చెట్టాపట్టాలు నిజమే

5 Sep, 2017 06:51 IST|Sakshi
సర్వే నెంబర్‌ 161–1లో నిర్మాణాలు ఇలా..

ఓ రెవెన్యూ అధికారితో టీడీపీ నాయకుల మిలాఖత్‌
సమాచారహక్కు చట్టంతో వెలుగులోకి..


అనంతపురం రూరల్‌:
టీడీపీ నాయకులతో రెవెన్యూ అధికారుల మిలాఖత్‌ నిజమే. నగర నడిబొడ్డున గల రాజహంస టవర్స్‌ ఎదురుగా ఉన్న అనంతపురం పొలం సర్వే నంబర్‌ 94, 161– 1లోని 2.54ఎకరాలు, 1ఎకరా స్థలం వంక పోరంబోకు స్థలాలకు ఇంటి పట్టాల మంజూరులో ఓ ప్రజాప్రతినిధి అనుచరులుగా చలామణి అవుతున్న చోటా నేతలతో కలిసి ఒక రెవెన్యూ అధికారి కీలక పాత్ర పోషించి పేదల మాటున పెద్దలకు ధారాదత్తం చేశారు. ఈ విషయం సమాచారహక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాలతో రూడీ అయ్యింది. ఆ సర్వే నంబర్లలోని çస్థలాలు వంకపోరంబోకు స్థలాలు. వీటికి ఇంటి పట్టాలను ఇచ్చే అధికారం రెవెన్యూ అధికారులకు ఏమాత్రమూ లేదు.

ఆ ఇంటి పట్టాలపై అధికారులే నిగ్గు తేల్చాలి
సమాచార హక్కు చట్టం కింద రెవెన్యూ అధికారులు అందించిన వివరాలను తీసుకొని క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే.. అసలు విషయం బయట పడింది. అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారిని విచారిస్తే వారు ఇంటి పట్టాలను చూపిస్తున్నారు. వారు అందించిన ఇంటి పట్టాలను పరిశీలిస్తే 2012 సెప్టెంబర్‌ 26న అప్పటి తహసీల్దారు బలరామిరెడ్డి సంతకం చేసినట్లు స్పష్టం చేస్తున్నాయి. అయితే వారి దగ్గర ఉన్నవి నకిలీ ఇంటిపట్టాలా?  లేక తహసీల్దారే రిటైర్‌ అయిన తర్వాత పాత తేదీలతో సంతకాలు చేసి జారీ చేసినవా?తహసీల్దారు సంతకం ఫోర్జరీ చేశారా? అన్న విషయం ఉన్నతాధికారులు విచారణ జరిపితే అసలు నిజాలు బయట పడే అవకాశం ఉంది.

మోసపోతున్న ప్రజలు
సొంతింటి కల నిజం చేసుకోవాలనే ఆశతో నిరుపేదలు ఇలాంటి మోసగాళ్ల వలలో పడి నిలువునా మోసపోతున్నారు. ఈ ఇంటి పట్టాలు అసలైనవో.. నకిలీవో  తెలుసుకోలేక స్థలాల ను కొనుగోలు చేసి నష్టపోతున్నారు. ఆక్రమణలతో కుంచించుకుపోయిన మురుగు కాలువ ఆక్రమణల కారణంగా మురుగుకాలు వ కుంచించుకుపోయింది. వంద అడుగులకు పైగా ఉన్న మురుగుకాలువ ప్రస్తుతం 20 అడుగులు మాత్రమే మిగిలింది. ఆక్రమణలను తొలగించడంలో నగరపాలక సంస్థ అధికారులు, టౌన్‌ప్లానింగ్‌ విభాగం సిబ్బంది విఫలమయ్యారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనేఆరోపణలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు