‘పాయింటవుట్‌ చేస్తూ..

29 Mar, 2017 23:01 IST|Sakshi
‘పాయింటవుట్‌ చేస్తూ..
బదిలీ విధివిధానాలపై ఉపాధ్యాయ వర్గాలు ఫైర్‌
వెబ్‌కౌన్సెలింగ్, పనితీరు, మైనస్‌ పాయింట్లపై వ్యతిరేకత 
 
బదిలీల కోసం ఎదురు చూస్తున్న ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ప్రభుత్వం పాయింట్ల ఝలక్‌ ఇచ్చింది. ఈ విధివిధానాలపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. త్వరలో చేపట్టబోయే ఉపాధ్యాయ బదిలీ నిబంధనల్లో పాయింట్ల పితలాటకం ఉపాధ్యాయులను ఇరకాటంలో పడేస్తోంది.
-రాయవరం(మండపేట) 
శల్య పరీక్షగా..
వేసవి సెలవుల్లో ఆన్‌లైన్‌ విధానంలో బదిలీలు చేపట్టేందుకు నిర్ణయించారు. పనితీరు ఆధారంగా పాయింట్లు కేటాయించాలని నిర్ణయించడం ఉపాధ్యాయులకు శల్య పరీక్షగా మారింది. బాగా పనిచేసే వారికి పాయింట్లు ఇస్తూనే.. పనితీరు సరిగా లేని వారికి మైనస్‌ పాయింట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆర్‌సీ నంబర్‌ 4102/ఈఎస్‌టీటీ–2/2016తో ఈనెల 27న జీవో జారీ చేసింది. ఈ విధి విధానాలపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. గతంలో ఆయా కేటగిరీల్లో కేటాయించిన పాయింట్లను తగ్గిస్తూ పనితీరు ఆధారంగా మైనస్‌ పాయింట్లు వేయడం, వెబ్‌ కౌన్సెలింగ్‌ విధానాలపై అభ్యంతరం తెలుపుతున్నాయి. ప్రభుత్వం కావాలనే ఇలాంటి నిర్ణయం తీసుకుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
వెబ్‌ కౌన్సెలింగ్‌తో తంటాలు..
ఈ ఏడాదీ బదిలీల్లో వెబ్‌కౌన్సెలింగ్‌కే ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. దీనిని కూడా ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. వెబ్‌ విధానంలో కౌన్సెలింగ్‌లో జిల్లాలోని ఖాళీ పోస్టులన్నింటికీ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. దీర్ఘకాలికంగా బదిలీలకు నోచుకోని టీచర్లు వందల సంఖ్యలో ఆప్షన్లు ఇవ్వాల్సి వస్తుంది. భార్యాభర్తలు(స్పౌజ్‌) కేటగిరీకి సంబంధించి ఇద్దరికీ ఎక్కడ పోస్టింగ్‌ వస్తుందో తెలియని పరిస్థితి. అన్యాయం జరిగినా అడిగే అవకాశం లేదు. వెబ్‌ ఆప్షన్ల కోసం నెట్‌ సెంటర్ల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. 
ఇదెక్కడి విధానం..
విద్యా సంవత్సరం ఆరంభం నుంచి విద్యాశాఖ పలు కార్యక్రమాలు అమలు చేయడంతో ఉపాధ్యాయులు బిజీబిజీగా ఉన్నారు. మధ్యాహ్న భోజన పథకం, కిచెన్‌ గార్డెన్లు, మరుగుదొడ్లు, పర్యవేక్షణ, భవన నిర్మాణాలు, బయోమెట్రిక్‌ హాజరు, డైస్, సమ్మెటివ్‌ పరీక్షలు వంటి కార్యక్రమాల్లో తలమునకలై ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పనితీరు ఆధారంగా పాయింట్లు కేటాయించడం ఉపాధ్యాయులను వేధించడమేనని ఉపాధ్యాయ సంఘాలు గళమెత్తుతున్నాయి. 
పాయింట్లు కేటాయింపు ఇలా..
* గతంలో ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు పది పాయింట్లు ఇస్తే ఇప్పుడు నాలుగు పాయింట్లు కేటాయించారు. * స్పౌజ్‌ కేటగిరీకి పది పాయింట్ల నుంచి నాలుగు పాయింట్లకు తగ్గించారు. అవివాహిత ఉపాధ్యాయురాలికి పది నుంచి నాలుగు పాయింట్లకు కుదించారు. 
* విధులకు సక్రమంగా హాజరు కాకుంటే మైనస్‌ మూడు పాయింట్లు, టెన్త్‌లో 50శాతానికి తక్కువగా ఉత్తీర్ణత వస్తే మైనస్‌ 5, ఫార్మేటివ్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత తగ్గితే మైనస్‌ 3, టీచర్‌ వివరాలు డీఈవోకు సమర్పించకుంటే మైనస్‌ 2 పాయింట్లు ఇవ్వనున్నారు.
* సాధారణంగా కేటగిరీ–4 ప్రాంతంలో పనిచేస్తుంటే నాలుగు పాయింట్లు, కేటగిరీ–3లో పనిచేస్తే రెండు పాయింట్లు, రేషనలైజేషన్‌లో పోస్టు పోతే 2, ఎన్‌రోల్‌మెంట్‌ పెంచితే 2, హాజరు శాతం బాగుంటే 2, విద్యార్థులకు పరీక్షల్లో ఏ గ్రేడ్‌ అధికంగా వస్తే 3, టెన్త్‌లో ఏ గ్రేడ్‌కు 3, 90–95శాతం మార్కులు వస్తే 2, విద్యార్థులు ప్రతిభా అవార్డు సాధిస్తే 2, పేరెంట్‌ టీచర్‌ సమావేశాలకు 2, విద్యార్థుల ఆటలకు ప్రాధాన్యమిస్తే 2, హెల్త్‌కార్డులు సక్రమంగా ఉంటే 2, 95 శాతం మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తే 2, బడిరుణం తీర్చుకుందాంలో రూ.పది లక్షల విరాళాలు సేకరిస్తే 2, జిల్లా స్థాయి పోటీల్లో విద్యార్థులు పాల్గొంటే 2, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటే 5 పాయింట్ల వంతున కేటాయిస్తారు.
* ప్రోత్సాహానికి రెండేసి పాయింట్లు కేటాయిస్తే, లక్ష్యాన్ని చేరుకోలేని వారికి ఇచ్చే మైనస్‌ పాయింట్లు రెండు కంటే ఎక్కువగా తగ్గించడం ప్రభుత్వం ఉపాధ్యాయులపై ఉన్న వ్యతిరేక భావనను తెలియజేస్తుందని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. 
చర్చలు విఫలమైతే..
విద్యాశాఖ ఉన్నతాధికారులతో చర్చలు విఫలమైతే ఉపాధ్యాయ సంఘాలు ఐక్య పోరాటం చేయక తప్పదు. పదో తరగతి స్పాట్‌ బహిష్కరణతో పాటు ధర్నాకూ దిగుతాం. 
– టి.కామేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్‌
దుర్మార్గమైన ఆలోచన..
మైనస్‌ పాయింట్లు కేటాయించాలన్నది దుర్మార్గమైన ఆలోచన. వెబ్‌ కౌన్సెలింగ్, పాయింట్ల విధానాన్ని ప్రభుత్వం బేషరతుగా విరమించుకోవాలి. ఉపాధ్యాయులను ఒత్తిడికి గురి చేయడమే ప్రభుత్వ ధోరణిగా కన్పిస్తోంది. 
– కవి శేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎస్టీయూ..
మరిన్ని వార్తలు