అక్కడ పోస్టింగ్..వద్దు బాబోయ్

12 May, 2016 15:46 IST|Sakshi
అక్కడ పోస్టింగ్..వద్దు బాబోయ్

 ధర్మవరంలో తమ్ముళ్ల దెబ్బకు సబ్ రిజిస్ట్రార్ల హడల్
 మామూలు ఇవ్వాలంటూ వేధింపులు.. సెలవుపై వెళ్తున్న అధికారులు

 
అధికారం అడ్డం పెట్టుకుని తెలుగు తమ్ముళ్లు బరితెగిస్తున్నారు. ఏకంగా అధికారుల వద్దే రౌడీ మామూళ్లు వసూలు చేసేందుకు సిద్ధమయ్యారు. కాదూ కూడదంటే..సెలవులో వెళ్లిపోవాలంటూ బెదిరిస్తున్నారు. అంతకూ వినకపోతే సదరు ఆఫీసర్‌ను  బదిలీ చేయిస్తున్నారు. దాదాపుగా అనంతపురం జిల్లావ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే ఉన్నా, ధర్మవరంలో మాత్రం మితిమీరింది.

ధర్మవరం : అనంతపురం జిల్లా ధర్మవరంలో పోస్టింగ్ అంటేనే  సబ్‌రిజిస్ట్రార్‌లు హడలిపోతున్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు తట్టుకోలేక ఒకరు.. వారు అడిగినంత మామూళ్లు ఇచ్చుకోలేక మరొకరు..ఇలా ఎవరికి వారు ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నారు.  టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికి నలుగురు సబ్ రిజిస్ట్రార్లు  మారిపోయారు. తాజాగా టీడీపీ నాయకులు ఏరికోరి కర్నూలు నుంచి తెచ్చుకున్న వై.బజారీ కూడా వీరు చెప్పే పనులు చేయలేక సెలవుపై వెళ్లిపోయారు. దీంతో మూడు రోజులుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఇన్‌చార్జ్ పాలనలో నడుస్తోంది. గతంలో కూడా శ్రీనివాసనాయక్ అనే సబ్‌రిజిస్ట్రార్ అధికార పార్టీ నాయకుల బెదిరింపులు, వేధింపులతో దాదాపు ఆరు నెలల పాటు అవస్థ పడ్డారు. ప్రతినెలా తమకు మామూళ్లు ఇవ్వాలని, లేకపోతే అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కు ఫిర్యాదు చేస్తామని తీవ్రస్థాయిలో బెదిరింపులకు గురిచేశారు. ఏ రోజు ఎన్ని రిజిస్ట్రేషన్లు చేశారన్న జాబితా కూడా తమకు ఇవ్వాల్సిందేనని  బెదిరించారు. చోటా నాయకులు కూడా ‘అన్న పిలుస్తున్నాడు.. అన్న చెప్పాడు’ అంటూ సదరు సబ్  రిజిస్ట్రార్‌ను తరచూ పార్టీ కార్యాలయం వద్దకు పిలవడం, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న స్థలాలను రిజిష్టర్ చేయాలని ఒత్తిడి చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారు.

తనమాట వినలేదన్న కోపంతో ఓ నేత సదరు సబ్ రిజిస్ట్రార్‌పై తీవ్రమైన  ఆరోపణలు గుప్పించారు. అంతేకాకుండా  రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు సైతం చేశారు. అయినప్పటికీ శ్రీనివాస్‌నాయక్ వారికి లొంగకపోవడంతో ఓ ప్రజాప్రతినిధి వద్దకు పిలిపించి సెలవుపై వెళ్లాలని ఒత్తిడి చేశారు. అయినా ఆయన తన పని తాను చేసుకుపోవడంతో ఆగ్రహించిన టీడీపీ నేతలు రాష్ట్రస్థాయిలో చక్రం తిప్పి ఇక్కడి నుంచి బదిలీ చేయించారు. ఆయన వెళ్లిన తర్వాత తాము చెప్పినట్లు వింటాడని కర్నూలు జిల్లా నుంచి వై.బజారీని నెలరోజుల క్రితం ఇక్కడికి  తీసుకు వచ్చారు.  ఆయన కూడా ‘తమ్ముళ్లు’ అడిగినంత  ఇచ్చుకోలేకపోవడంతో  సెలవుపై పంపినట్లు తెలుస్తోంది.  సోమవారం నుంచి సెలవు పెట్టారు.  ప్రతి నెలా ఇంత మొత్తం ఇవ్వాలని డిమాండ్ చేస్తుండటంతో ధర్మవరం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం అంటేనే ఆ శాఖ అధికారులు హడలెత్తుతున్నారు.

మరిన్ని వార్తలు