స్కాట్లాండ్‌లో టీచర్లకు ఐదేళ్లకోసారి పరీక్ష

16 Dec, 2016 00:17 IST|Sakshi

అందులో ఉత్తీర్ణులయితేనే ఉద్యోగ భద్రత
స్కాట్లాండ్‌ ప్రతినిధుల బృందం వెల్లడి


సాక్షి, హైదరాబాద్‌: స్కాట్లాండ్‌లోని టీచర్లు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ కావాల్సిందేనని, టీచర్లకు ప్రతి ఐదేళ్లకు ఒకసారి పరీక్ష ఉంటుందని స్కాట్లాండ్‌ ప్రతినిధి బృందం వెల్లడించింది. పరీక్షలో ఉత్తీర్ణులైన టీచర్లకే ఉద్యోగ భద్రత ఉంటుందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వంతో ఎడ్యుకేషనల్‌ పార్ట్‌నర్‌షిప్‌ ఆఫర్‌ కింద స్కాట్లాండ్‌కు చెందిన ఏడు గురు సీనియర్‌ విద్యావేత్తల బృందం 3 రోజులుగా రాష్ట్రంలో పర్యటి స్తూ.. విద్యాసంస్థల పనితీరును పరిశీలించింది. గురువారం పాఠశాల విద్యా డైరెక్టర్‌ కార్యాలయాన్ని సందర్శించి.. వివిధ విభాగాల అధికా రులతో భేటీ అయి పలు అంశాలపై చర్చించింది.

తమ ప్రభుత్వం ప్రాథమిక విద్యకు ప్రాధాన్యమిస్తుందని, పాఠశాల, పరిశీలకులు, ప్రభుత్వం అనే ముక్కోణపు పద్ధతిపై పాఠశాలలు పని చేస్తాయని బృందం వెల్లడించింది. సీనియర్‌ టీచర్లనే పాఠశాలల పరిశీలకులుగా నియమిస్తామని, విద్యార్థి చదువు, తీరు తెన్నుల ఆధారంగా గ్రేడింగ్‌ నిర్ణయిస్తామన్నారు. పనితీరు బాగాలేని పరిశీలకులపై ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. గుణాత్మక విద్య, ప్రొఫెషనల్‌ లెర్నింగ్, టీచింగ్‌ విధానానికి అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. విద్యార్థులకు అర్థమయ్యేలా క్లాస్‌ రూమ్స్‌ ప్రాక్టికల్స్‌తోపాటు డిజిటల్‌ లిటరసీ విధానం అమలు చేస్తామన్నారు. ఈ సమావేశంలో స్కాట్లాండ్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ అలన్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు