గురువుల పనితీరు బట్టే బదిలీలు

30 Mar, 2017 23:01 IST|Sakshi
గురువుల పనితీరు బట్టే బదిలీలు

- ఐదేళ్లు మించితే తప్పనిసరి
- అలసత్వానికి మైనస్‌ పాయింట్లు


నెల్లూరు (టౌన్‌): ఉపాధ్యాయ బదిలీలపై ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. వేసవిలో బదిలీల ప్రక్రియను పూర్తి చేసి కొత్త విద్యాసంవత్సరంలో అడుగుపెట్టాలని భావిస్తోంది. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ఒకే పాఠశాలలో ఐదేళ్లు పనిచేసిన ఉపాధ్యాయులు బదిలీ కావాల్సిందే. గతంలో ఈ నిబంధన ఎనిమిదేళ్లు ఉండేది. రెండేళ్ల సర్వీస్‌ను పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు బదిలీకి అర్హులు. ప్రస్తుతం ఉపాధ్యాయుల పనితీరును ప్రాతిపదికగా తీసుకొని బదిలీల ప్రక్రియను చేపట్టనున్నారు. విధుల్లో అలసత్వం, విద్యార్థుల ప్రగతిని ప్రాతిపదికగా తీసుకొని తగ్గింపు పాయింట్లను కేటాయించనున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా రేషనలైజేషన్‌ అంశాన్ని మార్గదర్శకాల్లో పొందుపర్చారు. ఆన్‌లైన్‌ ద్వారా వెబ్‌ ఆప్షన్‌ల నమోదు విధానంగా బదిలీలు చేయనున్నారు.

పనితీరుకు సూచికలు
► విద్యార్థుల నమోదు పెంపునకు రెండు మార్కులు, విద్యార్థుల హాజరు 95 శాతం కంటే ఎక్కువగా ఉంటే రెండు మార్కులు, 92 నుంచి 95 వరకు ఉంటే ఒక మార్కును ఇవ్వనున్నారు.
► ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థుల్లో నిలకడ నూరు శాతం ఉంటే రెండు మార్కులు, శ్లాస్, త్రీ ఆర్, ఎఫ్‌ఏ, ఎస్‌ఏ పరీక్షల్లో విద్యార్థుల ప్రగతి 80 శాతం కంటే ఎక్కువ ఉంటే మూడు మా ర్కులు, 70 నుంచి 80 శాతం ఉంటే రెండు మార్కులు, 50 నుంచి 70 శాతం ఉంటే ఒక మార్కును కేటాయించనున్నారు.
► పాఠశాలలో ఉత్తీర్ణత శాతం 95 శాతం నుంచి 100 ఉంటే మూడు మార్కులు, 90 నుంచి 95 ఉంటే రెండు మార్కులు, 85 నుంచి 90 ఉంటే ఒక మార్కును ఇవ్వాలని నిర్ణయించారు.
► విద్యార్థులు ప్రతిభ పురస్కారాలను పొందితే రెండు మార్కులు, విద్యార్థుల తల్లిదండ్రులు, కమిటీలతో 11 నెలల్లో పది సమావేశాలను నిర్వహిస్తే రెండు మార్కులు, ఆరు నుంచి 10 మధ్య నిర్వహిస్తే ఒక మార్కును ఇవ్వనున్నారు.
► పాఠశాలలో క్రీడా మైదానాన్ని వినియోగించి ఆటలు, క్రీడా సామగ్రి కొనుగోలు, తదితర అంశాలపై రెండు పాయింట్లు, ఆరోగ్య కార్డుల నిర్వహణకు రెండు పాయింట్లు, మధ్యాహ్న భోజన హాజరు 95 శాతం మించితే రెండు పాయింట్లు, బడికి రుణం తీర్చుకుందాం కార్యక్రమంలో భాగంగా పాఠశాల అభివృద్ధికి రూ.రెండు లక్షలకు మించి విరాళం ఉంటే రెండు పాయింట్లు, రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షల వరకు ఒక పాయింట్‌ను కేటాయించనున్నారు.

మైనస్‌ పాయింట్లు
పాఠశాలల్లో విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే ఈ ఏడాది బదిలీల్లో కొన్ని పాయింట్లను నష్టపోవాల్సి వస్తుంది. పాఠశాలలో విధి నిర్వహణలో అలసత్వం, పాఠాలను సరైన సమయంలో పూర్తి చేయకపోవడం, క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడటం, రెండేళ్లకు మేజర్‌ పెనాల్టీ విధించి ఉంటే మూడు పాయింట్లు, మైనర్‌ పెనాల్టీకి రెండు పాయింట్లు, బోధిస్తున్న సబ్జెక్టుల్లో పదో తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత 50 శాతం తక్కువగా ఉంటే ఐదు పాయింట్లు వేయనున్నారు. గతేడాది ఎస్‌ఏ – 3 పరీక్షలు, ఈ ఏడాది ఎఫ్‌ఏ, ఎస్‌ఏ, త్రీఆర్, శ్లాస్‌ పరీక్షల్లో డీ 1, డీ 2 గ్రేడ్‌ విద్యార్థులు 10 నుంచి 20 శాతం ఉంటే ఐదు పాయింట్లు, 26 నుంచి 50 శాతం ఉంటే మూడు పాయిం ట్లను నష్టపోవాల్సి ఉంటుంది.

వెబ్‌ కౌన్సెలింగ్‌ విధానాన్ని రద్దు చేయాలి
బదిలీలకు సంబంధించిన ఆన్‌లైన్‌ అమలు విధానంలో లోపాలు ఉన్నాయి. మార్కులు, సీనియార్టీ వరకు ఇబ్బంది లేదు. పాయింట్ల ఆధారంగా ప్రాధాన్యమిస్తే ఎక్కడ పోస్టింగ్‌ వస్తుందో తెలియదు. ప్రత్యక్ష కౌన్సెలింగ్‌ ద్వారా అయితే ఖాళీలు తెలుస్తాయి.
- సుబ్రహ్మణ్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏపీటీఎఫ్‌

 ప్రతిభ పాయింట్లను ఎత్తేయాలి
ప్రతిభ ఆధారంగా పాయింట్ల విధానాన్ని ఎత్తేయాలి. దీని వల్ల ఉపాధ్యాయులు అడ్డదారులు తొక్కే ప్రమాదం ఉంది. నిజాయతీగా ఉన్నవారికి అన్యాయం జరుగుతుంది. కొత్తగా తెరపైకి తీసుకొచ్చిన మైనస్‌ పాయింట్లను రద్దు చేయాలి. స్పౌజ్‌ పాయింట్లను విడివిడిగా కేటాయించాలి.
 - నవకోటేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్‌  

మరిన్ని వార్తలు