ఎమ్మెల్యేలకు 'వైట్ కాలర్ వల'

12 Nov, 2015 08:57 IST|Sakshi
ఎమ్మెల్యేలకు 'వైట్ కాలర్ వల'

బ్యాంకు ఖాతాలో రూ. 2.50 లక్షల జమ చేయాలని మెసేజ్!
సొమ్ము జమచేసి ఆఖరి నిమిషంలో మేల్కొన్న ఓ ఎమ్మెల్యే?
 
కాకినాడ : నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. ఆర్థిక శాఖలో కార్యదర్శులకు నేనే మీడియేటర్‌ని. వర్క్స్ ఇప్పిస్తుంటా. మీ నియోజకవర్గానికి రూ.2.80 కోట్లు ప్రత్యేక గ్రాంట్‌గా ఇప్పిస్తా. ఇందుకోసం రూ. 2.5 లక్షలు సిద్ధం చేసుకోండి. మీ ఖాతాలో ఉంచుకొండి. మీ జిల్లాలో ఎమ్మెల్యేలందరికీ చెప్పా. అందరూ ఓకే చెప్పారు. మీరే ఆలస్యం...
 - ఇదీ మంగళవారం ఉదయం 10 గంటలకు ఓ అపరిచిత వ్యక్తి నుంచి కాకినాడకు చెందిన ఓ ఎమ్మెల్యేకు వచ్చిన ఫోన్!
 
మీరు ఖాతాలో రూ.2.5 లక్షలు వేశారా? అయితే రేపటి నుంచి బ్యాంకులకు సెలవులు. ప్రాసెసింగ్‌కు లేట్ అయిపోతోంది. బాస్ ఇమీడియట్‌గా డబ్బులు కావాలంటున్నారు. ఒక ఖాతా నంబరు మెసేజ్ చేస్తా. అందులో జమ చేయండి. ఎలాగూ బ్యాంకు ఖాతానే కాబట్టి మీరు సందేహించాల్సిన అవసరం లేదు...
 - ఇదీ మధ్యాహ్నం 2 గంటలకు మళ్లీ అదే వ్యక్తి నుంచి వచ్చిన ఫోన్! దీంతో హడావుడిగా సదరు ఎమ్మెల్యే ఆ అపరిచితుడు మెసేజ్ పంపిన ఖాతా నంబరులో రూ. 2.5 లక్షలు జమ చేశారు.
 
విశ్వసనీయ సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి...ఆ అపరిచితుడు రాష్ట్రంలోని పలువురు ఎమ్మెల్యేలకు ఫోన్‌లు చేశాడు. వారిలో ఎక్కువ మంది రూరల్ ఏరియాకు చెందినవారే. తొలుత సొంత ఖాతాలో జమ చేసుకొని ఉంచమన్న అతను...తర్వాత మధ్యాహ్నం మరో ఖాతా నంబరు ఇచ్చి జమ చేయమనడంతో కొంతమంది ఎమ్మెల్యేలకు సందేహం వచ్చింది.    ఆర్థిక శాఖలోని ఓ ఉన్నతాధికారిని సంప్రదించారు. అవన్నీ ఫేక్ కాల్స్...మోసపోవద్దని ఘాటుగానే హెచ్చరించడంతో అప్రమత్తమయ్యారు. విషయం ఆర్థిక మంత్రి దృష్టికి వెళ్లింది. ఆయన ఆ ఖాతా గురించి ఆరా తీశారు.
 
 ఆ ఖాతా విశాఖలోని ఓ బ్యాంక్కి చెందినదని,  సదరు ఖాత ఓ మహిళ పేరున ఉన్నట్లు తెలిసింది. ఆ ఖాతాలో మంగళవారం సాయంత్రమే రూ. 2.50 లక్షలు జమ అయ్యిందని బ్యాంకు మేనేజరు మంత్రికి చెప్పారు. ఆ సొమ్ము జమ చేసిన వ్యక్తి కాకినాడకు చెందిన ఎమ్మెల్యే అని తెలుసుకున్న మంత్రి... ఆఖాతాను వెంటనే స్తంభింపజేయాలని సిబ్బందిని ఆదేశించినట్లు సమాచారం. జరిగిన మోసం గురించి మంత్రి వెంటనే సదరు ఎమ్మెల్యేకు ఫోన్ చేసి చెప్పారు. దీంతో అసలు విషయం తెలుసుకున్న ఆ ఎమ్మెల్యే కంగుతిన్నారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఎమ్మెల్యే తర్జనభర్జన పడుతున్నట్టు తెలిసింది.
 
ఆఖరి నిమిషంలో ఆగిపోయాం...
అపరిచిత వ్యక్తి నుంచి మాకు ఫోన్ వచ్చింది. అతను చెప్పినట్లే ఖాతాలో సొమ్ము జమ చేయడానికి సిద్ధమయ్యాం. ఆఖరి నిమిషంలో ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యాన్ని సంప్రదించాం. అది ఫేక్ కాల్ అని ఆయన చెప్పడంతో ఆఖరి నిమిషంలో సొమ్ము జమ చేయకుండా ఆగిపోయాం.
 - పిల్లి సత్యనారాయణమూర్తి
 (కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి భర్త)

>
మరిన్ని వార్తలు