ఏ సభకైనా రావాల్సిందే!

22 Nov, 2016 03:06 IST|Sakshi
అధికార, అనధికార సభలకు రావాలని
 డ్వాక్రా సంఘాలకు టీడీపీ హుకుం
 రాకుంటే రుణ సాయం ఉండదని హెచ్చరిక
 బ్లాక్ లిస్ట్‌లో పెడతామంటూ బెదిరింపులు
 దిక్కుతోచని స్థితిలో మహిళా సంఘాలు
 
 అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నాయకులు అడ్డదిడ్డంగా వ్యవహరిస్తున్నారు. మెప్మా అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చి ప్రభుత్వ కార్యక్రమాలతోపాటు టీడీపీ సభలకు హాజరు కావాలని డ్వాక్రా సంఘాలకు హుకుం జారీచేస్తున్నారు. సభలకు రాని సంఘాలు, సభ్యులను గుర్తించి బ్లాక్ లిస్ట్‌లో పెడతామని హెచ్చరిస్తున్నారు. అంతటితో ఆగక రుణసాయాన్నీ ఆపేస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. తీవ్ర వ్యయప్రయాస లకోర్చి మహిళలు టీడీపీ సభలకు తరలిరావాల్సి వస్తోంది. 
 
 తిరుపతి, తుడా: జిల్లాలో 12 వేల డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. ఇందులో 1.3 లక్షల మంది మహిళలు సభ్యులుగా కొనసాగుతున్నారు. తిరుపతిలో 3,850 డ్వాక్రా సంఘాల్లో 39 వేల మంది ఉన్నారు. అభ్యుదయ, స్పందన గ్రూపు లీడర్లు వీరిని లీడ్ చేస్తున్నారు. ఏదైనా సభ జరిగితే ప్రజలు రాకపోయినా వీరు వస్తే చాలని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. అనధికారికంగా వీరిపై ఒత్తిడి తీసుకొచ్చి సభలకు రావాలని ఇబ్బందులు పెడుతున్నారు. రానివారిని సంఘం నుంచి తప్పిస్తామని, 10 మందితో కూడిన సంఘంలో ఒకరిద్దరు రాకపోయినా ఆ సంఘానికి ఇబ్బం దులు తప్పవనే హెచ్చరికలు పంపుతున్నారు. అధికార పార్టీ మెప్పుకోసం కొంత మంది లీడర్లు సభ్యులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొస్తున్నారు. 
 
 సంఘాల ఏర్పాటు ఉద్దేశమిది?
 మహిళలు ఆర్థికంగా ఎదిగి, సొంతంగా వ్యాపారాలు చేసుకుని, అవసరాలకు రుణ సాయం అందిచేందుకు డ్వాక్రా సంఘాలు ఏర్పాటయ్యాయి. రుణాల మంజూరు సభలు, సభ్యుల అభ్యున్నతి కోసం ఏర్పాటు చేసే సమావేశాలు, స్వయం ఉపాధి అవగాహన, రుణ సద్వినియోగం వంటి సమావేశాలకు సభ్యు లు హాజరుకావాలి. వీటికి మినహా మరే సభలకు పిలవకూడదు. ఎప్పుడూ లేని విధంగా అధికారి పార్టీ నేతలు ప్రతి కార్యక్రమానికీ వీరిపైనే ఆధారపడుతున్నారు. 
 
 ఒత్తిడి.. హెచ్చరికలు
 ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలతో పాటు టీడీపీ నిర్వహించే ప్రతి కార్యక్రమానికీ డ్వాక్రా సంఘాల సభ్యులు హాజరుకావాలని ఒత్తిడి తెస్తున్నారు. సమావేశాలకు, సభలకు రానిపక్షంలో అలాంటి సంఘాల సభ్యులకు రుణ సాయం ఉండదని సంఘాల లీడర్ల చేత హెచ్చరికలు జారీ చేస్తున్నారు. లీడర్లూ మెప్పు పొందేందుకు సభ్యులను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. 
 
 ఖర్చులకు వెనకాడి..
 ప్రభుత్వం, టీడీపీ నాయకులు నిర్వహించే సభలకు ప్రజలను తీసుకురావాలంటే ఖర్చుతో కూడుకున్న పని. రాకపోకలకు, భోజనం, ఇతర ఖర్చులు ఉంటా రుు. ఇవన్నీ భరించేందుకు ప్రజలు ఇష్టపడటం లేదు. దీంతో అధికారి పార్టీ నేత లు డ్వాక్రా సంఘాలపై దృష్టి సారించా రు. జిల్లావ్యాప్తంగా 1.3 లక్షల మందిలో కనీసం సభ జరిగే ప్రాంతానికి చుట్టుపక్కల మండలాల నుంచి 5-10 వేల మంది వచ్చినా సభ విజవంతమవుతుందని భావిస్తున్నారు. ఈ ఏడాదితోపాటు గత ఏడాది అంతకుముందు జరి గిన సీఎం సభలకు అత్యధికంగా సంఘాల సభ్యులనే తరలించి సఫలీకృతులయ్యారు.
 
 నొక్కేస్తున్న సంఘాల లీడర్లు
 సభలకు, సమావేశాలకు సభ్యులను తీసుకురావడానికి అధికార పార్టీ నేతల నుంచి సంఘాల లీడర్లు లెక్క నొక్కేస్తున్నారు. రాను పోను ఖర్చులు, భోజనం తో పాటు ఒక్కొక్కరికి రూ.200 నుంచి రూ.500 వరకు సభను బట్టి సభ్యులకు ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మొత్తాన్ని లీడర్లే బొక్కేస్తున్నట్టు సమాచారం.  
 
 పనులు వదులుకుని.. పస్తులుంటూ
 డ్వాక్రా సంఘాల్లో రోజూ కూలీనాలీ చేసుకుని బతికేవారే ఎక్కువ. మరి కొందరు ఏదో చిన్నపనులు చేసుకుంటే తప్ప పూటగడవని పరిస్థితి. ఇలాంటి వారిని సభలు, సమావేశాలకు రావాలని ఒత్తిడి తెస్తున్నారు. సభలు ఎప్పుడు జరుగుతాయో.. ఎప్పుడు ముగుస్తాయో తెలియక వంటలు వండలేక, పిల్లలకు భోజనం పెట్టలేక సభలకు రాలేమని చెప్పలేక మహిళలు మదనపడుతున్నారు.
 
 డ్వాక్రా అధికారులపై ఒత్తిళ్లు
 డ్వాక్రా సంఘాలను పర్యవేక్షించే పై స్థాయి అధికారి నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు తీవ్ర ఒత్తుడులు ఎదుర్కొంటున్నారు. తిరుపతిలో ఇటీవల జరిగిన ఓ సభకు వెయి మందిని తీసుకురావాలని ఓ మంత్రి, ఓ ఉన్నతాధికారి సిబ్బందిపై ఒత్తిడి తెచ్చారు. సంఘాల లీడర్లతో సమావేశమై ఒక్కో సంఘం నుంచి 500 మందికి తగ్గకుండా సభ్యులను సభకు తీసుకురావాలని హుకుం జారీ చేశారు. వారు సభ్యులపై మరింత ఒత్తిడి తీసుకొచ్చి సభకు రావాలని, లేకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించి సభకు తీసుకొచ్చారు. ఇలా జిల్లాలో జరిగే ప్రతి సభలోనూ ఇదే ఇదే తంతు.  
మరిన్ని వార్తలు