‘భారతీయుడు’పై దాడి కేసులో ...

31 Jan, 2016 09:23 IST|Sakshi
‘భారతీయుడు’పై దాడి కేసులో ...

  పోలీసులపై ‘టీడీపీ’ ఒత్తిళ్లు
 
విజయవాడ : సామాజిక కార్యకర్తపై దాడి ఘటన విచారణలో పోలీసులు ఆచితూచీ వ్యవహరిస్తున్నారు. నిందితుల అరెస్టుకు కుటుంబ సభ్యుల డిమాండ్.. వదలాలంటూ టీడీపీ పెద్దల నుంచి పోలీసులపై ఒత్తిళ్లు పెరిగాయి. ఆరోపణలు ఎదుర్కొం టున్న వ్యక్తుల తరపున అధికార పార్టీ ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగడంతో సమగ్ర దర్యాప్తు తర్వాతనే తదుపరి చర్యలకు దిగాలని పోలీసు అధికారులు నిర్ణయించినట్టు తెలి సింది. ‘ఈ భారతీయుడిని..చచ్చేలా కొట్టారు!’ శీర్షికను శనివారం సాక్షిలో ప్రచురితమైన కథనం రాజకీయ, పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
 
పెనమలూరు భారతీయునిగా పేరొందిన సామాజిక కార్యకర్త ముప్పాళ్ల బద్రినారాయణపై జరిగిన దాడి, అధికార తెలుగుదేశం పార్టీ నేతల ప్రమేయంపై కథనంలో సవివరంగా వచ్చింది. విషయం బయటకు పొక్కడంతో పోలీసు అధికారులు అన్ని కోణాల్లోను దర్యాప్తు చేయాలని నిర్ణయించారు. బద్రినారాయణ చికిత్స పొందుతున్న ఆస్పత్రికి ఇన్‌చార్జి ఏసీపీ వి.వి.నాయుడు, పెనమలూరు ఇన్‌స్పెక్టర్ పి.రాజేష్ వెళ్లి మరోసారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత అదుపులోని వ్యక్తులను విచారించారు.
 
 తెల్లవారుజామున వాకింగ్‌కు వెళ్లే సమయంలో బద్రినారాయణపై దాడి జరిగింది. హఠాత్తుగా నిందితులు దాడి చేయడంతో షాక్‌కు గురైన ఆయన మాటలు వినడం మినహా వచ్చిన వారి ముఖాలను గుర్తించలేకపోయారు. దాడి సందర్భంగా వారు వాడిన పదజాలాన్ని బట్టి నిందితులను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే విషయాన్ని శనివారం మరోసారి పోలీసుల ఎదుట చెప్పారు.
 
  దీనిపై బాధితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా తమపై కేసు నమోదు చేయడాన్ని అదుపులో ఉన్నవారు తప్పుబట్టినట్టు తెలిసింది. ఆ సమయంలో తాము వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నట్టు చెప్పడంతో ఫోన్ కాల్‌డేటా, టవర్ లొకేషన్ తదితర వివరాలు సేకరించేందుకు పోలీసు అధికారులు నిర్ణయిం చారు. వాటి ఆధారంగా కేసు దర్యాప్తులో ముందుకు వెళ్లాలని వారు భావిస్తున్నారు.
 
 కేసు నమోదు కాకుండా...
 దాడి జరిగిన రోజు నుంచే నిందితులుగా చెపుతున్న వారికి మద్దతుగా జిల్లాకు చెందిన ఓ మంత్రి, పెనమలూరు నియోజకవర్గానికి చెందిన కీలక ప్రజాప్రతినిధి కేసు నమోదు కాకుండా పోలీసులపై ఒత్తిళ్లు తెచ్చినట్టు తెలిసింది. అయినప్పటికీ ముగ్గురిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణకు ఉపక్రమించడంతో మరోసారి పోలీసులపై తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు తెస్తున్నట్టు చెపుతున్నారు. కేసు విచారణ బాధ్యతలను ఇన్‌చార్జి ఏసీపీ వి.వి.నాయుడు నుంచి తప్పించి మరో అధికారికి అప్పగించాలని వారు కోరుతున్నట్లు కమిషనరేట్ వర్గాల సమాచారం.

మరిన్ని వార్తలు