ఫోర్జరీతో టీడీపీ ఎంపీపీ మనస్తాపం..

18 Apr, 2016 09:26 IST|Sakshi
ఫోర్జరీతో టీడీపీ ఎంపీపీ మనస్తాపం..

► ఎంపీపీ సంతకాలతో రూ.50 లక్షల పనులకు ఆమోదం
► మనస్తాపానికి గురై రాజీనామాకు సిద్ధమైన ప్రజాప్రతినిధి
► టీడీపీ పరువు పోతుందని బుజ్జగించిన ఎమ్మెల్యే, ఇతర నేతలు

ఏలూరు: ప్రజాప్రతినిధి ఫోర్జరీ సంతకంతో ఉపాధి హామీ పనులకు ఆమోదముద్ర వేసిన ఘటన దేవరపల్లి మండల పరిషత్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దిగువస్థాయి ఉద్యోగి సుమారు రూ.50 లక్షలు విలువగల ఉపాధి హామీ పనులకు ఎంపీపీ సంతకాన్ని ఫోర్జరీ చేసి తీర్మానానికి ప్రతిపాదనలు పంపించినట్టు సమాచారం.

దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలో రెండు నెలల క్రితం ఉపాధి హామీ పథకం, ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక నిధులు, జిల్లా పరిషత్, మండల పరిషత్, పంచాయతీ, ఎస్‌డీఎఫ్ నిధులు సుమారు రూ.4 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో గ్రామాల్లో సిమెంట్ రోడ్లు నిర్మాణం చేపట్టడానికి ప్రణాళికలు తయారు చేశారు. పనులు చేపట్టడానికి గ్రామ పంచాయతీ తీర్మానంతో పాటు మండల పరిషత్ తీర్మానం చేసి జిల్లా కలెక్టర్‌కు పంపించాల్సి ఉంది. ఈ నిధుల్లో గౌరీపట్నంలో సిమెంట్ రోడ్లు నిర్మాణానికి రూ.50 లక్షలు కేటాయించారు. మంజూరు చేసిన పనులకు గత నెల 26న జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆమోదం కోసం మండల పరిషత్ అధికారి సమావేశంలో సభ్యుల ముందు ఉంచారు.

గౌరీపట్నంకు కేటాయించిన రూ.50 లక్షల పనులకు సంబంధించిన తీర్మానం ప్రతిపాదనపై ఎంపీపీ సంతకాన్ని మండల పరిషత్ కార్యాలయంలో పనిచేస్తున్న దిగువస్థాయి ఉద్యోగి ఫోర్జరీ చేసి తీర్మానాన్ని సంబంధిత వ్యక్తులకు ఇచ్చారు. దీంతో గత నెలలో గ్రామంలో పనులను పూర్తి చేశారు. ఈ విషయం ఎంపీపీ ఆలస్యంగా గమనించి అవాక్కయ్యారు.తనకు తెలియకుండా కార్యాలయంలో ఇంకా ఎన్ని జరుగుతున్నాయోనని ఆయన అనుమానం వ్యక్తం చేసి జరిగిన ఫోర్జరీ సంతకాలపై సీబీసీఐడీకి ఫిర్యాదు చేయటానికి సిద్ధపడగా పలువురు ప్రజాప్రతినిధులు అడ్డుపడినట్టు తెలిసింది. విషయాన్ని ఎంపీపీ రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ దృష్టికి తీసుకువెళ్లి దీనిపై తనకు న్యాయం చేయాలని కోరినట్టు తెలిసింది. 

ఘటనపై మనస్తాపానికి గురైన ఎంపీపీ నరసింహరావు రాజీనామాకు సిద్ధపడగా విషయం బయటపడితే పార్టీ పరువు పోతుందని ప్రజాప్రతినిధులు వారించినట్టు సమాచారం. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు వద్ద ఆర్యవైశ్య సంఘం నాయకులు, టీడీపీ నాయకులు, పలువురు సర్పంచ్‌ల సమక్షంలో పంచాయతీ నిర్వహించగా సదరు దిగువస్థాయి ఉద్యోగి జరిగిన తప్పును అంగీకరించినట్టు తెలిసింది. సంబంధిత అధికారిని ఎమ్మెల్యే తీవ్రంగా మందలించి భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారని సమాచారం.

అడుగడుగునా అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకుల వల్ల అవమానానికి గురవుతున్నానని ఎంపీపీ ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. అవమానంతో పనిచేసే కంటే రాజీనామా చేసి పక్కన ఉండటం మంచిదని ఎంపీపీ ఎమ్మెల్యే వద్ద వాపోయారు. ఎమ్మెల్యే, ఇతర నాయకులు సదరు దిగువస్థాయి ఉద్యోగిని ఇక్కడ నుంచి బదిలీపై పంపించటానికి నిర్ణయం తీసుకని ఎంపీపీని బుజ్జగించి శాంతింప చేసినట్టు తెలిసింది. కురుకూరు వద్ద మండల పరిషత్ నిధులురూ.1.50 లక్షలతో బస్‌షెల్టర్ నిర్మాణం చేశారు. దీనికి అదనంగా మరొక రూ. 35,000 ఎంపీపీ అనుమతిలేకుండా మండల పరిషత్ నిధుల నుంచి డ్రా చేసిన విషయం కూడా ఎంపీపీ వెల్లడించినట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు