బినామీలతో బోధిస్తే క్రిమినల్‌ కేసులు

16 Dec, 2016 23:47 IST|Sakshi
బినామీలతో బోధిస్తే క్రిమినల్‌ కేసులు
  •  పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణతకు కృషి చేయండి
  • త్వరలో టీచర్లకూ బయోమెట్రిక్‌ అటెండెన్స్‌
  • ఎంఈఓలు, హెచ్‌ఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌
  • అనంతపురం ఎడ్యుకేషన్‌ :

    ప్రభుత్వం కళ్లు కప్పి బినామీలతో పాఠ్యాంశాలను బోధింపజేస్తున్న ఉపాధ్యాయులను డిస్మిస్‌ చేయడంతో పాటు క్రిమినల్‌ కేసులూ బనాయించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌ హెచ్చరించారు. శుక్రవారం  సాయంత్రం తన క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా వ్యాప్తంగా ఉన్న 450 ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు కొందరు విధులకు వెళ్లకుండా బినామీలను ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోందన్నారు. అందరికీ ఆదర్శఃగా ఉండాల్సిన గురువులే ఇలాంటి పనులు చేయడం తగదని హితవు పలికారు. ఎంఈఓలు, క్లస్టర్‌ హెచ్‌ఎంలు ఎప్పటికప్పుడు పాఠశాలలను తనిఖీలు చేసి బినామీ టీచర్లను గుర్తించి ఓ నివేదికను డీఈఓకు పంపాలని ఆదేశించారు. ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు చేపడతామని ఆ సమయంలో బినామీలు ఉన్నట్లుగా తేలితే కఠిన చర్యలు ఉంటాయన్నారు. పాఠశాల వేళలు కచ్చితంగా పాటించాలని, ఈ విషయమై త్వరలో అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులకూ బయో మెట్రిక్‌ ద్వారా హాజరు గుర్తించే ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.  ప్రతి విద్యార్థీ పదో తరగతి పాస్‌  కావడం ఎంతో కీలకమన్నారు. చిత్తశుద్ధితో పనిచేసి వందశాతం ఉత్తీర్ణత సాధించేలా చూడాలన్నారు. సీ, డీ గ్రేడ్‌లో ఉన్న విద్యార్థులను బెస్ట్‌ టీచర్స్, ఏ, బీ గ్రేడ్‌ విద్యార్థులను ఇతర ఉపాధ్యాయులు దత్తత తీసుకోవాలని సూచించారు. కాన్ఫరెన్స్‌లో డీఈఓ శామ్యూల్, ఎస్‌ఎస్‌ఏ పీఓ దశరథరామయ్య, డీఆర్‌డీఏ పీడీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

     

మరిన్ని వార్తలు