ఇంట్లో పనిచేయలేదని విద్యార్థిని చితకబాదిన టీచర్

10 Jul, 2015 21:02 IST|Sakshi

గుంటూరు (పెదనందిపాడు): తన ఇంట్లో పనులు చేయటం లేదని ఓ వ్యాయామోపాధ్యాయుడు విద్యార్థినిని చితకబాదిన సంఘటన గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం, అబ్బినేనిగుంటపాలెంలో చోటు చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  విద్యార్థిని చౌటురి శ్రావణి మాకినేని రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. తన ఇంట్లో పనులు చేయాలంటూ వ్యాయామోపాధ్యాయుడు గోపి విద్యార్థిని శ్రావణిని తరచూ వేధిస్తున్నాడు. అయితే శ్రావణి పనులు చేయటానికి వెళ్లకపోవటంతో ఆగ్రహం చెందిన వ్యాయామోపాధ్యాయుడు చెప్పిన మాట వినవా అంటూ.. బెత్తంతో ఇంటి చుట్టూ తిప్పించి మరీ కొట్టాడు. అనంతరం నొప్పులు తగ్గటానికి మందు బిళ్లలు ఇచ్చి ఇంటికి పంపించాడు.

 

అయితే శ్రావణికి జ్వరం వచ్చి శుక్రవారం పాఠశాలకు వెళ్లలేదు. విద్యార్థిని బాధ పడుతున్నట్టు గమనించిన తల్లిదండ్రులు ఆరా తీయగా, శ్రావణి కంట తడిపెట్టి జరిగిన విషయాన్ని వివరించింది. ఈ విషయం ఎవరికైనా చెబితే మళ్లీ కొడతానని బెదిరించాడని విద్యార్థిని విలపిస్తూ చెప్పింది. తన ఇంట్లో పనులు చేయకపోతే ఏదోక నెపంతో కొడుతున్నాడని విద్యార్థిని తెలిపింది. గతంలో ఇలా పలువురు విద్యార్థినులను కొట్టగా వారు బడి మానేశారని వివరించింది. హెచ్‌ఎంకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని విద్యార్థిని తండ్రి వాపోయారు. గతంలో 9 తరగతి విద్యార్థిని వుల్లంగుల విజయలక్ష్మిని డస్ట్ ఎత్తలేదని బెత్తతంలో మోకాలి పైభాగాన కొట్టాడని, దీంతో ఆ విద్యార్థిని నడవలేకయిందని తల్లిదండ్రులు తెలిపారు. శుక్రవారం ఉదయం విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లగా వారిని చూసిన వ్యాయామ ఉపాధ్యాయుడు గోపి గోడ దూకి పారిపోయాడని వారు చెప్పారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం రాయల సుబ్బారావును వివరణ కోరగా.. విద్యార్థుల చేత లిఖిత పూర్వక ఫిర్యాదు తీసుకున్నానని, వ్యాయామ ఉపాధ్యాయుడు అందుబాటులో లేడని, ఆతను రాగానే మోమో అందజేస్తానని, ఈ విషయాన్ని విధ్యాశాఖ ఉన్నాతాధికారులకు తెలియజేస్తానని చెప్పారు. ఇక నుంచి పాఠశాలలో ఇటువంటి సంఘటనలు జరగకుండా చూస్తానని హెచ్‌ఎం హమీ ఇవ్వడంతో వారు వెనుతిరిగి వెళ్లారు.

మరిన్ని వార్తలు