స్వాతంత్య్ర వేడుకల్లోనూ ‘పచ్చ’పాతం

15 Aug, 2016 22:42 IST|Sakshi
స్వాతంత్య్ర వేడుకల్లోనూ ‘పచ్చ’పాతం

అనంతపురం టౌన్‌ : అనంతపురంలోని నీలం సంజీవరెడ్డి స్టేడియంలో సోమవారం జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లోనూ అధికారులు ‘పచ్చ’పాతం చూపారు. కేవలం అధికార పార్టీ నేతలు, తమ స్నేహితులు, బంధువులకు పెద్దపీట వేశారు.  సామాన్యులు వేడుకలను తిలకించే అవకాశం లేకుండా చేశారు. దీంతో పాసులుండీ ప్రయోజనం లేకుండాపోయింది. ప్రధానంగా బీ–3 గేట్‌ వద్ద తీవ్ర గందరగోళం నెలకొంది. అక్కడికి వచ్చిన ప్రజలను పోలీసు అధికారులు అడ్డుకున్నారు. దీంతో కొందరు వాగ్వాదానికి దిగారు.  పీటీసీ ప్రిన్సిపల్‌ వెంకటరామిరెడ్డి సైతం అక్కడకు వచ్చి ‘లోపలంతా నిండిపోయింది.. మీరు ఇంటికి వెళ్లిపోవడం బెటర్‌’ అంటూ ఉచిత సలహా ఇచ్చారు.


దీంతో ఆగ్రహానికి గురైన ప్రజలు ‘పాసులు లేని వాళ్లను, మీకు అవసరం ఉన్న వాళ్లను ముందే పంపి మమ్మల్ని మాత్రం వెళ్లనీయరా’ అంటూ నిలదీశారు. దీంతో ఆయన అక్కడి నుంచి నిష్క్రమించారు. ఇదే సమయంలో కొందరు టీడీపీ నాయకులు జెండాలు పట్టుకుని రాగా.. వారిని లోపలికి పంపించడం గమనార్హం. తమకు తెలిసిన వాళ్లు కనిపిస్తే కాసేపు పక్కనుండమని చెప్పి.. తీరిగ్గా లోపలికి పంపారు. ఎంట్రెన్స్‌ వద్ద భవనంపైకి (ఇక్కడ కుర్చీలు కూడా వేశారు) వెళ్లేందుకు అవకాశం ఉన్నా.. తమ వాళ్ల కోసం  పోలీసులు ఆ ప్రాంతాన్ని కూడా బంద్‌ చేశారు. దీంతో ప్రజలు ‘ వాళ్లే చూసుకోని.. ఇంటికెళ్లిపోదాం పదండి’ అంటూ వెనుదిరిగారు.


కొందరైతే పిల్లలను తీసుకొచ్చి ఇబ్బంది పడ్డారు. మహిళల అవస్థలు వర్ణనాతీతం. బీ–3 పాసులను ఇష్టానుసారంగా ఇచ్చేయడంతో పాటు అధికార పార్టీ నేతలు, కార్యకర్తలను ఎలా పడితే అలా పంపడంతో ఈ పరిస్థితి తలెత్తింది. కుల, మత, రాజకీయాలకు అతీతంగా నిర్వహించిన ఈ వేడుకల్లో కొందరు టీడీపీ కార్యకర్తలు పార్టీ జెండా తీసుకుని లోపల తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడం కొసమెరుపు.  

మరిన్ని వార్తలు