సమ్మెలో సారోళ్లు..!

12 Dec, 2016 14:41 IST|Sakshi
సమ్మెలో సారోళ్లు..!
- ఉద్యోగభద్రత కోసం దీక్షలకు దిగిన కాంట్రాక్ట్‌ లెక్చరర్లు
– జిల్లాలో మూత పడ్డ జూనియర్‌ కాలేజీలు
– ఆరు రోజులైనా స్పందించని ప్రభుత్వం
- పరీక్షలు దగ్గపడుతుండటంతో ఆందోళనలో విద్యార్థులు
 
ఎముక లేని నాలుక ఏమైనా మాట్లాడుతుందనే రీతిగా చంద్రబాబు ఎన్నికల సమయం‍లో అడిగిన వారందరికీ హామీలిచ్చారు. పనిలో పనిగా కాంట్రాక్ట్‌ లెక్చరర్లకూ తనను గెలిపిస్తే రెగ్యులర్‌ చేస్తానని అభయమిచ్చారు. అందరూ కలిసి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టారు. ఇప్పటికి దాదాపు మూడేళ్లు కావస్తోంది. మరి ఇచ్చిన మాటేమిటంటూ కాంట్రాక్ట్‌ లెక్చరర్లు పలుమార్లు అడిగి చూశారు. అప్పుడూ ఇప్పుడూ అంటూ కాలయాపన చేస్తుండటంతో ఇక కుదరదని సమ్మె బాట పట్టారు. ఉద్యోగ భద్రత కల్పించేంత వరకు చదువులు చెప్పేది లేదని తెగేసి చెబుతున్నారు. ఫలితం‍గా ఆరు రోజులుగా జిల్లాలోని కళాశాలలు మూత పడ్డాయి. 
 
 
కర్నూలు సిటీ: తమ పార్టీని గెలిపిస్తే కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తామని టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. ఆ హామీని నెలబెట్టుకోవాలంటూ డిగ్రీ, ఇంటర్‌ కాలేజీల కాంట్రాక్ట్‌ లెక్చరర్లు ఆందోళన బాట పట్టారు. మరో మూడు నెలల్లో పరీక్షలు జరుగనున్న సమయంలో కాలేజీలు మూత పడటంతో పేద విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వ కాలేజీలలోనే తమ పిల్లలను చేర్పించాలని, అక్కడే నాణ్యమై విద్య అందుతుందని ప్రచారం చేసే ప్రభుత్వం అక్కడ రెగ్యులర్‌ లెక్చరర్లు లేరని మాత్రం చెప్పడం లేదు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల పేద విద్యార్థులు అధిక శాతం ప్రభుత్వ కాలేజీల్లోనే చదువుతున్నారు. జిల్లాలో 42 ప్రభుత్వ జూనియర్, 17 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. వీటిలో సుమారు 30 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు.
 
సబ్‌ కమిటీ ఏర్పాటుకే పరిమితమైన హామీ
ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్‌ పద్ధతిన పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్‌ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు కామినేని, యనమల, గంటా శ్రీనివాసరావు, పల్లె రఘునాథ్‌రెడ్డిలతో కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఏర్పాటుకే బాబు హామీ పరిమితమైంది. ఈ కమిటీ ఐదు సార్లు çసమావేశం అయినా ఒక్కసారి కూడా నలుగురు మంత్రులు కూర్చొని చర్చలు జరపలేదు. 
 
సాంకేతిక సాకుతో రెగ్యులర్‌ చేయని ప్రభుత్వం..
ఏ ప్రభుత్వ శాఖలోనైనా ప్రకటన, నోటిఫికేషన్‌ ద్వారా కాంట్రాక్ట్‌ పద్ధతిన కానీ, రెగ్యులర్‌ పద్ధతిన కానీ భర్తీ చేసుకున్న ఉద్యోగులను రెగ్యులర్‌ చేయవచ్చని 2006లో ఉమాదేవి వర్సెస్‌ కర్ణాటక ప్రభుత్వ కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. రాజ్యాంగంలోని అధికరణం–16 ప్రకారం ఉద్యోగాలు పొంది 3 ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌కు అర్హులేనని బాంబే కోర్టు చెప్పింది. ప్రభుత్వం యాక్ట్‌ 2/1994 సెక‌్షన్‌–2 ప్రకారం పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్, కాలేజీ సర్వీస్‌ కమిషన్, సెలక‌్షన్‌ కమిటీ, ఎంప్లాయ్‌మెంట్‌లలో ఏదో ఒకటి ద్వారా ఎంపిక అయిన వారు రెగ్యులర్‌కు అర్హులు. అయితే కాంట్రాక్ట్‌ అధ్యాపకులు ఏ సర్వీస్, ఏ కమిటీల ద్వారా ఎంపిక కాలేదని, ఏటా 10 నెలలు మాత్రమే పని చేసేందుకు అగ్రిమెంట్‌ చేసుకుంటున్నారనే సాకును చూపి రెగ్యులర్‌ జేయడంలో జాప్యం చేస్తున్నారు.
 
అధ్యాపకుల సమ్మెతో మూతపడ్డ కాలేజీలు..
ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీలలో పని చేస్తున్న కాంట్రాక్ట్‌ అధ్యాపకులు రెగ్యులర్‌ చేయాలని, 10 పీఆర్సీ అమలు చేయాలని నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టడంతో కాలేజీలలో తరగతి గదులు ఖాళీగా ఉంటున్నాయి. దీంతో చాలా చోట్ల కాలేజీలు మూత పడ్డాయి. మంత్రాలయం, ఆస్పరి, హొళగుంద, శ్రీశైలం, కోసిగి తదితర ప్రాంతాల్లో కాలేజీలు అధ్యాపకులు లేకపోవడంతో తలుపులు తెచుకోవడం లేదు.
 
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి: నవీన్‌ కుమార్, ఏపీ కాంట్రాక్ట్‌ అధ్యాపకుల సంక్షేమ సంఘం జేఏసీ కన్వీనర్‌
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్నాం. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రెగ్యులర్‌ చేయాలి. 
 
మరిన్ని వార్తలు