మంత్రి ఇలాకానా.. మజాకా..!

19 Mar, 2017 23:55 IST|Sakshi

- ప్రజా ప్రయోజనాల ముసుగులో టీడీపీ కార్యాలయ పునాదులు
- తాము అనుమతులు ఇవ్వలేదన్న ఏపీఐఐసీ
- లీజు గడువు దాటితే అడ్డుకుంటామంటున్న దేవాదాయశాఖ
- గందరగోళంగా అనుమతుల ప్రక్రియ
- ఆందోళనలో ఆటోనగర్‌ కార్మికులు


రాప్తాడు / అనంతపురం కల్చరల్‌ : రాష్ట్రంలో టీడీపీ అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకూ ఆ పార్టీ నాయకులు జిల్లాలో యధేచ్ఛగా కబ్జాలకు పాల్పడుతూనే ఉన్నారు. మంత్రి నియోజకవర్గంలో ఈసారి ఏకంగా దేవుని భూములకే ఎసరు పెట్టారు. రాప్తాడులో ఎంతో ప్రాచీనమైన పండమేటి రాయుడు ఆలయానికి శ్రీకృ‍ష్ణదేవరాయల కాలం నుంచి నిన్న మొన్నటి వరకు వందల ఎకరాలలో మాన్యం ఉండేది. ఈ భూముల్లో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పోలీసుస్టేషన్, తహసీల్దారు కార్యాలయం వంటివి నిర్మించారు.
- మాన్యం భూమి సర్వే నెంబర్‌ 476లోని 68 ఎకరాలను దేవాదాయశాఖ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్‌ ఇండిస్ట్రియల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ ) ద్వారా ఆటోనగర్‌కు లీజుకిచ్చింది. మొబైల్‌ వర్క్‌షాపులన్నీ ఓ చోట ఉండాలనే భావనతో ఇలా చేశారు. ఇందుగ్గానూ ఆటోనగర్ అసోసియేషన్‌ ఏటా పదివేలు అద్దె చెల్లిస్తోంది. అయితే ఈ లీజు గడువు 20 ఏళ్లని దేవాదాయశాఖ అధికారులు చెబుతుండగా, ప్రతి ఐదేళ్లకోసారి రెన్యువల్‌ చేయించుకోవాల్సి ఉందని ఏపీఐఐసీ అధికారులు తెలుపుతున్నారు.

- టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందులో రెండకరాలలో ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌, బస్టాపు వంటి నిర్మాణాలు చేపట్టడానికి అనుమతులు తెచ్చుకున్నారు. పనిలోపనిగా ఎకరా పది సెంట్ల స్థలంలో టీడీపీ మండల కార్యాలయాన్ని కూడా కట్టించేస్తున్నారు. లీజుకిచ్చిన వాటిల్లో పూర్తిస్థాయి కట్టడాలు చేపట్టకూడదనే నిబంధన ఉన్నప్పటికీ దాన్ని తుంగలో తొక్కి పునాదులు, పిల్లర్లు వేసేశారు. ఆటోనగర్‌వాసులు కానీ, ఏపీఐఐసీ, దేవాదాయశాఖ అధికారులుగానీ అభ్యంతరం చెప్పిన దాఖలాలే లేవు.

- ఒక నెల కిందట ఇదే మాన్యంలో వ్యవసాయ శాఖ వారు గోడౌన్‌ నిర్మించడానికి సిద్ధపడితే ఆటోనగర్‌ అసోసియేషన్‌ తీవ్రంగా ప్రతిఘటించి అడ్డుకుంది. కానీ ఇప్పుడు టీడీపీ నాయకులు కట్టిస్తున్న భవనంపై కనీసం అభ్యంతరం చెప్పలేకుంది. ఇతర పార్టీల వారు మాత్రం అధికార పక్షానికి ఒక రూలు, ఇతరులకు మరో రూలా అంటూ అధికారులపై మండిపడుతున్నారు.

అన్ని పార్టీలకూ ఇలాగే ఇస్తారా?
అధికారంలో ఉన్నాం కదాని దేవుని భూములనే కాదు దేన్నైనా కబ్జా చేయడానికి అధికార పక్షం వారు ముందుంటున్నారు. ఆటోనగర్‌కు ఇచ్చిన ఈ స్థలంలో ప్రజాపయోగ నిర్మాణాలు సాగితే మేము కూడా స్వాగతిస్తాం. కానీ ఆలయ భూముల్లో పార్టీ కార్యాలయాల భవనాలు కట్టడమేంటి? మేము కూడా పార్టీ ఆఫీస్‌ కట్టుకుంటామని అడిగితే అధికారులు మాక్కూడా ఇలాగే అనుమతులిస్తారా?
- తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, రాప్తాడు
 
నోటీసులు పంపించాము
దేవుని మాన్యంలో 32 ఎకరాల వరకు ఇండస్ట్రీస్‌ డిపార్టుమెంటు ద్వారా ఆటోనగర్‌కు లీజుకిచ్చాము. దీనికిగాను వారు ప్రతి ఏటా అద్దె చెల్లిస్తున్నారు. కార్మికులందరూ ఓ చోట ఉంటారనే భావనతో ప్రభుత్వ అనుమతితోనే ఇలా చేశాం. అయితే పరిశ్రమల శాఖ వారు పార్టీ కార్యాలయానికి అనుమతి ఎందుకిచ్చారో తెలీదు. ఇదే విషయమై నోటీసు కూడా ఇచ్చాము. అనుమతులన్నీ సక్రమంగా ఉన్నాయని సమాధానం వచ్చింది. లీజు గడువు దాటితే తప్పకుండా అక్రమ నిర్మాణాలను తొలగిస్తాం.
- నాగేంద్రరావు, పండమేటిరాయుడు దేవాలయం ఈఓ

మేము అనుమతి ఇవ్వలేదు
దేవాదాయశాఖ ద్వారా మేము లీజుకు తీసుకుని ఆటోనగర్‌కు సబ్‌లీజుకిచ్చాము. అయితే తొలుత ఐదేళ్ల వరకే లీజు ఉంటుంది. అది కూడా 2016 సెప్టెంబర్‌ 5వ తేదీతో ముగిసిపోయింది. కాబట్టి మాకూ, ఈ నిర్మాణాలకు సంబంధం లేదు. మా డిపార్టుమెంటు ఏ నిర్మాణాలకూ అనుమతులివ్వలేదు. లీజు పొడిగించాలని అడుగుతున్నాం. కానీ ప్రభుత్వం ఇంకా పొడిగించలేదు. కాబట్టి ఇది దేవదాయశాఖ వారే చూసుకోవాలి.
- సోనీ, మేనేజర్, ఏపీఐఐసీ, అనంతపురం

అనుమతుల మేరకే నిర్మాణం
పండమేటి ఆలయ భూములు వేల ఎకరాలలో ఉండేవి. ప్రస్తుతం చాలా ప్రభుత్వ కార్యాలయాలు అందులోనే ఉన్నాయి. అదేవిధంగా అన్ని అనుమతులు తీసుకుని మా పార్టీ కార్యాలయం నిర్మిస్తున్నాం. తొలుత ఇండస్ట్రీస్‌ డిపార్టుమెంట్‌ ద్వారా జాయింట్‌ కలెక్టర్‌ను అనుమతి కోరాము. ఆ తర్వాత పంచాయతీ సెక్రటరీ, ఎమ్మార్వో ద్వారా పక్కా అనుమతులు తెచ్చుకునే నిర్మాణం చేపట్టాము. ఇందులో పార్టీ కార్యాలయమే కాదు, ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్, బస్టాప్‌ కూడా కడుతున్నారు. కాబట్టి అక్రమమనడానికి లేదు.
- సాకే నారాయణస్వామి, టీడీపీ మండల కన్వీనర్‌

మరిన్ని వార్తలు