శ్మశానాలను వదలని తెలుగు తమ్ముళ్లు !!

30 May, 2016 10:27 IST|Sakshi

నీరు-చెట్టు పథకానికి దొరకని చోటు
శ్మశానంలో అడ్డగోలుగా తవ్వకాలు
అడ్డొచ్చిన దళితులకు బెదిరింపులు
మితిమీరిన టీడీపీ నేతల దౌర్జన్యం
ఎప్పటిలాగే కిమ్మనని అధికారులు

 
అక్కడలా..
 నిజాయితీకి నేను బ్రాండ్ అంబాసిడర్‌ను.. అవినీతిని కూకటివేళ్లతో పెకిలిస్తా.. తప్పు చేస్తే నాయకులైనా.. అధికారులైనా వదిలే ప్రసక్తే లేదు.. నిర్లక్ష్యాన్ని సహించను.. నేను నిద్రపోను.. మిమ్మల్ని నిద్రపోనివ్వను.. అంతిమంగా పేదలకు న్యాయం జరగాలి.. తిరుపతిలో మూడు రోజులు జరిగిన టీడీపీ మహానాడులో ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ప్రసంగించారు.

ఇక్కడిలా...
అంతటి నీతి వాక్యాలు వల్లించే సదరు నేతకు క్షేత్రస్థాయిలో తెలుగు తమ్ముళ్ల అక్రమాలు కనిపించకపోవడం విచారకరం. ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రవేశ పెట్టినా టీడీపీ నేతల చిలక్కొట్టుడుతో లబ్ధిదారులకు అన్యాయం జరుగుతోంది.. నీరు-చెట్టు, పింఛన్లు, ఫారం పాండ్స్.. ఇలా ఒకటేమిటి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అన్నీ పథకాల్లో అవినీతిదే సింహభాగం.
 

దర్శి: నాడు సత్యహరిశ్చంద్రుడు సత్యం కోసం శ్మశానంలో కాపలా ఉండి దాన్ని కాపాడితే.. నేడు ఈ రాష్ట్రాన్ని ఏలుతున్న తెలుగు తమ్ముళ్లు నీరు-చెట్టు పథకం పేరుతో శ్మశానాలను సైతం పూడ్చి నాలుగు రాళ్లు వెనకేసుకునేందుకు యత్నిస్తున్నారు. సదరు పథకం తమ్ముళ్లకు కాసుల వర్షం కురుపిస్తుండటంతో నిబంధనలకు నిలువునా నీళ్లొదులుతున్నారు. వాగులు, చెరువుల్లో పూడికలు తీసి భూగర్భ జలాలు పెంపొందించేందుకు ప్రభుత్వం నీరు-చెట్టు పథకాన్ని ప్రవేశ పెట్టింది. తెలుగు తమ్ముళ్లు మాత్రం నిబంధనలు తమకు వర్తించవని శ్మశానాలను సైతం దున్నేస్తూ ప్రశ్నించిన వారిపై దౌర్జన్యాలకు దిగుతున్నారు. ఫిర్యాదులు చేసినా పట్టించుకునే అధికారులు ఎలాగూ లేకపోవడంతో వారి అవినీతికి అడ్డే లేకుండా పోయింది.  
 
వివరాలు..
దర్శి మండలం యర్రఓబనపల్లి పంచాయతీ పరిధి అగ్నిపూరి కాలనీలో 20 ఏళ్లుగా 220 కుటుంబాలకు చెందిన ఎస్సీ,ఎస్టీలు నివాసముంటున్నారు. ఆ గ్రామ సర్వే నంబర్ 1,2లో ఐదెకరాలను చాలా ఏళ్లుగా శ్మశానం కింద వాడుకుంటున్నారు. ఆ గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు నీరు-చెట్టు పథకాన్ని ఆసరా చేసుకుని శ్మశానంలో గుంతలు తీసేలా అధికారుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా అనుమతి పొందారు. సమాధులున్నా పొక్లెయిన్తో కొండ వరకు తవ్వేశారు. సమాధులు కూల్చి మొత్తం చదును చేశారు. గ్రామస్తులంతా ఏకమై శనివారం రాత్రి టీడీపీ నేతలను అడ్డుకున్నారు. గ్రామానికి చెందిన చింతా వెంకటేశ్వరరెడ్డి, చింతా వెంకటరామిరెడ్డి, పాలెం యోగిరెడ్డి, పేరం పోలిరెడ్డి అనే తెలుగుదేశం పార్టీ నాయకులు తమపై దౌర్జన్యానికి దిగారని పలువురు ఎస్సీలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను కులం పేరుతో దూషించారని, శ్మశానం జోలికి వస్తే ఊచకోత కోస్తామని హెచ్చరించారని బాధితులు వెంకటయ్య, జి.విల్సన్‌బాబు, పి.హరీష్ ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటన స్థలానికి కొందరు గ్రామస్తులు వచ్చి ఇరువర్గాలకు నచ్చజెప్పి పంపినట్లు స్థానికుడు గుంటూరు వెంకటయ్య తెలిపారు.  

పూర్వీకుల ఆనవాళ్లు మాయం
 శ్మశానంలో తమ పూర్వీకుల సమాధులు మాయం చేశారని ఎస్సీలు జి.ఆదాం, టి.యలమంద, జి.ఏసు, కె.రమణమ్మ, మరికొందరు గ్రామస్తులు వాపోయారు. తమ పూర్వీకుల సమాధుల ఆనవాళ్లు కూడా లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మనిషి చనిపోతే పూడ్చి పెట్టే ఆరడుగుల స్థలం కూడా లేకుండా చేస్తున్నారని ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు.

మంత్రి వాదనేంటో?
దర్శి నియోజకవర్గంలో పేదల ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన శిద్దా రాఘవరావు ఈ విషయంలో పేదలకు ఏం చెబుతారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. తెలుగు తమ్ముళ్ల ఆగడాలు అరికట్టాలని మంత్రిని కోరుతున్నారు. నీరు-చెట్టు పథకానికి చెరువులు, వాగులు, కుంటలకు నిధులు మంజూరు చేయాలిగానీ శ్మశానాల్లో నీరు-చెట్టు పనులు చేయడమేంటని నిలదీస్తున్నారు. నీరు-చెట్టు పనులపై దృష్టి పెట్టి అవినీతిని అరికట్టాల్సిన బాధ్యత మంత్రిపైనే ఉందని చెప్తున్నారు. మంత్రి స్పందించి తగు చర్యలు తీసుకోకుంటే ఎస్సీ,ఎస్టీలను ఏకం చేసి ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు