మొరాయించిన సర్వర్లు

24 Jul, 2017 00:10 IST|Sakshi
రెండో రోజు బదిలీ కౌన్సెలింగ్‌లో ఉపాధ్యాయుల పాట్లు 
మూడు గంటలు ఆలస్యంగా పీఈటీల కౌన్సెలింగ్‌ 
భానుగుడి(కాకినాడ) : రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల బదిలీ కౌన్సెలింగ్‌ తొలిరోజు ప్రశాతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. రెండోరోజుకి వచ్చేసరికి సర్వర్లు పనిచేయకపోవడం, వెబ్‌సైట్లో వివరాలు అందుబాటులోకి రాకపోవడంతో గందరగోళ వాతావరణంలో సాగింది. మధ్యాహ్నం ఒంటి గంటకే డీఈవో కార్యాలయానికి చేరిన వ్యాయామోపాధ్యాయులు మూడు గంటల పాటు కౌన్సెలింగ్‌ వాయిదా పడడంతో ఉక్కపోతతో అవస్థలు పడ్డారు. అసలు కౌన్సెలింగ్‌ జరుగుతుందో లేదో అంటూ ఆందోళనతో అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయడం, ఆందోళనగా కన్పించడం వంటి పలు దృశ్యాలు రెండో రోజు సాక్షాత్కరించాయి. అసలే ఆలస్యంగా బదిలీ కౌన్సెలింగ్‌ జరుగుతుంటే ఈ సర్వర్లు కారణంగా మరింత ఆలస్యమయ్యే పరిస్థితి ఉందని ఉపా«ధ్యాయులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వందల్లో ఉపాధ్యాయులకే కౌన్సెలింగ్‌ గందరగోళమైతే మున్ముందు వందలాది మంది విద్యార్థులకు కౌన్సెలింగ్‌ నిర్వహించాల్సి ఉంటుందని, ఇటువంటి సాంకేతిక ఇబ్బందులు భవిష్యత్తులో తలెత్తితే ఆగస్టుకు గానీ బదిలీల ప్రక్రియ పూర్తి కాదని, నేటి నుంచి నిర్వహించే కౌన్సెలింగ్‌లో ఇబ్బందులు రాకుండా చూడాలని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు డీఈవోకు విజ్ఞప్తి చేశారు.
302మందికి కౌన్సెలింగ్‌ 
జిల్లా వ్యాప్తంగా 134 ఖాళీలకు సంబంధించి 302 మంది పీఈటీలు ధరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఆదివారం నిర్వహించిన కౌన్సెలింగ్‌లో 134 మందికి బదిలీ జరిగింది. మిగిలిన ఉపాధ్యాయులకు ఎనిమిదేళ్లు నిండకపోవడం, ఖాళీలు లేకపోవడం తదితర కారణాలతో బదిలీ జరగలేదు.
 అప్‌ గ్రేడేషన్‌ లేకుండా బదిలీలా?
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అప్‌ గ్రేడేషన్‌ ప్రక్రియ జరిగితే జిల్లాలో మాత్రమే పీఈటీల అప్‌గ్రేడేషన్‌ ప్రక్రియ జరగలేదు. 166 మంది పీఈటీలను పీడీలుగా అప్‌గ్రేడ్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. కొందరు ఉపాధ్యాయ సంఘాల నేతల ఫిర్యాదులు, అధికారులకు చిత్త శుధ్ది కొరవడడం కారణంగా ఈ ప్రక్రియ పట్టా లెక్కలేదు. జిల్లాలో బదిలీ ప్రక్రియకు ముందే 166 ఖాళీలు అప్‌గ్రేడ్‌ అయితే బదిలీ ప్రక్రియలో మరిన్ని ఖాళీలు అందుబాటులోకి వచ్చి ఉండేవని, దరఖాస్తు చేసుకున్న వ్యాయామోపాధ్యాయులందరికీ బదిలీ అయ్యే అవకాశం ఉండేదని పీఈటీలు వాపోయారు. ఇది ముమ్మాటికీ అధికారుల వైఫల్యమేనని విమర్శించారు. భవిష్యత్తులో అప్‌గ్రేడ్‌ అయితే ప్రస్తుతం ధరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులకు అవకాశం ఇవ్వాలని వారు కోరారు. ఈ బదిలీ కౌన్సెలింగ్‌లో యూటీఎఫ్‌ నుంచి బీవీ రాఘవులు, టి.కామేశ్వరరావు, పీఆర్‌టీయూ నుంచి పీఎన్‌వీవీ ప్రసాద్, చింతాడ ప్రదీప్‌కుమార్, ఎస్‌టీయూ నుంచి పి.సుబ్బరాజు, కేవీ శేఖర్, ఏపీటీఎఫ్‌ నుంచి నక్కా వెంకటేశ్వరరావు, పీఈటీ అసోసియేషన్‌ నుంచి ఎల్‌.జార్జి, వై.బంగార్రాజు, టీవీఎస్‌ రంగారావు, గోవిందరాజు, నల్లమిల్లి అప్పారెడ్డి పలువురు పీఈటీలు పాల్గొన్నారు.
నేడు పండిట్‌లకు కౌన్సెలింగ్‌ 
నేడు మధ్యాహ్నం 2గంటల నుంచి 190 మంది లాంగ్వేజ్‌ పండిట్‌లకు బదిలీ కౌన్సెలింగ్‌ జరగనుంది. 
మరిన్ని వార్తలు