వాడివేడిగా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం

28 Aug, 2017 08:51 IST|Sakshi
వాడివేడిగా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం

తమ ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆరోపణలు
పార్టీలో గ్రూపులు ఉన్నాయని గగ్గోలు
తమ్ముళ్ల మధ్య పరస్పర వాగ్వాదం


కడప రూరల్‌ : జిల్లా ఇన్‌చార్జి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆ«ధ్వర్యంలో ఆదివారం కడప ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో నిర్వహించిన జిల్లా తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం వాడివేడిగా సాగింది. కార్యక్రమానికి అన్ని నియోజకవర్గాల నుంచి ఇన్‌చార్జిలు, ఆ ప్రాంతాలకు చెందిన నేతలు హాజరయ్యారు. ఆ మేరకు పులివెందుల నుంచి సతీష్‌రెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్‌ రవి, రాయచోటి నుంచి రమేష్‌రెడ్డి, బద్వేలు నుంచి ఎమ్మెల్యే జయరాములు, విజయజ్యోతి, మైదుకూరు నుంచి పుట్టా సుధాకర్‌ యాదవ్, ప్రొద్దుటూరు నుంచి వరదరాజులరెడ్డి, లింగారెడ్డి, రైల్వేకోడూరు నుంచి విశ్వనాథనాయుడు, బత్యాల చెంగల్రాయులు, రాజంపేట నుంచి మాజీమంత్రి బ్రహ్మయ్య, జమ్మలమడుగు నుంచి మంత్రి ఆదినారాయణరెడ్డి తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా పలు అంశాలు చర్చకు వచ్చాయి. కొన్ని అంశాలపై తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. సమాచారం మేరకు ఒక నియోజకవర్గానికి చెందిన నేత మాట్లాడుతూ ఎన్నికల్లో ఎవరినైనా గెలిపించాలంటే పార్టీ మొత్తం సమష్టిగా కృషి చేయాలి.. అయితే మా నియోజకవర్గంలో గ్రూపులు ఎక్కువగా ఉండడం, ఆ గ్రూపులను ప్రోత్సహించడం ఎంతవరకు సబబని నిలదీశారు. ఆ నియోజకవర్గానికి చెందిన మరో నేత మధ్యలో కల్పించుకుని గ్రూపుల్లేవని, కలిసికట్టుగానే పని చేస్తున్నామని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తాను ఏదైనా చేయడానికి తనకు ఏమంత ప్రాధాన్యత గల పదవి ఇచ్చారని తన మనసులో మాటను బయటపెట్టారు. అందుకు మంత్రి సోమిరెడ్డి కల్పించుకుని నువ్వు అలా మాట్లాడడం తగదు.. నీకు ఆ పదవి ఇవ్వడమే గొప్ప అని నిర్మోహమాటంగా బదులిచ్చారు.

అలాగే ఒక ప్రముఖ పుణ్యక్షేత్రంగల నియోజకవర్గానికి చెందిన నాయకుడు మాట్లాడుతూ తమ నియోజకవర్గంలో ఏనాడో వేసిన రింగ్‌రోడ్లు, అప్పుడు వేసిన రోడ్లు, ఏర్పాటు చేసిన లైట్లు తప్పితే ఇప్పుడు ఏమాత్రం అభివృద్ధి చెందలేదని ఆరోపించారు. అలాగే తనను స్థానికంగా ఎవరూ గుర్తించడం లేదని, చివరికి ఎస్‌ఐ కూడా పలకడం లేదని వాపోయినట్లు తెలిసింది. అందుకు మంత్రి సోమిరెడ్డి కల్పించుకుని కాసింత నవ్వుతూనే చాల్లేవయ్యా.. అంత పదవి అనుభవించావు.. ఆఖరికి ఎస్‌ఐ కూడా మాట వినలేదంటే ఎవరైనా వింటే నవ్విపోతారు.. చెప్పేదానికైనా ఒక అర్థం పర్థం ఉండాలంటూ బదులిచ్చారు. ఇంకొక జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పే ప్రముఖ  నాయకుడు మాట్లాడుతూ పార్టీలో సీనియర్‌ కార్యకర్తలకు న్యాయం జరగడం లేదని, మొన్న వచ్చిన వారికే పట్టం కడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు.

అందుకు మధ్యలోనే కల్పించుకున్న ఓ ప్రముఖ నేత మాట్లాడుతూ ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు మనకు ఓట్లు–సీట్లే ప్రధానం.. అలాంటి నాయకులకు ప్రాధాన్యత ఇస్తానని ఏనాడో చెప్పారని గుర్తు చేశారు. దీంతో ఆ నాయకుడు కిమ్మనకుండా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్బంగా ఒక జిల్లా అధికారి తీరుపై సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న నేతలంతా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో దక్షిణం వైపున గల నియోజకవర్గానికి చెందిన ఇటీవల టీడీపీలో చేరిన ఒక నాయకుడు కల్పించుకుని ఆ అధికారి ఉండాల్సిందేనని బదులిచ్చారు. అందుకు ఆ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆగ్రహించినట్లు తెలిసింది. అందుకు ఆ నాయకుడు ఏమాత్రం వెనుకడుగు వేయకుండా చాల్లేవయ్యా.. నీవెపుడు నియోజకవర్గంలో ఉంటున్నావని.. 24 గంటలు తిరుపతిలోనే ఉండి నీ పనులు చూసుకుంటున్నావని ఎద్దేవా చేశారు.

అలాగే ఉత్తర ప్రాంత నియోజకవర్గానికి చెందిన ఒక నేత తాను ప్రజాప్రతినిధిగా ఉంటునప్పటికీ ఎవరూ గుర్తించడం లేదని, తన అభిప్రాయాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఏకరువు పెట్టారు. అలాగే పలు నియోజకవర్గాలకు చెందిన నేతలు తమ ప్రాంత అభివృద్ధిపై తీవ్ర అంసతృప్తి వ్యక్తం చేశారు.  ఎన్నికలకు ముందు మనం ఎన్నో వాగ్దానాలు చేశాం.. వాటిల్లో చాలా వాటిని నామమాత్రంగానైనా అమలు చేయలేదు.. దీనిపై ప్రజలు నిలదీస్తున్నారు.. తాము ఏమని సమాధానం చెప్పాలని వాపోయారు. అందుకు బదులుగా మంత్రి సోమిరెడ్డి కొన్నింటికి సమయస్ఫూర్తిగా సమాధానమిచ్చారు. మరికొన్నింటిపై దాట వేశారు. ఇంకొన్నింటికి కాలమే సమాధానం చెబుతుందన్నట్లుగా మౌనం పాటించారు. మొత్తం మీద టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం వాడివేడిగా కొనసాగినట్లుగా తెలిసింది.

మరిన్ని వార్తలు