టీడీపీలో డిష్యుం..డిష్యుం..!

9 Jun, 2016 19:53 IST|Sakshi
టీడీపీలో డిష్యుం..డిష్యుం..!

= గిద్దలూరు ఎమ్మెల్యే  అశోక్‌రెడ్డికి వ్యతిరేకంగా అన్నా వర్గీయుల నినాదాలు
 = 500 మందితో ఒంగోలుకు ర్యాలీ
 = మంత్రి శిద్దా, దామచర్ల, మాగుంటలకు ఫిర్యాదు

 
 
టీడీపీ ఎత్తు: ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి బుట్టలో వేసుకుంటే.. ఇంకా తిరుగు ఉండదని.. అసెంబ్లీ మొత్తం చేతుల్లోకి వస్తుందని.. రాష్ట్రంలో ఏకఛత్రాధిపత్యం సాధించవచ్చని.
 
యాక్షన్ ప్లాన్: జిల్లాలో కొంతమంది వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలతో పాటు గిద్దలూరు శాసనసభ్యుడు ముత్తుముల అశోక్‌రెడ్డి ఈ మధ్యనే టీడీపీ కండువా కప్పుకున్నారు.

రియూక్షన్: ఇప్పటికే టీడీపీ గిద్దలూరు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న అన్నారాంబాబు వర్గం అగ్గిమీద గుగ్గిలం అయింది. అధిష్టానంతోనే ఢీ అంటే ఢీ అంది. బుధవారం 500 మంది అనుచరులతో అన్నా.. జిల్లా కేంద్రానికి చేరుకొని అమీతుమీకి సిద్ధమయ్యారు.
 
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: గిద్దలూరులో టీడీపీ రాజకీయాలు రోడ్డెక్కాయి. అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి..  పాత టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని, అభివృద్ధి పనులన్నీ తమ వర్గీయులకే కేటాయించాలని అధికారులను బెదిరిస్తున్నాడని, ఫీల్డు అసిస్టెంట్లను, జన్మభూమి కమిటీ సభ్యులను తమ వారినే నియమించాలంటూ ఒత్తిడి చేస్తున్నారని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే,  టీడీపీ నేత అన్నా రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అశోక్‌రెడ్డితో అమీతుమీకి సిద్ధమయ్యారు. 500 మందికిపైగా తన అనుచరులతో బుధవారం ఒం గోలుకు తరలివచ్చారు. మంత్రి శిద్దా రాఘవరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఇళ్లను ముట్టడించారు.
 
 సీన్ - 1
ముందుగా అన్నా అనుచరులు మంత్రి శిద్దా రాఘవరావు ఇంటికి వద్దకు చేరుకున్నారు. దామచర్ల జనార్దన్ సైతం అక్కడే ఉన్నారు. అశోక్‌రెడ్డికి వ్యతిరేకంగా తీవ్ర ఆరోపణలు చేస్తూ నినాదాలతో హోరెత్తించారు. 30 ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను అన్యాయం చేసి నడివీధిలో నెట్టారంటూ పార్టీపై దుమ్మెత్తిపోశారు. కేకలు, ఈలలతో ఆ ప్రాంతం హోరెత్తిపోయింది. అన్నాను పిలిచి.. మంత్రి, జనార్దన్‌లు చర్చలు జరిపారు. ఆ తర్వాత ఆయన బయటకు వచ్చి కార్యకర్తలతో మాట్లాడారు. పార్టీ జెండాలు మోసిన వారికి తీవ్ర అన్యాయం చేశారని, కొత్తగా పార్టీలో చేరిన వారు అంతా తామేనంటూ పెత్తనం చలాయిస్తున్నా.. తాము చేతగాని వాళ్లలా కూర్చోవలసి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
 
 సీన్ - 2
అనంతరం అన్నా అనుచరులు  ర్యాలీగా ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఇంటికి చేరుకున్నారు.  నినాదాలతో రచ్చ రచ్చ చేశారు. ఇంట్లో ఉన్న మాగుంట అన్నాతో పాటు ముఖ్యనేతలను పిలిచి చర్చలు జరిపారు. అశోక్‌రెడ్డి.. అన్నా అనుచరులకు వ్యతిరేకంగా చేపట్టిన కార్యకలాపాలను వివరించారు. ముఖ్యమంత్రితో మాట్లాడి న్యాయం చేయకపోతే తాము రోడ్డెక్కాల్సి వస్తుందని తేల్చి చెప్పారు. మాగుంట బయటకు వచ్చి అన్నా అనుచరులనుద్దేశించి ప్రసంగించారు. ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునే విషయంలో జిల్లా నేతల ప్రమేయం లేదన్నారు. దీనివల్ల పార్టీలో గందరగోళం వచ్చిన మాట వాస్తవమేనన్నారు. అశోక్‌రెడ్డి దూకుడు పార్టీకి తీవ్ర నష్టం చేకూరుస్తుందని త్వరలోనే నిర్ణయం తీసుకోవాలని వారంతా మాగుంటను కోరారు.
 

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా