మంత్రులు.. నపుంసకులు!

7 Nov, 2015 04:47 IST|Sakshi
మంత్రులు.. నపుంసకులు!

టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్య

 పటాన్‌చెరు: టీఆర్‌ఎస్ మంత్రులు నపుంసకులని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం మెదక్ జిల్లా పటాన్‌చెరులో జరిగిన టీడీపీ సభలో ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో మహిళలకు మంత్రి పదవులిచ్చామని గుర్తు చేస్తూ.. ఇప్పుడు 18 మంది ఎమ్మెల్యేలున్నా కేసీఆర్ క్యాబినెట్‌లో ఒక్క మహిళకూ మంత్రి పదవి ఇవ్వలేదని విమర్శించారు. ‘ఎంపీ కవిత వెళ్లి తండ్రితో ఆడవాళ్లకు మంత్రి పదవి ఎందుకివ్వలేదని అడిగితే .. ఇప్పుడున్న మంత్రులు మగాళ్లలా కనిపిస్తున్నారా అని కేసీఆర్ ఆమెతో అన్నారట.. వారంతా అటు ఇటుగాని మంత్రులు ’ అంటూ రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు.

అంతెందుకు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చెబితే జీహెచ్‌ఎంసీ చెప్రాసీ కూడా మాటవినే పరిస్థితిలేదని విమర్శించారు. చెప్రాసీతో పని చేయించుకునేందుకు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి మంత్రికి చెప్పాల్సిన పరిస్థితి ఉందని, ఎందుకీ బానిస బతుకులు అని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్, ఆయన బంధువులు ఏలేందుకా తెలంగాణా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణాలోని అన్ని జిల్లాలను ఓ దొరకు అప్పగించారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. కాగా  రాష్ట్రంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలను నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రేవంత్‌రెడ్డి విమర్శించారు. కరువు సహాయక చర్యలు చేపట్టడంలోనూ ప్రభుత్వం చొరవ తీసుకోవడం లేదని మండిపడ్డారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణ సాధనకు జరిగిన ఉద్యమంలో విద్యార్థుల త్యాగాల విలువ వెలకట్టలే నిదని అన్నారు.
 
 సస్పెన్షన్‌పై కాంగ్రెస్‌లో తర్జనభర్జన
  వరంగల్ ఉప ఎన్నిక నేపథ్యంలో రాజయ్యపై సస్పెన్షన్ వేటు వేయాలా వద్దా అన్న అంశంపై కాంగ్రెస్‌లో తర్జనభర్జనలు సాగుతున్నాయి. రాజయ్య నివాసంలో జరిగిన దుర్ఘటనపై రాజకీయంగా ఎలా స్పందించాలనే దానిపై పార్టీ నాయకులు నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఆయన ఏఐసీసీ సభ్యుడు కానందున చర్య తీసుకునే అధికారం టీపీసీసీ పరిధిలోనే ఉంది. ఆయనను సస్పెండ్ చేయాలని జిల్లా పార్టీ సిఫార్సు చేస్తే తదనుగుణంగా నిర్ణయం తీసుకోవచ్చునని పార్టీ నేత ఒకరు సాక్షికి చెప్పారు. అయితే ప్రస్తుతానికి ఈ వ్యవహారంలో మౌనంగా ఉంటేనే మంచిదని, సస్పెన్షన్ వేటు వేస్తే ఆయా సామాజిక వర్గాల నుంచి వ్యతిరేకత రావొచ్చుననే అభిప్రాయంతో కొందరు నాయకులున్నారు.

మరిన్ని వార్తలు