దగాకారు!

26 Jul, 2017 23:00 IST|Sakshi
దగా కారు!

చదును వెనుక దందా
- కియా కార్ల పరిశ్రమ ముసుగులో ‘పచ్చ’తంత్రం
- రూ.177.94 కోట్లతో ఎల్‌అండ్‌టీకి టెండర్‌
- భూముల విలువను మించి చదునుకు వ్యయం
- ఓ ఎమ్మెల్యే, చినబాబుకు లబ్ధి చేకూర్చే యత్నం
- పక్కా ప్రణాళికతో దోపిడీ


భూసేకరణ బాధితులు
గ్రామం    బాధిత రైతులు    
అమ్మవారిపల్లి    145    
దుద్దేబండ        55    
కురబవాండ్లపల్లి    205    
వెంకటగిరిపాలెం    15

కియా కార్ల పరిశ్రమకు కేటాయించిన భూముల చదును వెనుక దందా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తోంది. 599.35 ఎకరాలను రూ.62.93 కోట్లతో కొనుగోలు చేసిన ఏపీఐఐసీ.. ఆ భూములను చదును చేసేందుకు రూ.177.94 కోట్లతో టెండర్లను ఆహ్వానించింది. కొనుగోలుకు వెచ్చించిన మొత్తానికి మూడింతలు చదునుకు ఖర్చు చేయనుండటం వెనుక మతలబు ఉన్నట్లు ఇట్టే అర్థమవుతోంది. కేబినెట్‌లో చోటు ఆశించి భంగపడిన ఓ ఎమ్మెల్యేలకు ఆర్థికంగా లబ్ధి చేకూర్చడం.. చినబాబును ఓ ‘ఇంటి’వాడిని చేయడమే ఈ టెండర్‌ సారాంశంగా తెలుస్తోంది.

సాక్షి ప్రతినిధి, అనంతపురం: పెనుకొండ నియోజకవర్గంలోని ఎర్రమంచి, అమ్మవారిపల్లి, దుద్దేబండ, వెంకటగిరిపాళెంలో ‘కియా’ కార్ల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇందుకోసం ఏపీఐఐసీ 599.35 ఎకరాల భూమిని సేకరించింది. బాధిత రైతులకు ఎకరాకు రూ.10.50లక్షలు చెల్లించేలా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లెక్కన నాలుగు గ్రామాల పరిధిలో 599.35 ఎకరాలు కోల్పోయిన రైతులకు 62.93లక్షల పరిహారం దక్కనుంది. ప్రభుత్వం సేకరించిన పొలాన్ని ‘కియా’కు అప్పగిస్తే అందులో యాజమాన్యం నిర్మాణ పనులు చేసుకోవాలి. కానీ ప్రభుత్వం పొలాలను చదునుచేసి ‘కియా’కు అప్పగించేందుకు ముందుకొచ్చింది. పొలాన్ని చదును చేసేందుకు ఈ- ప్రొక్యూర్‌మెంట్‌ ద్వారా టెండర్లను ఆహ్వానించింది. ఈ పనికి ఖర్చయ్యే మొత్తాన్ని రూ.177.94కోట్లుగా నిర్ధారించింది. భూముల కొనుగోలుకు రూ.62.93కోట్లు పరిహారం చెల్లించిన ప్రభుత్వం.. చదును పేరుతో ఇంత భారీ మొత్తంలో టెండర్లు పిలవడాన్ని రైతు సంఘాలతో పాటు విపక్షాలు తప్పుబడుతున్నాయి.

పక్కా ప్రణాళిక ప్రకారమే టెండర్లు
చదును పనులను అస్మదీయులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం టెండర్లలో తిరకాసు పెట్టింది. టెండర్లు దాఖలు చేసే ఏజెన్సీలు గత ఐదేళ్లలో కనీసం ఓ ఏడాది రూ.780కోట్ల టర్నోవర్‌తో పనులు చేసి ఉండాలని పేర్కొంది. ఆ మేరకు ఎల్‌అండ్‌టీ, ఎన్‌సీసీలు అర్హత సాధించాయి. ఈ రెండింటి టెండర్లలో ఫైనాన్సియల్‌ బిడ్‌ను పరిశీలించిన అధికారులు ఎల్‌అండ్‌టీ టెండర్‌ను ఖరారు చేశారు. నిజానికి ఈ పనులకు రూ.25కోట్లకు మించి ఖర్చు కాదని పలువురు కాంట్రాక్టర్లు చెబుతున్నారు. ఎలాంటి నిర్మాణాలు లేకుండా కేవలం పొలాలు చదును చేసేందుకు పెద్దగా ఖర్చు కాదు. ఈ పనుల్లో రూ.150కోట్లకు పైగా అవినీతి జరుగుతోందనే అనుమానం వ్యక్తమవుతోంది.

ఎవరి వాటా ఎంతంటే!
అనంతపురం జిల్లాలో మంత్రి పదవి ఆశించి భంగపడిన ఓ ఎమ్మెల్యేను సంతృప్తి పరిచేందుకు టెండర్‌ మొత్తంలో రూ.30కోట్లు నిర్మాణ సంస్థ చెల్లించేలా ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో పాటు మరో రూ.30–40కోట్లతో అమరావతిలో ఓ భవంతిని చినబాబుకు నిర్మించి ఇచ్చేలా కూడా ఒప్పందం జరిగినట్లు చర్చ జరుగుతోంది. రెండిటికీ రూ.60–రూ.70కోట్లు ఖర్చవుతుంది. ఇది కాకుండా పనులకయ్యే రూ.25కోట్ల ఖర్చు పోనూ మరో రూ.80–రూ.90 కోట్లు నిర్మాణ సంస్థకు మిగలనుంది. ప్రస్తుతం ఎల్‌అండ్‌టీ సంస్థ పనులు చేస్తోంది. నాలుగు చోట్ల చిన్న చిన్న గుట్టలు తప్ప మొత్తం పొలం చదునుగానే ఉంది. ఈ పనులు జరుగుతున్న ప్రదేశాన్ని చూస్తున్న భూములు కోల్పోయిన రైతులు చదును పేరుతో జరిగే దోపిడీని తెలుసుకుని అవాక్కవుతున్నారు. తమకు తక్కువ మొత్తాన్ని పరిహారంగా చెల్లించి.. చదును పేరుతో ప్రభుత్వం టీడీపీ నేతలకు దోచిపెడుతుండటం పట్ల మండిపడుతున్నారు.

మరిన్ని వార్తలు