దేవుడి పేరున గ్రావెల్‌ దోపిడీ

12 Mar, 2017 23:20 IST|Sakshi
దేవుడి పేరున గ్రావెల్‌ దోపిడీ
యడ్లపాడు: దేవుడి పేరున గ్రావెల్‌ దోపిడీకి పాల్పడుతున్నారు. టీడీపీ అధికారం చేపట్టినప్పటి నుంచి ఇసుక, మట్టి, గ్రావెల్‌ ఇలా సహజ వనరుల దోపిడీ కొనసాగుతూనే ఉంది. తాజాగా యడ్లపాడు మండలంలోని సంగం గోపాలపురం గ్రామ పరిధిలో అక్రమ గ్రావెల్‌ తవ్వకాలకు దేవుడి పేరును ఉపయోగించుకుంటున్నారు. ఈ నెల 11న సంగం గోపాలపురం గ్రామం ప్రసన్నాంజనేయస్వామి తిరునాళ్ల నిర్వహించారు. 
 
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గుడికి భక్తులకు ఎగుడుదిగుడు లేకుండా రోడ్డు సరిచేసుకుంటామని దీనికి అవసరమైన గ్రావెల్‌ను గ్రామపరిధిలోని ప్రభుత్వ భూముల్లో ఉన్న ఎర్రమట్టి గ్రావెల్‌ను తవ్వుకుంటామని స్థానిక గ్రామ నాయకులు మంత్రి ప్రత్తిపాటి దృష్టికి తీసుకువెళ్లారు. అధికారుల నుంచి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. మంత్రి సరే అన్నదే తరువాయి తిరునాళ్లకు ముందుగానే గ్రావెల్‌ తవ్వకాలు ప్రారంభించారు. పనిలో పనిగా కొంతగ్రావెల్‌ గుడిముందు రోడ్డుకు తోలి యథేచ్ఛగా బయట ప్రాంతాలకు గ్రావెల్‌ విక్రయాలు చేపట్టారు. ఈ తతంగం మొత్తానికి సంబంధిత శాఖల అ«ధికారుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. కేవలం అధికారం ఉందికదా తమను ప్రశ్నించే వారెవరు అన్న రీతిగా కొనసాగిస్తున్నారు. ఎంతో విలువైన రెడ్‌గ్రావెల్‌ తవ్వి వందల కొద్ది ట్రక్కులు ద్వారా విక్రయాలు చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో లక్షలాది రూపాయలు అధికార పార్టీ నాయకుల జేబులు నింపాయన్నది నగ్నసత్యం. 
 
గతంలోనూ తవ్వకాలు...
ప్రస్తుతం తిరునాళ్ల పేరుతో గ్రావెల్‌ అక్రమ తవ్వకాలకు పాల్పడిన నాయకులకు గతంలోనూ ఇక్కడ ప్రభుత్వ భూముల్లో తవ్వకాలకు పాల్పడిన చరిత్ర ఉంది. సుమారు 8 నెలల కిందట టీడీపీ మండలస్థాయి నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ భారీగా తవ్వకాలు నిర్వహించి సుమారు పది ఎకరాల విస్తీర్ణంలో తవ్వి టన్నుల కొద్ది గ్రావెల్‌ను విక్రయించారు. అప్పట్లో ఈ గ్రావెల్‌ తవ్వకాలు బట్టబయలు కావడంతో వివిధ శాఖల అ«ధికారులకు ముడుపులు ముట్టజెప్పి తాత్కాలికంగా ఒక నెలరోజులు ఆపి తిరిగి తవ్వకాలు చేశారు.
మరిన్ని వార్తలు