టీడీపీకి ఓటమి భయం

24 Sep, 2016 22:13 IST|Sakshi
టీడీపీకి ఓటమి భయం
అందుకే మున్సిపల్‌ ఎన్నికలు వాయిదా వేస్తోంది
కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి
 
కోడుమూరు: తెలుగుదేశం పార్టీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే కర్నూలు కార్పొరేషన్‌ ఎన్నికలను వాయిదా వేస్తున్నారని  కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. శనివారం లద్దగిరిలోని తన స్వగృహంలో వెల్దుర్తి, కృష్ణగిరి మండలాల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొంతమంది కాంగ్రెస్‌ కార్యకర్తలు మాట్లాడుతూ.. పరిస్థితులన్నీ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకే అనుకూలంగా ఉన్నాయని, కాంగ్రెస్‌ నాయకులంతా పత్తికొండ నియోజకవర్గ ఇంచార్జి చెరుకుపాటి నారాయణ వెంట వెళ్తున్నారని తెలియజేయడంతో కోట్ల కొంత అసహనానికి లోనయ్యాడు.
 
రెండు గుర్రాల స్వారీ పద్ధతి కాదని, తన వెంట నడిచే వాళ్లే తనతో ఉండాలని, లేదంటే ఎవరి దారి వాళ్లు చూసుకోవాలని తెగేసి చెప్పారు. టీడీపీ నేతల దౌర్జన్యాలకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. రెండున్నర సంవత్సరాలు టీడీపీ ఎలాంటి అభివృద్ధి చేయకపోవడంతో ప్రజలు ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారని తెలిపారు. కరువు ఏర్పడినా మూడేళ్లుగా నష్టపరిహారమివ్వలేదని, రైతులకు గిట్టుబాటు ధరలు రావడంలేదని.. ఈ సమస్యలన్నింటిపై పోరాడేందుకు జిల్లా అంతటా పర్యటిస్తానని తెలియజేశారు.
 
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చి కూర్చున్నా.. కర్నూలు కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీడీపీ గెలవలేదన్నారు. కార్యకర్తల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు లక్కసారం లక్ష్మీరెడ్డి, వెల్దుర్తి జెడ్పీటీసీ సభ్యులు సమీర్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు సంజన్నగౌడ్, అమకతాడు వీరభద్రుడు తదితరులు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు