అస్మదీయుడి కోసం.. వియ్యంకుల పంతం

5 Mar, 2016 10:21 IST|Sakshi

వారిద్దరూ మంత్రులు.. పైగా కొన్ని నెలల క్రితమే వియ్యంకులయ్యారు. అప్పుడే వారి మధ్య విభేదాలు!.. విభేదాలంటే ఇదేదో కుటుంబ వివాదం అనుకునేరు!. ఇది ఫక్తు రాజకీయం.. అందులోనూ కీలకమైన ఒక విభాగాధిపతి పోస్టు యవ్వారం.. ఎవరికి వారు తమ మాటే నెగ్గాలని పట్టుదల వహించడంతో ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు. దాంతో ఆ విభాగాన్ని పట్టించుకునే నాథుడు లేకపోయాడు.. కుటుంబం కుటుంబమే.. రాజకీయం రాజకీయమే.. అని నిరూపిస్తున్న ఈ వ్యవహారం వివరాల్లోకి వెళితే..
 
 సాక్షి, విశాఖపట్నం: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ) ఇటీవలే స్వచ్ఛ భారత్ అవార్డును సొంతం చేసుకుంది. కానీ ఈ నగరంలో ప్రజారోగ్యాన్ని పరిరక్షించాల్సిన కీలకమైన ముఖ్య వైద్య ఆరోగ్యాధికారి (సీఎంహెచ్వో) సీటు ఎనిమిది నెలలుగా ఖాళీగా ఉంది. జాయింట్ డెరైక్టర్ డాక్టర్ ఎం.సత్య నారాయణరాజు రీజనల్ డైరెక్టర్‌గా పదోన్నతిపై గత ఏడాది జూలై 15న ఒంగోలుకు వెళ్లిపోయినప్పటి  నుంచి ప్రజారోగ్య విభాగం దిక్కులేనిదైంది.

ఇన్ చార్జ్‌గా వ్యవహరించిన జోన్ -4 ఏఎంవో డాక్టర్ మురళీమోహన్ కూడా కొద్దికాలానికే సెలవుపై వెళ్లిపోయారు. ఈయన పనితీరుపై కమిషనర్ ప్రవీణ్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేయడం వల్లే సెలవుపై వెళ్లిపోయారనే ప్రచారం జరిగింది. దాంతో ఈ బాధ్యతలను ఏడీసీ జనరల్ జీవీవీఎస్ మూర్తికి అప్పగించినప్పటికీ పని ఒత్తిడి పెరగడంతో ఆయన పూర్తిగా దృష్టి పెట్టలేకపోతున్నారు.  కమిషనర్ ప్రవీణ్ కుమార్ అంతా తానై చూసుకోవడం వల్లే పారిశుద్ద్య నిర్వహణ గాడిలో పడింది. అయినప్పటికీ జీవీఎంసీలోనే అతిపెద్ద విభాగమైన ప్రజారోగ్యంలో క్షేత్ర స్థాయిలో ఏమూల ఏం జరుగుతుందో పర్యవేక్షించడం అంత ఈజీ కాదు. సీహెచ్ఎంవో పోస్టు ఎనిమిది నెలలుగా ఖాళీగా ఉండడంతో ప్రజారోగ్యంలో కీలకమైన శానిటేషన్ అండ్ సాలిడ్వేస్ట్ మేనేజ్మెంట్, మెడికల్ కేర్, అర్బన్ మలేరియా అండ్ విక్టర్ బోర్న్ డిసీజెస్, బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రేషన్స్, ఫుడ్ హైజనిక్, వెటర్నరీ పబ్లిక్ హెల్త్, నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ (ఎన్యూహెచ్ఎం) విభాగాలపై పర్యవేక్షణ లేకపోవడంతో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా తయారైంది. కీలకమైన ఈ పోస్టు భర్తీ చేస్తే ఇటు కమిషనర్ .. అటు ఏడీసీ(జనరల్)పై ఒత్తిడి తగ్గుతుంది.
 
 ఇంత ప్రాధాన్యమున్న ఈ పోస్టును భర్తీ చేయడంలో ఇటీవలే వియ్యంకులుగా మారిన మున్సిపల్, మానవవనరుల శాఖల మంత్రుల మధ్య ఏకాభిప్రాయం కుదర లేదనే వాదన జీవీఎంసీలో బలంగా విన్పిస్తోంది. ఈ పోస్టులో శ్రీకాకుళానికి చెందిన డాక్టర్ దవళ భాస్కరరావును నియమించాలన్న ప్రతిపాదన ఇప్పటికే ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది. మరోపక్క గతంలో ఇదే పోస్టులో పనిచేసిన వైద్యాధికారితో పాటు కాకినాడ జీజీహెచ్, నెల్లూరు, గుంటూరు ప్రభుత్వాస్పత్రుల్లో సివిల్ సర్జన్ క్యాడర్లో పనిచేస్తున్న వైద్యాధికారులు దీని కోసం పైరవీలు సాగిస్తున్నట్టు తెలిసింది. రూ.50లక్షల వరకు ఇచ్చేందుకు నెల్లూరు, గుంటూరులలో పనిచేస్తున్న ఒకరిద్దరు సిద్ధపడినట్టు చెబుతున్నారు. కాగా తమకు కావాల్సిన వారిని ఈ పోస్టులో కూర్చోబెట్టేందుకు వియ్యంకులైన మంత్రులిద్దరూ ఎవరికివారు పట్టుదలతో ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వారి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడమే ఈ పోస్టు భర్తీలో జాప్యం జరుగుతోందని అంటున్నారు. దీనిపై కమిషనర్ ప్రవీణ్ కుమార్‌ని ఎప్పుడు అడిగినా సీఎంహెచ్వో పోస్టు భర్తీ నా చేతుల్లో లేదు.. ప్రభుత్వమే త్వరలో నిర్ణయం తీసుకుంటుందంటూ దాటవేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు