ఆలస్యంగా ఉపాధ్యాయ బదిలీల కౌన్సెలింగ్‌

27 Jul, 2017 23:41 IST|Sakshi
ఆలస్యంగా ఉపాధ్యాయ బదిలీల కౌన్సెలింగ్‌
తరచూ సర్వర్‌ డౌన్‌
భానుగుడి(కాకినాడ): ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహిస్తున్న ఉపాధ్యాయ బదిలీ కౌన్సెలింగ్‌ తరచూ సర్వర్‌ మొరాయించడంతో ఆలస్యమవుతోంది. బుధవారం జరగాల్సిన ఫిజికల్‌ సైన్స్, పీఎస్‌ హెచ్‌ఎంలకు సంబంధించి కౌన్సెలింగ్‌ను గురువారం సాయంత్రం వరకూ నిర్వహించారు. దీంతో గురువారం కౌన్సెలింగ్‌ కోసం వచ్చిన ఉపాధ్యాయులంతా డీఈఓ కార్యాలయం వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చింది. గురువారం నిర్వహించాల్సిన ఎన్‌ఎస్‌ 423 ఖాళీలకు గాను 620 మందికి, సోషల్‌ స్టడీస్‌ 340 ఖాళీలకు గానూ 480 మందికి  కౌన్సెలింగ్‌ జరగాల్సి ఉండగా రాత్రి పదిగంటల వరకు నిర్వహించినా కేవలం 50 మందికి మాత్రమే నిర్వహించారు. గురువారం పూర్తికావాల్సిన బదిలీల కౌన్సెలింగ్‌ కాకుండానే శుక్రవారం నాటి షెడ్యులు ప్రకటించారు. 388 మంది తెలుగు పండిట్‌లకు, 291 మంది హిందీ పండిట్‌లకు శుక్రవారం కౌన్సెలింగ్‌ జరగాల్సి ఉంది. అయితే నేడు ఎన్‌ఎస్, సోషల్‌ ఉపాధ్యాయులకే సమయం సరిపోతోందని, శనివారం నాటికి గాని ఎల్‌పీలకు జరిగే అవకాశం లేదని అధికారులు చెబుతున్న పరిస్థితి.
ఆగష్టు ఒకటికి కష్టమే:
ఉపాధ్యాయుల బదిలీ కౌన్సెలింగ్‌కు 10600 మంది దరఖాస్తు చేసుకోగా ఇందులో 5600 మంది తప్పనిసరిగా బదిలీ కావాల్సిన వారు, మిగిలిన వారంతా రిక్వెస్ట్‌లు సమర్పించిన విషయం తెలిసిందే. అయితే జిల్లాలో 6500 ఖాళీలున్నట్లు అంచనా. ఈ బదిలీలన్నింటినీ జులై నెలాఖరునాటికి పూర్తిచేసి ఆగష్టు 1న పాఠశాలల్లో చేరేలా ప్రభుత్వం రెండో ధఫా కౌన్సెలింగ్‌ తేదీల్లో పేర్కొంది. అయితే 4300 మంది ఎస్జీటీలకు ఇంకా కౌన్సెలింగ్‌ పూర్తి చేయాల్సి ఉంది. ఎల్‌పీలకు, సోషల్, ఎన్‌ఎస్‌లకు సంబంధించి కౌన్సెలింగ్‌ ఈ నెల 29వరకు కొనసాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆగష్టు ఒకటి నాటికి కౌన్సెలింగ్‌ పూర్తయ్యే అవకాశం లేదు. సర్వర్లు పని చేయకపోవడంతో బదిలీల ప్రక్రియ  మరింత ఆలస్యమై ఆగస్టు మొదటి వారానికి పూర్తయి ఉపాధ్యాయులు రెండో వారంలో కొత్త పాఠశాలలకు వెళ్తారని సంఘాల సభ్యులు పేర్కొంటున్నారు.
వేగంగా నిర్వహిస్తాం
ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10గంటల వరకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నాం. అయినా సాంకేతిక కారణాల వలన అనుకున్న లక్ష్యాలను చేరుకోలేక పోతున్నాం. మరింత వేగంగా కౌన్సెలింగ్‌ను నిర్వహించి అనుకున్న సమయానికి ఉపాధ్యాయులను బడులకు చేర్చాలనే కృతనిశ్చయంతో ఉన్నాం.
ఎస్‌.అబ్రహం, ఇన్‌ఛార్జి డీఈఓ
మరిన్ని వార్తలు