ఆ టీచర్ల డిప్యుటేషన్లు ఇక రద్దు

28 Sep, 2016 21:05 IST|Sakshi

హైదరాబాద్: ప్రజాప్రతినిధుల దగ్గర వ్యక్తిగత సహాయకులు(పీఏ), వ్యక్తిగత కార్యదర్శులు(పీఎస్)గా పనిచేస్తున్న టీచర్లందరి డిప్యుటేషన్లను ప్రభుత్వం రద్దు చేసింది. వారిని తక్షణమే రిలీవై మాతృశాఖలో విద్యా బోధన కార్యక్రమాలు నిర్వర్తించాలని ఆదేశించింది. సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లింగరాజ్ పాణిగ్రాహి ఈమేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ‘ఎమ్మెల్యేలు, మంత్రుల దగ్గర పీఏలు, పీఎస్‌లుగా టీచర్లను డిప్యుటేషన్‌పై పంపడం ఏమాత్రం సమంజసం కాదు. ఒకవేళ ఎవరైనా ప్రజాప్రతినిధుల దగ్గర టీచర్లు విధులు నిర్వర్తిస్తున్న పక్షంలో వారిని తక్షణమే వెనక్కు పంపి విద్యాబోధన విధులకు వినియోగించాలి’ అని ఈనెల 13వ తేదీన సుప్రీంకోర్టు ఆదేశించింది.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం టీచర్ల డిప్యుటేషన్లను రద్దు చేసింది. ‘ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు, జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్లు తదితర ప్రజాప్రతినిధుల దగ్గర పీఏలు, పీఎస్‌లుగా పనిచేస్తున్న టీచర్ల డిప్యుటేషన్లను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రద్దు చేశాం. తక్షణమే వారంతా అక్కడి నుంచి రిలీవై మాతశాఖలో చేరి విద్యా బోధన విధులు నిర్వర్తించాలి. ఈ దిశగా కలెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేయాలి’ అని లింగరాజ్ పాణిగ్రాహి జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొన్నారు. టీచర్లను రిలీవ్ చేసిన ప్రజాప్రతినిధులు నిబంధనల ప్రకారం సీనియర్ అసిస్టెంట్ కేడర్‌లోని ఉద్యోగులను పీఏలుగా ఎంపిక చేసుకోవాలని అందులో సూచించారు.

మరిన్ని వార్తలు