విపక్షం ‘కేబుల్స్’ కట్!

11 Jul, 2016 01:08 IST|Sakshi
విపక్షం ‘కేబుల్స్’ కట్!

- అధికారపక్షం దాష్టీకం నరసరావుపేటలో టీడీపీ రాళ్లదాడి
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సహా పలువురికి గాయాలు
కర్నూలులో సీపీఎం చానల్‌పైనా దాడి
పోలీసు, రెవెన్యూ అధికారులే పాత్రధారులు
 
 నరసరావుపేట/కర్నూలు :
అధికారపార్టీ పూర్తిగా బరితెగిస్తోంది. గిట్టని పత్రికలు, చానళ్లపై రకరకాల మార్గాలలో ప్రతాపం చూపిస్తున్న తెలుగుదేశం పార్టీ.. తన తప్పులను ఎత్తిచూపుతున్న కేబుల్ చానళ్ల నిర్వాహకులపైనా దాడులకు తెగబడుతోంది. గుంటూరు జిల్లా నరసరావుపేటలో అధికార పార్టీ ఎమ్మెల్యే కుమారుడి ఆధ్వర్యంలో ఎన్‌సీవీ కేబుల్ కార్యాలయంపై జరిగిన రాళ్లదాడిలో పలువురికి గాయాలయ్యాయి. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డితో పాటు పలువురు నాయకులు గాయపడ్డారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. పోలీసుల సమక్షంలోనే కేబుల్ వైర్ల కత్తిరింపు జరగడం గమనార్హం కాగా.. దాడికి గురైన వైఎస్సార్సీపీ నేతలనే అదుపులోకి తీసుకోవడం అధికార పార్టీ బరితెగింపునకు ప్రత్యక్ష నిదర్శనం. మరోవైపు కర్నూలులోనూ తెలుగుటీడీపీ నేతులు ఇదే తరహా దాష్టీకానికి పాల్పడ్డారు. సీపీఎంకు చెందిన సీమ కమ్యూనికేషన్ చానల్‌ను  రెవెన్యూ, పోలీసు అధికారులను ప్రయోగించి నిలిపివేయించింది. చానల్ కార్యాలయాన్ని సీజ్ చేయడానికి వచ్చిన పోలీసులను, రెవెన్యూ అధికారులను ఆందోళనకారులు దిగ్బంధించడంతో ఉద్రిక్తవాతావరణం చోటుచేసుకుంది.

 నరసరావుపేటలో టీడీపీ వర్గీయుల వీరంగం
 నరసరావుపేటకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువనేత నల్లపాటి రామచంద్రప్రసాద్ నిర్వహిస్తున్న ఎన్‌సీవీ(నల్లపాటి కేబుల్ విజన్) కార్యాలయంపై టీడీపీ వర్గీయులు ఆదివారం దాడిచేశారు. పోలీసుల సమక్షంలోనే వైర్లు కత్తిరించి ప్రసారాలను నిలిపివేశారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైఎస్సార్‌సీపీ శ్రేణులతో కలిసి రామిరెడ్డిపేటలోని కేబుల్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. దీంతో వారిపై కూడా టీడీపీ వర్గీయులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో నరసరావుపేట జెడ్పీటీసీ షేక్ నూరుల్‌అక్తాబ్ తలకు, పట్టణ అధ్యక్షుడు ఎస్.ఎ.హనీఫ్ భుజానికి తీవ్ర గాయాలయ్యాయి. ఎమ్మెల్యేకు చెందిన క్వాలిస్ కారు ధ్వంసమవ్వగా.. పోలీసు జీపు అద్దం పగిలిపోయింది. అయితే పోలీసులు దాడికి పాల్పడిన వారిని వదిలేసి వైఎస్సార్‌సీపీ వర్గీయులైన ఎన్‌సీవీ అధినేత నల్లపాటి రాము, పమిడిపాడు నాయకుడు లాం కోటేశ్వరరావులను అదుపులోకి తీసుకొని పోలీసుస్టేషన్‌కు తరలించడం గమనార్హం.

 ఆర్డీవో కార్యాలయం వద్ద ఎమ్మెల్యే ధర్నా
 ఈ సంఘటనపై  గాయపడిన నాయకులతో ఫిర్యాదు చేయించి ఆర్డీవో కార్యాలయం వద్ద ఎమ్మెల్యేడాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధర్నాకు దిగారు. దాడి ఘటనను పూర్తిగా ఖండిం చారు. ఇంత కిరాతకమైన ప్రభుత్వాన్ని తామెప్పుడూ చూడలేదన్నారు.

 కర్నూలులో తీవ్రస్థాయికి కేబుల్ వార్!
 కర్నూలు నగరంలో కేబుల్ వార్ తీవ్రస్థాయికి చేరింది. అధికార పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ సిటీ కేబుల్ ప్రసారాలు కొనసాగుతున్నాయి. ఏడాది కిందట సీపీఎం ఆధ్వర్యంలో సీమ కమ్యూనికేషన్ చానల్‌ను ఏర్పాటు చేశారు. దీనిపై ఆగ్రహించిన అధికార పార్టీ నేతలు.. జిల్లాలో అనుమతులు లేకుండా ప్రసారాలు చేస్తున్నారంటూ పోలీసులను అడ్డం పెట్టుకొని ఆరు నెలల కిందట కార్యాలయాన్ని సీజ్ చేశారు. దీంతో సీమ కమ్యూనికేషన్ నిర్వాహకులు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకొని జీ నెట్‌వర్క్ అనుమతులతో ప్రసారాలను పునరుద్ధరించారు. ఇదే సమయంలో జెమినీ చానల్ ప్రసారాలకు సంబంధించిన అనుమతులు సైతం సీమ కమ్యూనికేషన్‌కే దక్కడంతో రెండు వర్గాల మధ్య కేబుల్ వార్ తీవ్రతరమైంది. ఈ నేపథ్యంలోనే గతనెలలో మున్సిపల్ అధికారులు సీమ కమ్యూనికేషన్‌కు సంబంధించిన వైర్లను తొలగించడంతో ఆపరేటర్లు ఆందోళన చేశారు. తాజాగా ఆదివారం సాయంత్రం గాయత్రి ఎస్టేట్‌లో ఉన్న సీమ కమ్యూనికేషన్స్ చానల్‌పై పోలీసు, రెవెన్యూ అధికారులు దాడులు జరిపారు.

 అధికారుల నిర్బంధం : పీస్ చానల్ ద్వారా నిషేధిత ప్రసారాలను నిర్వహిస్తున్నారన్న ఫిర్యాదుపై కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆదేశాల మేరకు కర్నూలు ఆర్డీవో రఘుబాబు, డీఎస్పీలు రమణమూర్తి, వినోద్‌కుమార్,ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీ పోలీసులు చానల్ కార్యాలయాన్ని సీజ్ చేసేందుకు వెళ్లారు. వారిని సీపీఎం నాయకులు అడ్డుకొని ఆందోళనకు దిగారు. మూడో అంతస్తులో చానల్ కార్యాలయం ఉండటంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు కిందికి దిగకుండా నిర్బంధించారు.

మరిన్ని వార్తలు