తూతూ మంత్రంగా టీడీపీ సమీక్ష

29 Jul, 2016 10:26 IST|Sakshi
  •  నాయకులు, కార్యకర్తలపై విసుక్కున్న నేతలు
  •  ఓ దశలో అసహనంతో మాట్లాడిన శివాజీ
  •  శిక్షణకు హాజరు తక్కువపై అచ్చెన్న ఆగ్రహం
  • శ్రీకాకుళం: శ్రీకాకుళం పట్టణంలో ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, నరసన్నపేట, ఆమదాలవలస తెలుగుదేశం పార్టీ నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు గురువారం తూతూ మంత్రంగా జరిగాయి. బుధవారం నాటి సమీక్ష వాడీ వేడిగా ఉండడంతో మరుసటి రోజుకూడా అదే తరహాలో ఉంటుందని అందరూ భావించారు. అయితే, ఆయా నియోజకవర్గాలకు చెందిన నాయకులు ముందస్తుగా కార్యకర్తలకు హెచ్చరించడం, బ్రతిమాలుకోవడం వంటి చర్యలతో సమీక్ష నామమాత్రంగానే జరిగింది. పలువురు కార్యకర్తలు జన్మభూమి కమిటీ సభ్యులు తీరును దుయ్యబట్టారు. దీనిని సాధారణంగా తీసుకున్న మంత్రులు, పరిశీలకులు వారికి సర్ధిచెప్పారు. ప్రతి నియోజకవర్గ సమీక్షలోనూ నాయకులు, కార్యకర్తలపై మంత్రులు విసుక్కున్నారు. శిక్షణ తరగతులకు హాజరు తక్కువగా ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. పలాస ఎమ్మెల్యే శివాజీ, ప్రభుత్వ విప్‌ కూన రవికుమార్‌లు ప్రత్యర్థులపై ఆరోపణలు చేస్తారని భావించగా మౌనవ్రతం వహించారు. పలాస నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు వైఎస్సార్‌ సీపీ గ్రామాల్లో పనులు జరగడం లేదని నేతల దృష్టికి తీసుకువచ్చారు. రేషన్‌కు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ–పాస్‌ విధానం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు కార్యకర్తలు వాపోయారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఒక్క ఇళ్లు కూడా ఇవ్వలేదని, రేషన్‌కార్డులు కూడా తొలగించడంతో ప్రజలనుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోందని కొందరు కార్యకర్తలు సమావేశంలో నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. ఇటువంటి ఆరోపణలు మనపార్టీ వారు చేయడం సరికాదని మంత్రి అచ్చెన్న అన్నట్లు సమాచారం. ఈ వ్యవహారం తమ పరిధిలో లేదని, విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని మంత్రి పరిటాల సునీత వీరందరికీ సర్దిచెప్పారు. సమీక్ష సమావేశంలో పార్టీ పరిశీలకులు రెడ్డి సుబ్రహ్మణ్యం, జనార్దన్, ఎమ్మెల్యేలు బెందాళం అశోక్, బగ్గు రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. 
     
మరిన్ని వార్తలు