తమ్ముళ్ల నయాదందా!

26 Jun, 2017 22:37 IST|Sakshi
తమ్ముళ్ల నయాదందా!

ఇందిరమ్మ లేఅవుట్‌పై కన్ను!
కార్యకర్తలకే పట్టాలు ఇప్పించేందుకు గూడుపుఠాణి
ఇంటి పట్టాలు అమ్ముకుని రూ.లక్షలు గడిస్తున్న వైనం


పేదల సొంతింటి కల చెదిరిపోనుంది. మూడేళ్లుగా ఒక్క ఇంటి పట్టా కూడా ఇవ్వని టీడీపీ ప్రజా ప్రతినిధులు కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ లే అవుట్‌పై కన్నేశారు. ఇందులోని ఖాళీ ప్లాట్లను టీడీపీ కార్యకర్తలకే దక్కేటట్లు ఆ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే రెవెన్యూ అధికారులకు నియోజకవర్గ ప్రధాన నేత మౌఖిక ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది.
- కళ్యాణదుర్గం

కళ్యాణదుర్గంలోని ఐదుకల్లు రోడ్డు, శెట్టూరు రోడ్డులో 2010లో సర్వే  384, 385, 386 ,498–1 భూముల్లో 18 ఎకరాలను అ‍ప్పటి ప్రభుత్వం కొనగోలు చేసి ఇందిరమ్మ లేఅవుట్‌ కింద 1,154 ప్లాట్లను వేసి అర్హులైన పేదలకు స్థలాలను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంది. ఇందులో ఏడాది క్రితం నాలుగు వందల ప్లాట్లు ఖాళీగా ఉండగా, మూడు నెలల క్రితం రెవెన్యూ అధికారుల సర్వేలో 288 మాత్రమే ఖాళీగా ఉన్నట్లు తేలింది. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత  వందకు పైగా ప్లాట్లను బినామీ పేర్లతో టీడీపీ నేతలు పట్టాలు పొంది, ఒక్కొక్కటి రూ. 1లక్షకు పైగా విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఖాళీ స్థలాలను తమ పార్టీ కార్యకర్తలకే కట్టబెట్టాలంటూ అధికారులపై ఒత్తిడి తీసుకెళ్తున్నారు.

అర్హుల పేరుతో దోపిడీ
ఎలాగో తమ ప్రభుత్వం ఇంటి పట్టాలు ఇవ్వదన్న భావన బలంగా ఉన్న టీడీపీ నేతలు... ఇందిరమ్మ లే అవుట్‌లపై కన్నేశారు. ఈ లే అవుట్‌లలో ఖాళీగా ఉన్న స్థలాలను తమ అనుయాయులకు ఇప్పించేందుకు ఆ పార్టీ ప్రధాన నేతలు గూడుపుఠాణీ చేస్తున్నారు. అర్హులకు ఇంటి పట్టాలు ఇస్తున్నట్లు బాహటంగా చూపుతూ.. లోలోన టీడీపీ కార్యకర్తలకే పట్టాలు దక్కేటట్లు పావులు కదిపారు. ఇంటి పట్టాల కోసం 650 దరఖాస్తులు అందగా, ఇందులో 125 మందికి గతంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనట్లు అధికారుల విచారణలో తేలడం గమనార్హం.

అనర్హులకు ఇస్తే సహించం
ఇందిరమ్మ లే అవుట్‌లో టీడీపీ నాయకులకే పట్టాలిచ్చి పేదలకు అన్యాయం చేస్తే సహించం. టీడీపీ ముఖ్య నేతల ఆదేశాల ప్రకారం అధికారులు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే పోరాటాలు చేస్తాం.
– నాగరాజు, ఎంఆర్‌పీఎస్‌ నాయకుడు, కళ్యాణదుర్గం

సత్తా ఇంటే భూమి కొని పట్టాలివ్వండి
అర్హులకు ఇంటి పటాలిస్తే తప్పుపట్టం. అయితే అనర్హులైన వారికి ఇందిరమ్మ లే అవుట్‌లో అక్రమంగా పట్టాలిస్తే ఊరుకోం. టీడీపీ నేతలకు సత్తా ఉంటే భూమి కొనుగోలు చేసి ఎన్టీఆర్‌ కాలనీ పేరు పెట్టి పట్టాలిస్తే అభ్యంతరం లేదు.
– బోయ నాగరాజు, కాంగ్రెస్‌ నాయకుడు, కళ్యాణదుర్గం

న్యాయపోరాటానికి సిద్ధం
టీడీపీ నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇందిరమ్మ లే అవుట్‌లో ప్లాట్ల కోసం అక్రమాలకు పాల్పడుతున్నారు. దీనిపై అధికారులు నిక్కచ్చిగా వ్యవహరించకపోతే న్యాయం పోరాటం చేస్తాం.
– బిక్కి హరి, వైఎస్సార్‌సీపీ నాయకుడు, కళ్యాణదుర్గం

సిఫార్సులకు తలొగ్గామనడం సబబు కాదు
అధికార పార్టీ నేతల సిఫార్సులకు తలొగ్గామని చెప్పడం సబబు కాదు. అనర్హులకు పట్టాలిస్తారని విమర్శించడం సరైందికాదు. దరఖాస్తుల ఆధారంగా విచారణ చేపట్టి అర్హులను గుర్తించి వారికే పట్టాలు అందజేస్తాం.
– రవీంద్ర, తహసీల్దార్‌, కళ్యాణదుర్గం

మరిన్ని వార్తలు