ఏమైంది... స్వరం మారింది!

26 Oct, 2016 23:25 IST|Sakshi
బడేదేవరకొండపై అధికారులు సర్వే చేస్తున్న దృశ్యం. పాల్గొన్న ద్వారపురెడ్డి జగదీష్‌ సోదరుడు తిరుపతిరావు(రౌండప్‌ చేసిన వ్యక్తి)
బడే దేవరకొండపై టీడీపీ నాయకుల యూటర్న్‌
మారిన వ్యూహంపై సర్వత్రా చర్చ
కొత్తగా తెరపైకి తెచ్చిన అటవీ భూముల అంశం
 తెరవెనుక సూత్రధారులెవరో తెలుసునంటున్న గిరిజనులు 
 
సాక్షి ప్రతినిధి, విజయనగరం : మైనింగ్‌ కోసం లైన్‌ క్లియర్‌ చేశారు. రూ. కోట్లకొద్దీ నిధులు చేతులు మారాయి. గిరిజనుల ఆరాధ్యదైవమైన బడేదేవరకొండ దేవత వెలిసిన భూముల్ని లీజుకిచ్చేశారు. అమ్మవారిని పూజిస్తే తప్ప వర్షాలు పడవనే నమ్మకాన్ని తాకట్టు పెట్టారు. మనోభావాలకు దెబ్బ తగిలితే ఎవరైనా క్షమిస్తారా? అందులో గిరిజనులైతే ఊరుకుంటారా? అనుకున్నట్టుగానే అంతెత్తున లేచారు. వారికి అండగా నిలిచిన వైఎస్సార్‌సీపీ, వామపక్షాల నేతలతో కలిసి రోడ్డెక్కారు. అధికార పార్టీని ఉతికి ఆరేస్తున్నారు. టీడీపీ తీరును కడిగి పారేస్తున్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలనూ వదలడం లేదు. ప్రజల్లో వెల్లువెత్తుతున్న వ్యతిరేకత దృష్ట్యా గ్రామాల్లో ఉన్న టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరిపోతున్నారు. రోజురోజుకూ పార్టీ ఖాళీ అవుతుండటం, ప్రజాగ్రావేశాలు ఎక్కువవడంతో టీడీపీ నేతలు యూటర్న్‌ తీసుకోక తప్పలేదు. అటవీ భూములు అంశాన్ని తెరపైకి తెచ్చి వివాదం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. జరుగుతున్న డ్యామేజ్‌ను తగ్గించుకునేందుకు యత్నిస్తున్నారు. బడేదేవర కొండ గ్రానైట్‌ కోసం 2009లో ఎంఎస్‌పీ గ్రానైట్‌ సంస్థ దరఖాస్తు చేసుకుంది. కానీ, నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుమతులిచ్చేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో ఎంఎస్‌పీ సంస్థ అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. టీడీపీ అధికారంలోకి వచ్చాక మళ్లీ తెరపైకి వచ్చింది. 2014జూన్‌ 26వ తేదీన సర్వే జరిపి సుమారు 44 ఎకరాలు లీజుకిచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ ఏడాది జూన్‌ 22వ తేదీన ఏకంగా అనుమతులిచ్చింది. టీడీపీ నేతలు మాత్రం గత ప్రభుత్వంలోనే సర్వే జరిగిందని, అప్పట్లోనే అంతా జరిగిపోయిందని, టీడీపీ వచ్చాక అనుమతులే ఇచ్చిందని బుకాయిస్తున్నారు.
 
 
గిరిజనుల నమ్మకంపై దెబ్బకొడతారా ?
బడేదేవర కొండ దేవతను పూజిస్తే వర్షాలు పడతాయని నమ్ముతారు. ఆ కొండ వాగుల నుంచి వేలాది ఎకరాలకు సాగునీరు పొందుతున్నారు. ఇంతటి విశిష్టత గల కొండను మైనింగ్‌ కోసం ఓ కంపెనీకి లీజుకిచ్చేశారు. అది గిరిజనుల్లో ఆగ్రహానికి కారణమైంది. వైఎస్సార్‌సీపీ, వామపక్షాలతో కలిసి తమ భూములను కాపాడాలంటూ ఉద్యమిస్తున్నారు. టీడీపీ నేతలపై ధ్వజమెత్తడమే కాకుండా స్థానిక టీడీపీ నాయకులను నిలదీస్తున్నారు. మా వెంట నిలబడతారా? రాజకీయ భవిష్యత్‌ను కోల్పోతారా? అంటూ అల్టిమేటం ఇవ్వడంతో స్థానిక టీడీపీ నాయకులు ఉద్యమ బాటలోకి రాక తప్పలేదు. అలాగే, ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్న టీడీపీలో ఉండలేక సంగంవలస ఎంపీటీసీ కోడి వెంకటనాయుడు, ములగ మాజీ వైస్‌ సర్పంచ్‌ బంకపల్లి రామినాయుడు, మరికొందరు వైఎస్సార్‌సీపీలో చేరిపోయారు. మిగతా గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకుంది.
 
 
నష్టాన్ని తగ్గించేందుకు...
రోజురోజుకు పరిస్థితులు చేయిదాటిపోతున్నాయి. ప్రజా వ్యతిరేకత ఎక్కువైపోతోంది. గిరిజన గ్రామాల్లో వైఎస్సార్‌సీపీకి ఆదరణ పెరిగిపోతోంది.అధికార పార్టీ నాయకులకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇంకా వేచి ఉంటే ఇబ్బందేనన్న విషయాన్ని ఆలస్యంగా గ్రహించారు. దీని నుంచి బయటపడేందుకు అటవీ భూముల వివాదాన్ని తెరపైకి తెచ్చారు. రిజర్వు ఫారెస్టు భూముల్లో అనుమతులు ఎలా ఇచ్చారని అటవీ శాఖాధికారులపై నెపాన్ని తోసేస్తున్నారు. అసలీ సర్వే చేసినప్పుడు అటవీ భూములున్నాయని తెలియదా? ఆ సర్వేకు టీడీపీ నేతలు పరోక్షంగా సహకరించలేదా? అంతెందుకు గ్రానైట్‌కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వకపోవడం వెనక కారణమేంటి? గ్రానైట్‌ కంపెనీకి అనుకూలంగా ఆందోళన చేసిన వారెవరు? ప్రజలంతా సంతకాలు చేసి మరీ వ్యతిరేకిస్తున్నా మైనింగ్‌కు అండగా నిలిచిందెవరు? అన్నది అందరికీ తెలిసిందే. మైనింగ్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని ప్రజలంతా కోరుతున్నా ససేమిరా అంటున్న కోరి గంగాపురం, కె.ములగ సర్పంచ్‌లు అధికార పార్టీకి చెందిన వారే కదా? దీన్నేమనాలి. ఇదంతా వదిలేసి అటవీ భూముల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి ఇందులో నుంచి బయటపడాలని ప్రయత్నించడంపై అంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
 
 
మరో ధరఖాస్తుదారుడు ప్రకాష్‌ వెనకున్నదెవరు 
2006లో బడేదేవరకొండ గ్రానైట్‌ తవ్వుకోవడానికి శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసకు చెందిన ప్రకాష్‌ అనే వ్యక్తి దరఖాస్తు చేశారు. అప్పట్లో లీజుకిచ్చేందుకు ససేమిరా అనడంతో వెనక్కి వెళ్లిపోయారు. ఎప్పుడైతే ఎంస్‌ఏపీ గ్రానైట్‌ సంస్థకు అనుమతులిచ్చారో గత దరఖాస్తు దారుడైన ప్రకాష్‌ను తెరపైకి తెచ్చారు. ఆ కంపెనీకి అనుమతిచ్చినప్పుడు తమకీ ఇవ్వాలంటూ ప్రకాష్‌ చేత దరఖాస్తు చేయించారు. దీని వెనుక ఉన్న దెవరో కాదు టీడీపీ కీలక నేతే. ఆ మధ్య జరిగిన సర్వేలో సాక్షాత్తు ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌ సోదరుడు తిరుపతిరావు పాల్గొనడాన్ని అందరూ గుర్తు చేసుకుంటున్నారు.
మరిన్ని వార్తలు