తెలుగు మహిళ అ'బలైంది'

11 Jan, 2016 17:51 IST|Sakshi
తెలుగు మహిళ అ'బలైంది'

ఇన్‌చార్జి బాధ్యతల నుంచి పక్కకి
ఎన్నికలు ముగిశాక మారిన బాబు వైఖరి
మహిళా నేతలకు మొండిచెయ్యి


సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఎన్నికల ముందు జిల్లాలో రెండు సీట్లను మహిళలకు కేటాయించామని గొప్పలు చెప్పిన చంద్రబాబునాయుడు ఎన్నికలు ముగిసిన తరువాత ఆ ఇద్దరు మహిళలకూ మొండిచెయ్యి చూపించారు. ఇద్దరు మహిళా నేతలను పదవుల నుంచి తప్పించి వేరేవారికి అప్పగించడం ద్వారా తన నైజాన్ని బయటపెట్టుకున్నారు. యర్రగొండపాలెం నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన అజితారావు, చీరాల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పోతుల సునీతలను ఇన్‌చార్జ్ పదవి నుంచి తప్పించారు. మహిళా నాయకులను పక్కన పెట్టడం, ఇటీవలే ఇసుక రవాణా నుంచి కూడా డ్వాక్రా మహిళలను తప్పించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. మహిళలకు పెద్ద పీట వేస్తున్నానని వేదికలపై చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బయట మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని మహిళా నేతలు మండిపడుతున్నారు.

 

 2014 ఎన్నికల ముందు యర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలను బూదాల అజితారావుకు అప్పగించారు. ఎన్నికల్లో సీటు కూడా ఆమెకే ఇచ్చారు. ఎన్నికల్లో అక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి పాలపర్తి డేవిడ్‌రాజు విజయం సాధించారు. ఆ తర్వాత క్రమంగా అజితారావును పక్కన పెడుతూ వచ్చారు. చివరికి అమెకు చెప్పకుండానే ఇన్‌చార్జి పదవి నుంచి తొలగించి అక్కడ త్రిమెన్ కమిటీ వేశారు. ఆఖరికి పార్టీ నుంచి కూడా పంపించేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. గత వారంలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అజితారావు వర్గంలో ఉన్న తెలుగుదేశం నాయకులను కూడా అరెస్టు చేశారు. వారు ముఖ్యమంత్రి సభలో నిలదీసే అవకాశం ఉందన్న భయంతో సొంతపార్టీ వారిని కూడా అరెస్టు చేశారు. పార్టీ కోసం పని చేస్తున్నా తమని నమ్మని పరిస్థితుల్లో   పార్టీలో ఎందుకు ఉండాలని అజితారావు వర్గం నేతలు ప్రశ్నిస్తున్నారు.

 

 చీరాల విషయం కూడా దీనికి భిన్నంగా లేదు. ఎన్నికలకు ఏడాది ముందుగానే అనంతపురం పరిటాల రవి వర్గానికి చెందిన పోతుల సురేష్ భార్య పోతుల సునీతను చీరాల నియోజకవర్గ ఇన్‌చార్జిగా చంద్రబాబు నాయుడు నియమించారు. అప్పటి నుంచి చీరాలకు మకాం మార్చిన సునీత 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఆమంచి కృష్ణమోహన్ చేతిలో పరాజయం పాలయ్యారు. అప్పటి నుంచి రెండు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో రగడ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జన్మభూమి కమిటీ సభ్యురాలిగా జన్మభూమి సభలకు సునీత హాజరవడం, దీన్ని ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వ్యతిరేకించడంతో రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి వచ్చింది. ఈ సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నవోదయం పార్టీ తరఫున గెలిచిన ఆమంచి కృష్ణమోహన్‌ను పార్టీలోకి తీసుకున్నారు. ఆమంచి చేరికను సునీత వర్గం గట్టిగా వ్యతిరేకించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. మూడోవిడత జన్మభూమికి ముందు పాత జన్మభూమి కమిటీలను రద్దు చేసి ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తన వర్గం వారితో కమిటీలు ఏర్పాటు చేశారు. దీన్ని నిరసిస్తూ సునీత వర్గం ఒంగోలులో పార్టీ కార్యాలయం ఎదుట ఆమరణ దీక్షకు దిగడంతో జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్ధన్ పాత కమిటీనే ఉంటుందని నచ్చజెప్పారు. రెండు రోజుల్లోనే సీను మారింది. కొత్త కమిటీలను ఆమోదించకపోతే జన్మభూమి సభలను బహిష్కరిస్తామని ఆమంచి కృష్ణమోహన్ వర్గం అల్టిమేటం ఇవ్వడంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇన్‌ఛార్జి మంత్రి రావెల సమక్షంలో నేతలు చర్చలు జరిపి నియోజకవర్గ ఇన్‌చార్జి పదవిని కూడా ఆమంచి కృష్ణమోహన్‌కు కట్టబెట్టారు. దీంతో కంగుతిన్న పోతుల సునీత వర్గం భవిష్యత్ కార్యాచరణపై తమ వర్గంతో చర్చలు జరుపుతున్నారు.

మరిన్ని వార్తలు