చెరువు‘మట్టి’లూటీ..!

1 May, 2017 11:32 IST|Sakshi
చెరువు‘మట్టి’లూటీ..!

► ఇటుకబట్టీలకు తరలుతున్న చెరువు మట్టి
► యథేచ్ఛగా అక్రమ రవాణా
► చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు


కొందరు టీడీపీ నాయకులు నిన్న మొన్నటి వరకు ఇసుకను తవ్వి రూ. కోట్లను అక్రమంగా సంపాదించారు. ఇప్పుడు వారి కన్ను ‘చెరువు’ మట్టిపై పడింది. సమీప చెరువుల్లోని మట్టిని అక్రమంగా రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇదంతా కళ్లముందే జరుగుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది.

ఒంటిమిట్ట(రాజంపేట): రాజంపేటలో కృష్ణమ్మ చెరువు, ఒంటిమిట్టలో గం గపేరూరు చెరువు.. ఇలా ఊరికొక చెరువును మట్టిమాఫియా చెరపట్టింది. అధికార అండదండలతో టీడీపీ నా యకులు బరితెగిస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ యథేచ్ఛగా చెరువు మట్టిని తరలిస్తున్నారు. రైతుల పొలా లకని చెప్పి మట్టిని కడప నగర సమీపంలోని ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. చెరువులో పూడిక తీత పనులు చేపట్టుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఈ మట్టిని సమీప ప్రాంతంలోని రైతులు తమ పొలాలకు వాడుకోవచ్చని పేర్కొంది. అయితే టీడీపీ నాయకులు ఇవేమీ పట్టించుకోకుండా అక్రమంగా చెరువుమట్టిని లారీల్లో తరలిస్తున్నారు.

పచ్చనేతలంటే హడల్‌..!
ఒంటిమిట్ట–దర్జిపల్లె రహదారిలో గంగపేరూరు చెరువు కింద 441 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ చెరువు మట్టిపై అధికారపార్టీకి చెందిన ఓ నేత కన్నుపడింది. చెరువులోని మట్టి నాణ్యమైనది కావడంతో ఎడాపెడా చెరువును తవ్వేస్తున్నారు. కళ్లముందే పరిస్థితి కనిపిస్తున్నా సంబంధిత అధికారులు మిన్నకుండిపోతున్నారు. రెవెన్యూ, పోలీసు, మైనర్‌ ఇరిగేషన్‌ అధికారులకు విషయం తెలిసినప్పటికీ పచ్చనేతల జోలికి వెళ్లేందుకు భయపడుతున్నారు.

అడ్డుకుంటే అక్రమ కేసులు..
గంగపేరూరు చెరువు మట్టిని తరలించడాన్ని అడ్డుకుంటుంటే తమపై  అక్రమకేసులు పెట్టి వేధిస్తామని తెలుగు తమ్ముళ్లు భయపెడుతున్నారని స్థానిక రైతులు చెబుతున్నారు. ఇటీవల ఇదే గ్రామానికి చెందిన కొంతమంది వడ్డెర సామాజిక వర్గానికి చెందిన వారు మట్టి తరలింపుపై అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని జీర్ణించుకోలేని అధికారపార్టీ నాయకుడు వారిపై ఎస్టీ, ఎస్టీ కేసు పెట్టించారు.

పట్టించుకునేవారెవరు..?
గంగపేరూరు చెరువులో యంత్రాలు పెట్టి మట్టిని యథేచ్ఛగా తరలిస్తున్నా పట్టించుకునేవారే లేరా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అక్రమ రవాణాతో ఇప్పటికే చెరువులో పెద్ద, పెద్ద గుంతలు పడ్డాయి. రాత్రి వేళల్లో గుట్టుచప్పుడుకాకుండా మట్టి తరలిస్తున్నారు. ట్రాక్టర్లు, టిప్పర్లు, లారీలలో కడప, భాకరాపేట తదితర ప్రాంతాలలోని ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. చెరువులో మట్టి తరలింపును రెవెన్యూ అధికారులు పరిశీలించి వెళుతున్నా చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు.

మరిన్ని వార్తలు