’రైతు రథం’పై నేతల కన్ను

30 Jul, 2017 00:44 IST|Sakshi
’రైతు రథం’పై నేతల కన్ను
తమ వారికే దక్కాలంటూ ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాకుండానే పైరవీలు 
అర్హులకు మళ్లీ అన్యాయం జరిగే పరిస్థితి
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
అన్నదాతలకు ట్రాక్టర్లు అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకువచ్చిన రైతురథం పథకం కేవలం పచ్చ చొక్కాలకే దక్కుతుందా? ప్రస్తుతం జరుగుతున్న తంతు చూస్తే నిజమనే అనిపించక మానదు. అర్హులకు ట్రాక్టర్లు అందే అవకాశం కనపడటం లేదు. రాయితీ ట్రాక్టర్లను దక్కించుకునేందుకు తెలుగుదేశం పార్టీ మండల నేతలు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. తమ వర్గం వారికే ఇప్పించేందుకు పైరవీలు చేస్తున్నారు. ఈ ఎంపిక బాధ్యతను ప్రభుత్వం ఇంఛార్జి మంత్రి చేతుల్లో పెట్టడంతో ఇవి పూర్తిగా ఒక వర్గానికే దక్కే అవకాశాలు కనపడుతున్నాయి. గతంలో వరికోత యంత్రాల మంజూరులో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుంది. నిర్ణయించిన సామర్ధ్యం కన్నా తక్కువ సామర్ధ్యం ఉన్న వరికోత యంత్రాలను లబ్ధిదారులకు అంటగట్టారు. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు వచ్చాయి. తాజాగా వచ్చిన రైతురథం పథకం కూడా అర్హులకు అందే పరిస్థితి లేకుండా పోతోంది. జిల్లాలో మొత్తం 15 నియోజకవర్గాల్లో రైతు రథం పథకం కింద 520 ట్రాక్టర్లు మంజూరు చేశారు. బహిరంగ మార్కెట్‌లో ట్రాక్టర్‌ ఖరీదు 8 నుంచి 9 లక్షల మధ్య ఉంది. ప్రభుత్వం రెండున్నర లక్షల రూపాయల సబ్సిడీతో రైతులకు ఇవ్వాలని నిర్ణయించింది.  దీనికి కనీసం రైతుకు రెండు ఎకరాల పొలం ఉండాలన్న నిబంధన పెట్టింది. దీంతో కౌలు రైతులకు ఈ పథకం అందకుండా పోనుంది. మిగిలిన వారు దరఖాస్తుతో పాటు ముందుగా రూ. 10 వేల రూపాయల డీడీని జతచేసి, మీసేవ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. జిల్లా వ్యాప్తంగా 15 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. రెండు, మూడు ఎకరాల భూమి ఉన్న రైతుల సంఖ్య వేలల్లో ఉంటుంది. అయితే ప్రతి ట్రాక్టర్‌కు రెండున్నర లక్షల రూపాయల సబ్సిడీ రానుండటంతో దీనిపై ప్రజాప్రతినిధుల కన్ను పడింది. జిల్లా కేటాయింపు ప్రకారం ప్రతి నియోజకవర్గానికి 34 వరకూ వస్తాయి. వీటిని సొంతం చేసుకునేందుకు అధికారపార్టీ నేతలు ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తెస్తున్నారు. ఎంపికలో జిల్లా ఇంఛార్జి మంత్రి పాత్ర ప్రధానం కానుంది. ప్రజాప్రతినిధులు తమవారికి వీటిని దక్కించుకునేందుకు ఇప్పటి నుంచి మంత్రిపై ఒత్తిడి తెస్తున్నారు. వ్యవసాయ శాఖ ద్వారా ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పథకాలు అర్హులకు అందడం లేదన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అసలు పొలం వైపు కన్నెత్తి చూడని వారు కూడా ఈ రాయితీ ట్రాక్టర్ల కోసం ఎగబడుతున్నారు. దీంతో వాస్తవంగా సాగు చేసే రైతులకు పనిముట్లు దొరకడం లేదు. రైతులకు ట్రాక్టర్లు అందించాలనే లక్ష్యం కూడా తప్పుదోవ పట్టే పరిస్థితి కనపడుతోంది. రాష్ట్రమంతటా రైతు రథం కోసం దరఖాస్తులు తీసుకోవడం, ట్రాక్టర్ల కేటాయింపు ప్రక్రియ పూర్తి కావస్తున్నా మన జిల్లాలో మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. ఉన్నతాధికారుల నుంచి నివేదిక వచ్చిన తర్వాతే ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరిస్తామని వ్యవసాయ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ గౌసియా బేగం చెబుతున్నారు. 
 
 
 
మరిన్ని వార్తలు