్‌లో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ట్రస్ట్‌ ద్వారా 18 సెంట్ల భూమిని వైద్యశాల భవనానికి కేటాయించాలని అజెండాలో పెట్టారు. ఈ రెండు అంశాలకు కౌన్సిల్లో ఆమోద ముద్ర వేస్తే అధికారిక కబ్జా చేసినట్లేనని పలువురు పేర్కొంటున్నారు.
     
     
మరిన్ని వార్తలు