చేపల వేటకు వెళ్లి మృత్యువాత పడిన ఉపాధ్యాయుడు

1 Aug, 2016 23:54 IST|Sakshi
కొత్తగూడ : సరదాగా గాలాలతో చేపల వేటకు వెళ్లిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రమాదవశాత్తు వాగులో పడి మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై యాసిర్‌ అరాఫత్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అందుగులగూడెం గ్రామానికి చెందిన మద్దెల శ్రీను(35) మండలంలోని కర్నెగండి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. మండల కేంద్రంలో కిరాయి ఇంట్లో ఉంటూ పాఠశాలకు వెళ్లి వస్తుంటాడు. తన స్నేహితులు మహేష్, సారయ్యతో కలసి సరదాగా పాఖాల సరస్సుకు వెళ్లే బూర్కపల్లి వాగులో గాలాలతో చేపలు వేటాడేందుకు ఆదివారం వెళ్లారు. ముగ్గురు వేర్వేరు చోట్ల గాలాలు వేసుకుని కూర్చున్నారు. సాయంత్రం మహేష్, సారయ్యలు శ్రీను కూర్చున్న స్థలానికి రాగా ఆయన లేకపోవడంతో ఇంటికి వెళ్లి ఉంటాడని భావించి వెళ్లిపోయారు. అయితే, శ్రీను ఇంటికి  రాలేదని బార్య సరిత వాకబు చేసే సరికే చీకటి పడింది. ఈ మేరకు చేపల వేటకు వెళ్లిన వాగులో సోమవారం ఉదయం గ్రామస్తులంతా కలిసి వెతకగా శ్రీను మృతదేహం లభించింది. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు శరణ్య, స్నేహిత ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహన్ని పోస్టుమార్టంకు తరలించినట్లు ఎస్సై వివరించారు. కాగా, శ్రీను మృతదేహం వద్ద ఆయన భార్య, పిల్లల రోదిస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. 
మరిన్ని వార్తలు