పేదల స్థలాన్ని కాజేశారు

28 Jun, 2016 08:58 IST|Sakshi

నిరుపేదల కిచ్చిన ఇళ్ల స్థలాలను వారు నిర్ధాక్షిణ్యంగా కాజేశారు. తమ జిరాయితీగా చెప్పి దర్జాగా అమ్మేశారు. అధికారం అండ చూసుకుని పేట్రేగిపోయారు. అప్పనంగా వచ్చిన భూమిని లక్షలాది రూపాయలకు అమ్మేసి ఎంచక్కా జేబులో వేసేసుకున్నారు. అన్నీ చూస్తున్న అధికారులు సైతం కిమ్మనకుండా... ప్రేక్షక పాత్ర వహించారు. సమాచార హక్కు చట్టంలో అది ప్రభుత్వభూమేనని తేలినా పేదలకు న్యాయం జరగలేదు.
 
 టెక్కలి(నెల్లిమర్ల): సొంతగూడు లేని నిరుపేదలకు ప్రభుత్వమిచ్చే ఇళ్ళస్థలాలనూ టీడీపీ నేతలు వదలడంలేదు. దశాబ్దం క్రితం సర్కారు పంపిణీచేసిన స్థలాలను ఆక్రమించుకుని, గుట్టుచప్పుడు గాకుండా అమ్మేసుకున్నారు. లబ్ధిదారులు అడిగితే అధికారం తమేననీ ఏమైనా చేస్తాం అని దబాయిస్తున్నారు. దీనికి ఉదాహరణ నెల్లిమర్ల మండలంలోని టెక్కలి గ్రామంలో తాజాగా వెలుగు చూసిన అక్రమం.
 
 అధికారం అండగా... యథేచ్ఛగా అమ్మకం
 టెక్కలి గ్రామంలో 53మంది సొంత ఇళ్ళులేని నిరుపేదలకు 2002లో అప్పటి ప్రభుత్వం ఇళ్ళస్థలాలను పంపిణీచేసింది. గ్రామాన్ని ఆనుకుని ఉన్న సర్వేనంబరు 21లోగల 1.62 ఎకరాల భూమిలో లేఅవుట్ వేసి స్థలాలను అప్పగించింది. ఒక్కో లబ్ధిదారునికి రెండేసిసెంట్లు రాగా.. వాటిపై ఈనాటివరకూ ఎలాంటి ఇల్లూ నిర్మించుకోలేదు. నాడు తమకు స్థలాలు మంజూరు చేసిన టీడీపీ ప్రభుత్వమే మళ్ళీ అధికారంలోకి రావడంతో ఇళ్లు మంజూవుతాయని భావించారు. ఇంతలో ఆ స్థలంపై విజయనగరానికి చెందిన ఓ టీడీపీనేత కన్ను పడింది.
 
ఎలాగైనా దాన్ని కొట్టేయాలని, భావించి గతంలో ఇక్కడ పనిచేసిన వీఆర్వో సహాయంతో పట్టా తయారుచేసి, విజయనగరానికి చెందిన ఓ వ్యక్తికి దర్జాగా విక్రయించాడు. సమాచారహక్కు చట్టంద్వారా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆ స్థలం వివరాలు సంపాదించాడు. దీంతో ఆ బాగోతం వెలుగు చూసింది. దీని ప్రకారం స్థలం 2002లో టీడీపీ ప్రభుత్వం నిరుపేదలకు ఇచ్చినదేనని రుజువైంది. అయితే ఆ స్థలాన్ని మాత్రం ఆ టీడీపీ నేత రూ. 40 లక్షలకు విజయనగరానికి చెందిన బడాబాబుకు అమ్మేసినట్టు తెలుస్తోంది. ఆ స్థలం తన బంధువులకు చెందిన జిరాయితీ అని, అందుకే విక్రయించామని ఆ నాయకుడు ప్రచారం చేసుకుంటున్నారు.
 
 ‘మీ కోసం’లో ఫిర్యాదు
 టెక్కలిలో చోటుచేసుకున్న భూ కుంభకోణంపై శుక్రవారం ‘మీకోసం’ గ్రీవెన్సుసెల్‌లో ఫిర్యాదు అందింది. దీనిపై నెల్లిమర్ల రెవెన్యూ అధికారులకు విచారణ చేపట్టమని ఆదేశాలు సైతం అందాయి. ఆ నేత భూ ఆక్రమణపై లబ్దిదారులంతా సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌లో కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
 
 విచారణ చేపడతాం
 టెక్కలి గ్రామంలో పేదలకు ప్రభుత్వం పంపిణీచేసిన ఇళ్ళస్థలాలను స్వాహా చేసినట్లు మీకోసంలో ఫిర్యాదు అందింది. ఆ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, గతంలో ఇచ్చిన పేదలకు అందజేయాలని ఫిర్యాదుదారులు కోరారు. దీనిపై విచారణ చేపడతాం. అసైన్డ్ భూములు కొనడం, అమ్మడం నేరం. ఆక్రమణకు గురైనట్లు రుజువైతే ఆక్రమణదారుడిపై చర్యలు చేపడతాం. - కె.చిన్నారావు, తహసీల్దార్, నెల్లిమర్ల
 

మరిన్ని వార్తలు